వైఎస్సార్ పేరు చెబితే చాలామందికి ఓ రాజకీయ ప్రముఖుడే గుర్తుకొస్తారు. కానీ, పాత్రికేయ లోకానికి మాత్రం ఆ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది యెన్నా శ్రీనివాసరావే..! ముఖ్యంగా ’90వ దశకంలో పనిచేసిన పత్రికా జర్నలిస్టుల్లో వైఎస్సార్ అంటే తెలియని వారు లేరనే చెప్పాలి. ఒకసారి వైఎస్సార్ పరిచయమైతే, ఆ జ్ఞాపకాలను పదిలపరచుకుని జీవితాంతం నెమరు వేసుకునే వారే ఎక్కువ. ఎందుకంటే, అతను అందరి మధ్యలోనే ఉంటాడు, కానీ ఏ ఒక్కరికీ చెందడు..! ప్రతి ఒక్కరూ అతను తన మిత్రుడే అనుకుంటారు కానీ అతను మాత్రం అందరివాడు..! ఆమాటకొస్తే, అతను పాత్రికేయ లోకానికి మాత్రమే పరిమితమైనవాడు కూడా కాదు. అతని సాయం పొందిన వేలాది మందికి చిరస్మరణీయుడు. అతనితో స్నేహం చేసి, అతని గురించి లోతుగా తెలుసుకున్న మిత్రులకు ప్రాతఃస్మరణీయుడు..!
నిన్నగాక మొన్న కన్నుమూసిన వైఎస్సార్ మంచితనానికి నిలువెత్తు నిదర్శనం. సరిగ్గా పది రోజుల కిందట వైఎస్సార్ (56) కరోనా బారిన పడ్డాడని, ఓ పాత్రికేయ మిత్రుడు ఆస్పత్రిలో చేర్పించాడనీ తెలిసింది. మరో గంటలో ఆ వార్త దావానలంలా వ్యాపించింది. పేరు ప్రఖ్యాతులున్న జర్నలిస్టులు రంగంలోకి దిగారు. వైఎస్సార్ కోసం అప్పటికప్పుడే ఓ వాట్సప్ గ్రూప్ వెలిసింది. విరాళాల సేకరణ ప్రారంభమైంది. ఎవరూ ఎవరినీ అడగలేదు. కానీ, అందరూ ముందుకొచ్చి యధాశక్తి సాయం అందించారు. ఎందుకంటే, తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా, ఉన్నదంతా పొరుగువాడికోసం ఖర్చు చేసే వైఎస్సార్ మనస్తత్వం గురించి మిత్రులందరికీ తెలుసు గనుక. విచిత్రమేమిటంటే, వీరిలో చాలామంది వైఎస్సార్ ను గత పదేళ్లుగా ముఖాముఖి కలిసినవారు కారు. కనీసం ఫోన్ లో కూడా మాట్లాడి ఉండరు కూడా. కానీ, అతనికి బాగోలేదంటే, తమ అన్నకో, తమ్ముడికో ప్రాణం మీదకు వచ్చిందన్నంతగా బాధ పడినవారే ఎక్కువ. అంతలా అందరూ ‘నావాడు’ అనుకునేలా చేసిన వ్యక్తిత్వం అతని సొంతం.
శ్రీనివాసరావు సంస్కృతాంధ్ర భాషల్లో నిష్ణాతుడు. ఎంఏ, ఎంఫిల్ చేసి, జర్నలిజంలోకి అడుగుపెట్టాడు. వృత్తిధర్మానికి అంకితమైన పాత్రికేయుడతను. విలువలతో రాజీ పడకుండా కత్తిమీదసాములాంటి పాత్రికేయ వృత్తిని చేపట్టి, పదుగురినీ మెప్పించినవాడు. వృత్తిధర్మాన్ని జీవితానికీ అన్వయించుకుని, నిరంతరం పదిమందికీ సాయపడటంలోనే తృప్తిని పొందేవాడు. అప్పుడప్పుడు ఉన్నట్టుండి నాలుగైదు నెలలు మాయమయ్యేవాడు. ఎక్కడికి వెళ్లావంటే ఏమీ చెప్పేవాడు కాదు. తీరా ఎవరి ద్వారానో తెలిసేది.. శ్రీశైలం అడవుల్లోకి వెళ్లి, అక్కడి చెంచులతో సహజీవనం చేస్తూ, వారికి నాలుగు అక్షరమ్ముక్కలు నేర్పేందుకు ప్రయత్నించేవాడని. అలాగే సున్నిపెంటలో ఒక అనాథ శరణాలయాన్ని కూడా ఏర్పాటు చేసి నడిపాడట. అంతేకాదు, ఒక గిరిజన బాలికను తెచ్చి, ఇంట్లోనే ఉంచుకుని, చదువు సంధ్యలు చెప్పి, పెద్దదాన్ని చేశాడు.
