మంగళవారం నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమదేవి మరణ శిలా శాసనం, కాంస్య విగ్రహం సందర్శనకు గవర్నర్ తమిళిసై వెళ్లారు. అయితే గవర్నర్ కు నల్గొండ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ రెమా రాజేశ్వరీ స్వాగతం పలకాల్సి ఉన్నప్పటికీ వారు హాజరవ్వలేదు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం గవర్నర్ కు స్వాగతం పలికినా.. ఆ వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గవర్నర్ పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సిన అధికారులు రాకపోవడంతో.. ప్రభుత్వ ఆదేశాలతోనే నల్గొండ కలెక్టర్, ఎస్పీలు గవర్నర్ కార్యక్రమానికి హాజరు కాలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో గవర్నర్ తమిళి సై తన పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, ప్రోటోకాల్ పాటించడం లేదని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని అప్పట్లో కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంది. మరోసారి అలాంటి వ్యవహారమే నడుస్తూ ఉంది.