ఆర్మీపై పాక్ యూట్యూబ్ ఛానళ్ల భారీ కుట్ర.. అప్రమత్తమై బుద్ది చెప్పిన కేంద్రం

0
952

వార్తను వార్తలా చూపించడం ఎప్పుడో మరిచిపోయారు. అలాగే సోషల్ మీడియా వచ్చాక ఫేక్ వార్తలు అధికం అయ్యాయి. అందులోనూ సోషల్ మీడియా వేదికగా భారీ కుట్రలకు తెర తీస్తున్నారు. అసాంఘీక శక్తులు డిజిటల్ మీడియాను ఉపయోగించుకొని విధ్వంసాలకు పాల్పడుతున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం వీటిపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే గతంలో కొన్ని యూట్యూబ్, వెబ్ సైట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తాజాగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వెబ్ సైట్ లపై కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనిపై సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఒక ప్రకటన చేశారు. 20 వెబ్ సైట్ లపై చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పారు. పొరుగుదేశాల నుంచి ఈ వెబ్ సైట్ లు నడుస్తున్నాయని, వాటిని గుర్తించామని తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం 20 యూట్యూబ్ ఛానళ్లు, రెండు వెబ్ సైట్లపై చర్యలు తీసుకుంది. ఈ ఛానళ్లు భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు నకిలీ వార్తలను ప్రసారం చేస్తున్నాయి.

అవి ప్రసారం చేస్తున్న వార్తల్లో అత్యదికం సున్నితమైనవేనని, జాతీయ భద్రతకు భంగం కలిగించేవేనని కేంద్ర ప్రకటించింది. అదే విధంగా రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ప్రజాస్వామిక ప్రక్రియకు విఘాతం కలిగే కంటెంట్ ను ఉపయోగించి దెబ్బతీయాలని కుట్రపన్నుతున్నాయని ఠాకూర్ మండిపడ్డారు. ఈ ఛానళ్లు, వెబ్ సైట్ లు భారత వ్యతిరేక కుట్రలకు పాల్పడతున్నాయని అన్నారు. ఆధారాలతో సహా నిరూపించగలిగామని, వాటిని నిషేధించేందుకు యూట్యూబ్ కూడా ఒప్పుందని అనురాగ్ వివరించారు. భవిష్యత్ లో కూడా ఏదైనా ఛానల్, వెబ్ సైట్ ఇలాంటి చర్యలకు పాల్పడితే వాటిపై చర్యలకు ఉపక్రమిస్తామని అన్నారు. నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తూ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నడమే కాకుండా సమాజాన్ని విడదీయాలని చూస్తే ఊరుకోబోమన్నారు.

చర్యలు ఎదుర్కొబోయే యూట్యూబ్ చానళ్లు అత్యంత సున్నితమైన కశ్మీర్ అంశంతో పాటు భారత సైన్యం, భారత్ లోని మైనారిటీ వర్గాలు, రామ మందిరం, జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై అవాకులు చెవాకులు ప్రసారం చేశాయని ఠాకూర్ చెప్పారు. మరోవైపు ప్రపంచ స్థాయి సర్వేలో యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలపై విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి కాలంలో వీటి ఆగడాలు ఎక్కువయ్యాయని, తద్వారా విశ్వసనీయత చాలా మట్టుకు కోల్పోయాయని ఆ సర్వే వెల్లడించింది.

నకిలీ వార్తల ప్రసారంలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగిపోయిందని సర్వే పేర్కొంది. ఎడిల్మెన్ ట్రస్ట్ బారోమీటర్ వార్షిక నివేదికను ప్రతి ఏటా దావోస్ ప్రపంచ ఆర్థిక సమ్మిట్ సందర్భంగా విడుదల చేస్తారు. 76శాతం మంది నకిలీ వార్తలను కొందరు ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ఇందులో 84శాతంతో స్పెయిన్ టాప్ లో నిలిచింది. 82శాతంతో భారత్ ఈ విషయంలో 5వ స్థానంలో నిలిచింది. అక్కడే భారత్ లో ఏ స్థాయిలో నకిలీ వార్తల ప్రవాహం సాగుతుందో ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన నివేదిక అద్దంపడుతోంది.