చిన్న వయసులోనే ఆర్య సమాజ్ పత్రికకు సంపాదక బాధ్యతలు నిర్వహించాడు. ఆ మధ్య జాగృతి పత్రికకూ ఎడిటర్ గా పనిచేశాడు. ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రికల్లో పనిచేసి, ఆంధ్రప్రభకు వచ్చాడు. అక్కడ మూడేళ్లు పనిచేసి బయటకు వెళ్ళాక, ఆ తర్వాత ఎక్కడా ఓ రెండేళ్లు కూడా పని చేసి ఎరుగడు. విలువలతో రాజీ పడకలేకపోవడం అతని బలహీనత మరి. ఒకరోజు అతను రాసిన వార్తలో ఓ పదంపై సంపాదకులవారు అభ్యంతరం తెలిపారు. అదే విషయాన్ని వైఎస్సార్ ను పిలిచి చెప్పారు. ఆయన మాటలను సవినయంగా విని, బయటకు వచ్చి, ఒక నిఘంటువు తీసుకువెళ్లి చూపించి, తను రాసిన పదం కరెక్టేనని నిరూపించాడు. అలాగని, బయటకొచ్చి, కాలరెగరేస్తాడనుకుంటే మనం పొరబడినట్టే. ఆ మరుక్షణమే ఆ విషయాన్ని మరచిపోతాడు. మనం గుర్తుచేసినా, చిన్నగా నవ్వి, మాట తప్పిస్తాడు.
మరోసారి సంపాదకుడు పిలిచి, ఫలానా స్వామీజీ ఓ యాగం చేస్తున్నారనీ, అది కవర్ చేసుకుని రమ్మని వైఎస్సార్ ని పంపించారు. ఆ తతంగాన్ని కవర్ చేసుకుని వచ్చి, సాయంత్రం రిపోర్టు రాసి ఇచ్చేశాడు. రాత్రి తొమ్మిది గంటల వేళ ఎడిటర్ గారు ఆ రిపోర్టు చదివారు. అంతే, వైఎస్సార్ పై అగ్గిమీద గుగ్గిలంలా ఎగిరి పడ్డారు. “ఏం రాశావయ్యా, బుర్ర ఉండే రాశావా..?” అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. వైఎస్సార్ మాత్రం తనదైన ధోరణిలో శాంతంగా “అక్కడ జరిగిందే రాశాను సార్” అన్నాడు. అందుకు ఎడిటర్ ఒప్పుకోకుండా, మార్చి రాయమని హుకుం జారీ చేశారు. వైఎస్సార్ కూడా ఏమాత్రం తగ్గకుండా, అంతే వినయంగా, “సార్ అక్కడ ఏం జరిగిందో చూసి రాసింది నేను. ఎలా మార్చమంటారు..? నా వల్ల కాదండీ” అని తేల్చేశాడు. ఇంతకీ వైఎస్సార్ ఏం రాశాడంటే.. సదరు స్వామీజీ యజ్ఞక్రతువు నిర్వహించిన వైనాన్నంతా సవివరంగానే రాస్తూ, చివర్లో స్వామీజీ హోమగుండంలోంచి శివలింగాన్ని తీస్తానని హడావిడి చేసి, అప్పటికే ఆ పక్కన ఉంచుకున్న శివలింగాన్ని అకస్మాత్తుగా పైకి ఎత్తి పట్టుకుని, దాన్ని హోమంలోంచే తీశానని బిల్డప్ ఇచ్చాడట. అదే రాశాడు వైఎస్సార్..!
