పెళ్లి సమయానికి గుండె పోటుతో వరుడు మృతి.. మరో యువకుడికి ఇచ్చి పెళ్లి

0
877

విశాఖపట్నం మధురవాడ సృజన ఉదంతాన్ని మరిచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. పెళ్లి సమయానికి వరుడు చనిపోయాడు. గుండెపోటు కారణంగా అతడు చనిపోయాడు. అయితే పెళ్ళికి వచ్చిన మరొక యువకుడితో వధువు పెళ్లి జరిపించారు.

వరుడు గుండె పోటుతో మృతి చెందడంతో వధువును మరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా హోళిగంద మండలం గజ్జహల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గజ్జహల్లి గ్రామానికి చెందిన యువతి, చిన్నతంబళం గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు బంధువులను పిలుచుకున్నారు. పెళ్లి జరుగుతున్న సమయంలో వరుడికి ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వరుడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. వధువు తల్లిదండ్రులు వెంటనే తన దగ్గరి బంధువైన వందవాగిలి గ్రామానికి చెందిన నబి రసూల్ తో పెళ్లి చేసేసారు.

కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు మండలం చిన్న తుంబలం గ్రామానికి చెందిన అబ్దుల్ హమీద్ పదవ తరగతి వరకు చదువుకున్నాడు..స్వగ్రామంలోనే ఎలక్ట్రిషన్ గా పని చేస్తున్నాడు. అబ్దుల్‌ హమీద్‌కు హోళగుంద మండలం గ్రామానికి చెందిన యువతితో పెళ్లి ఖాయమైంది. మే 22న నిఖా జరగాల్సి ఉంది. పెళ్ళికొడుకు, వారి బంధువులు అందరూ పెళ్లికూతురు ఊరు అయిన గజ్జెహళ్లికి చేరుకున్నారు. రాత్రి ఫంక్షన్ లో నొప్పి మరింత ఎక్కువ కావడంతో సమీప సిరిగుప్ప ఆసుపత్రికి తరలించారు బంధువులు. చికిత్స పొందుతూ అబ్దుల్‌ హమీద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి జరగాల్సిన సమయానికి గంట ముందే చనిపోయాడు. అయితే అదే ముహూర్తానికి బంధువుల అబ్బాయితో మాట్లాడుకుని పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. దురదృష్టవశాత్తూ పెళ్ళికొడుకు మృతిచెందడంతో ముందుగా అనుకున్న దాని ప్రకారం హోళగుంద మండలం వందవగిలి గ్రామానికి చెందిన నబి రసూల్ తో పెళ్లి చేశారు. నబి రసూల్ పెళ్ళికి అంగీకరించడం, పెళ్లి కూతురు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అంగీకరించడంతో పెళ్లి జరిగిపోయింది.