భారత త్రివిధ దళాల్లో నాలుగేళ్ల పాటు సేవలు అందించేందుకు యువతకు అవకాశం ఇచ్చేలా కొత్తగా ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై భారత్ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీంతో ‘అగ్నిపథ్’ పథకం విషయంలో రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ‘అగ్నిపథ్’ పథకం వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అభ్యర్థుల వయో పరిమితిని రెండేళ్లు పెంచింది. తొలుత 17 ఏళ్ల నుంచి 21 ఏళ్ల యువకులు ఈ పథకానికి అర్హులని కేంద్రం ప్రకటించింది. తాజాగా గరిష్ఠ వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. ఈ వయో పరిమితి ఈ సంవత్సరానికి మాత్రమే చెల్లుబాటు అవుతందని స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా ఆర్మీలో కొత్త నియామకాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సాయుధ బలగాల్లోకి మున్ముందు మరింత మందిని తీసుకుంటామని..ప్రస్తుత నియామకాలను మూడు రెట్లు చేస్తామని కేంద్రం వెల్లడించింది. అగ్నిపథ్ పథకం కింద 46 వేల మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ‘అగ్నివీరులు’గా పిలుస్తారు. వీళ్లను ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో నాలుగేళ్ల పాటు నియమించనున్నారు.