ఒకసారి రాత్రి బాగా పొద్దుపోయాక, పని పూర్తి చేసుకుని, రాత్రి 11 గంటల వేళ స్కూటర్ తీశాడట. తీరా చూస్తే, స్కూటర్లో పెట్రోల్ లేదని తెలిసి, దగ్గర్లోనే ఉన్న బంకుకు బండిని తోసుకుంటూ వెళ్లాడట. మరికాసేపటికి బండిని అలాగే తోసుకుని వచ్చి, ఆఫీసులోనే పార్క్ చేస్తుంటే, ఓ మిత్రుడు ‘అదేంటి వైఎస్సార్, బంక్ మూసేశారా..?’ అనడిగాట. అయితే, దారిలో ఎవరో అపరిచితుడు కనబడి, మూడు రోజులుగా ఏమీ తినలేదని, ఏదైనా సాయం చేయమనీ అడిగితే జేబులో ఉన్న 60 రూపాయలూ ఇచ్చేశానని చెప్పాడట. విలేఖరుల సమావేశాలకు వెళ్తే, జర్నలిస్టులకు కాఫీ, టీలు ఆఫర్ చేయడం, ఓ బాల్ పాయింట్ పెన్నూ, నోట్ బుక్కూ ఇవ్వడం రివాజు. వైఎస్సార్ వాటిని కూడా సున్నితంగా తిరస్కరించేవాడు. అంతెందుకు, పెళ్లి చేసుకుంటే, పదిమందికీ సాయం చేయలేకపోతానేమోనని జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయిన వ్యక్తి తను. ఇలాంటి వాడు ఒకడు మనమధ్య సంచరించాడని ముందు తరాల వారికి చెబితే, నమ్మరేమోనని ఓ పాత్రికేయ మిత్రుడు చేసిన వ్యాఖ్య వైఎస్సార్ విషయంలో అక్షర సత్యం.
ఒక్క మాటలో చెప్పాలంటే అతని మనసు మధురం.. మనిషిగా అతను మహోన్నతం..! ఒకసారి వైఎస్సార్ ఏదో పని మీద నారాయణఖేడ్ మీదుగా వెళ్తుంటే, ఎదురుగా ఒక ఒంటెల గుంపు కనిపించిందట. అతనిలో ఏదో అనుమానం మొదలైంది. ఆ ఒంటెల కాపర్లను ఆపి ప్రశ్నిస్తే, వాటిని హైదరాబాద్ కు తీసుకువెళ్తున్నామని, త్వరలో జరగబోయే ఒక పండుగనాడు ఆ మూగజీవాల్ని వధించి తింటారని చెప్పారట. అంతే, అప్పటికప్పుడు, సంబంధింత అధికారులను మేల్కొలిపి, వాటిని వెనక్కి పంపేదాకా విశ్రమించలేదట. కొసమెరుపు ఏమిటంటే, ఇలా ఒంటెల్ని వెనక్కి తీసుకువెళ్తే తమకు నష్టమని ఆ ఒంటెల కాపర్లు వాపోతే, అప్పటికప్పుడు డబ్బు అప్పుచేసి మరీ వారికిచ్చి పంపించాడట. అల్ కబీర్ పశు వధశాలలో ఆవుల్ని వధించడంపై కూడా వైఎస్సార్ పెద్ద ఉద్యమమే చేశాడు. మరోసారి 300 ఒంటెల గుంపును హైదరాబాద్ తరలిస్తుంటే, వైఎస్సార్ అడ్డగించి, వాటిని వెనక్కి తింపి పంపాడట. అవి వెను తిరిగాక, అతనికి అనుమానం వచ్చిందట.. మళ్లీ వాటిని వెనక్కి తీసుకొస్తారేమోనని. దాంతో ఓ కారు మాట్లాడుకుని, తానే స్వయంగా వాటిని అనుసరిస్తూ రాజస్తాన్ వరకూ వెళ్లి, వాటిని అక్కడ వదిలి వచ్చాడట.
