More

    ముస్లిం, క్రైస్తవ.. ఇతర సమూహాల వివాహ చట్టాలను కూడా సవరించనున్న కేంద్ర ప్రభుత్వం

    దేశంలో అమ్మాయిల చట్టబద్ధమైన కనీస వివాహ వయసును 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకు రానుంది. ఇటీవల నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి బాల్యవివాహాల నిరోధక చట్టం, 2006కు సవరణలు చేసేలా బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దేశంలోని అమ్మాయిలందరికీ ఒకే కనీస వివాహ వయసు ఉండేలా ఆయా సంఘాల వ్యక్తిగత చట్టాలను మార్చే లా బిల్లులో పలు ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో అబ్బాయిలకు చట్టబద్ధమైన కనీస వివాహ వయసు 21 సంవత్సరాలు కాగా అమ్మాయిలకు 18 సంవత్సరాలు. ఇద్దరి కనీస వివాహ వయసులో అంతరాన్ని చెరిపేసేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

    హిందువుల కోసం 1955లో హిందూ వివాహ చట్టాన్ని తెచ్చారు. అమ్మాయిలకు కనీస వివాహ వయసు 18 సంవత్సరాలు కాగా, అబ్బాయిలకు 21. ప్రత్యేక వివాహ చట్టం-1955, బాల్య వివాహాల నిరోధక చట్టం-2006 కూడా ఈ నిబంధనలనే సూచిస్తున్నాయి. యుక్తవయసు వచ్చిన వారికి పెళ్లి చేయొచ్చనే ప్రత్యేక నిబంధనలను ముస్లింలు పాటిస్తున్నారు. వివిధ మత సంఘాలు వివాహ వయసుపై ప్రత్యేక నియమాలను పాటిస్తున్నాయి. చిన్న వయసులోనే పెళ్లి కావడంతో తక్కువ వయసులోనే గర్భం దాల్చడం వల్ల తల్లి, బిడ్డల్లో ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మాతా-శిశు మరణాలు పెరుగుతున్నాయి. అమ్మాయిల కనీస వివాహ వయసు తక్కువగా ఉండటంతో వారి కెరీర్‌కు అవరోధంగా మారింది.

    అమ్మాయిల కనీస వివాహ వయసులో సవరణల కోసం గతేడాది జూన్‌లో కేంద్రం జయ జైట్లీ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయ జైట్లీ నేతృత్వం వహించగా.. నీతిఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమశాఖ, న్యాయ శాఖ కార్యదర్శులు, సీనియర్‌ అధికారులు సభ్యులుగా ఉన్నారు. దేశంలోని 16 విశ్వవిద్యాలయాలు, వేలాది కాలేజీలు, స్కూళ్లు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, మతసంఘాలు, అట్టడుగు వర్గాల వారిపై ఈ సర్వే జరిపి గత డిసెంబర్‌లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అమ్మాయిల కనీస వివాహ వయసును పెంచాల్సిన అవసరమున్నదని కమిటీ అభిప్రాయపడింది.

    ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తిగత చట్టాలను సవరిస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నిర్ణయ భారం హిందువులపై మాత్రమే పడుతుందని ఊహాగానాలు వచ్చాయి. ప్రస్తుతం 15 ఏళ్లుగా ఉన్న మహిళల కనీస వివాహ వయస్సును సవరించేందుకు ముస్లిం పర్సనల్ లాలో ఏదైనా మార్పు చేస్తారా అనేది అస్పష్టంగా ఉంది. ప్రత్యేక వివాహ చట్టంతో పాటు భారతదేశంలోని అన్ని ఇతర వ్యక్తిగత చట్టాల కోసం, వధువు కనీస వయస్సు 18 సంవత్సరాలు అయితే వరుడికి అదే 21 సంవత్సరాలు. ముస్లిం వ్యక్తిగత చట్టం 15 సంవత్సరాల వయస్సులో వారి అమ్మాయిలను వివాహం చేసుకునే హక్కును కమ్యూనిటీకి ఇస్తుంది. మహిళల వివాహ వయస్సును 21కి పెంచేందుకు అన్ని వ్యక్తిగత చట్టాలను కూడా సవరించనున్నట్లు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.

    ‘భారత క్రైస్తవ వివాహ చట్టం, 1872’; ‘పార్సీ వివాహం మరియు విడాకుల చట్టం, 1936’; ‘ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్, 1937’; ‘ప్రత్యేక వివాహ చట్టం, 1954’; ‘హిందూ వివాహ చట్టం, 1955’; ‘విదేశీ వివాహ చట్టం, 1969’, ‘హిందూ మైనారిటీ అండ్ గార్డియన్‌షిప్ యాక్ట్, 1956’ అనే చట్టాలు; ‘హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, 1956’ లను కూడా సవరించబోతున్నారు.

    Trending Stories

    Related Stories