ఏం చేసినా, అతనిది ఒంటరి పోరాటమే. అప్పుడప్పుడు ప్రాణాల మీదకు వచ్చిన సంఘటనలూ లేకపోలేదు. కానీ డోన్ట్ కేర్.. దటీజ్ వైఎస్సార్..! ఇంతకీ వైఎస్సార్ ఎక్కడి వాడు, ఎవరివాడు, అతని పుట్టుపూర్వోత్తరాలేమిటి అంటే, ఎవరికీ తెలియదు. కులగోత్రాల గురించి, స్వవిషయాల గురించి ఎవరికీ చెప్పుకోడు. తన కష్టనష్టాల గురించి చెప్పుకోవడానికి అసలే ఇష్టపడడు. కానీ. అందరి కష్టాలూ అతనికే కావాలి. అది అతని నైజం. (అతనికి ఓ అన్న, అక్క, తమ్ముడు ఉన్నారట. చిన్నప్పుడే వైఎస్సార్ ను పెద నాన్నగారికి దత్తత ఇచ్చారట. చిన్ననాటినుంచీ వైఎస్సార్ లో ధార్మిక చింతన ఎక్కువట. ఎప్పుడూ ఇతరులకు ఎలా సాయం చేయాలా అనే ఆలోచించేవాడట. ఈ వివరాలన్నింటినీ వైఎస్సార్ పోయాక, ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాల కోసం నన్ను సంప్రదించిన ఆయన తమ్ముడు వెంకట రమణ ద్వారా తెలిశాయి. తను కన్నుమూసేందుకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఫోన్ చేసి, తన పరిస్థితిని తెలియజేశాడనీ, అప్పటివరకూ తమకు ఈ సంగతే తెలియదని ఆయన కన్నీరు పెట్టుకున్నారు.)
వైఎస్సార్ ఒక నిరంతర బాటసారి. దారిలో ఎదురైన వారికి సాయం చేసుకుంటూపోవడమే తప్ప, వెనుదిరిగి చూడటం తెలియని మనిషి. ఎంతోమంది అతనితో స్నేహం చేద్దామని ఉవ్విళ్లూరేవారు. కానీ ఎవరికీ కట్టుబడేవాడు కాదు. అతనికి కావలసింది పీడితులూ, తాడితులూ, బాధాసర్పదష్టులూ మాత్రమే. వారు కనిపిస్తేనే ఆగుతాడు, చేయూతనందిస్తాడు, వారు తేరుకున్నాక తను ముందుకు సాగిపోతాడు. ఇదీ అతని నైజం. (విషాదమేమిటంటే.. ఈ మధ్యనే పిహెచ్ డి చేయాలనే తలంపు కలిగి, సబ్జెక్ట్ రిజిష్టర్ చేయించుకున్నాడట. తను ఎంచుకున్న సబ్జెక్టు ‘మృత్యువు- ఒక భావన! ’ బహుశా, ఆ సబ్జెక్టుపై పరిశోధన కోసమేమో, తరలివెళ్లిపోయాడు.)
చివరగా, మరో విషయం చెప్పాలి. పరిస్థితి సీరియస్ గా ఉందనీ, వెంటలేటర్ అమరుస్తామని డాక్టర్లు వైఎస్సార్ కు చెబితే, అతను సున్నితంగా తిరస్కరించాడట. వెంటిలేటర్ పెట్టినా, ప్రయోజనం ఉండదని తనకు తెలుసుననీ, కాబట్టి నన్ను ఇలాగే ప్రశాంతంగా పోనివ్వమని చెప్పాడట. అంతటితో ఊరుకోకుండా, వెంటిలేటర్ పెట్టనందుకు డాక్టర్లను ఎవరైనా తప్పు పడతారేమోనని తానే వెంటలేటర్ ను వద్దన్నట్టు ఉత్తరం రాసి మరీ ఇచ్చాడట. కబళించేందుకు వస్తున్న మృత్యువుకు ధైర్యంగా స్వాగతం పలికిన ధీరోదాత్తుడు వైఎస్సార్.
ఇప్పుడు వైఎస్సార్ లేడు.. కానీ, నాలాంటి ఎందరో మిత్రులకు, పాత్రికేయులకు అతను మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉన్నాయి. వాటిని నెమరు వేసుకుంటూ అతని బాటలో సాగేందుకు ప్రయత్నించడమే, ఆ మహనీయుడికి సరైన నివాళి.