రేపు భద్రాచలంలో పర్యటించనున్న గవర్నర్

0
762

భారీ వర్షాలు, వరదలతో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద వరద నీరు రికార్డ్ స్థాయిలో చేరుకుంది. దీంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఎంతగానో భయపడుతూ ఉన్నారు. అనేక గ్రామాలు వరద నీటితో నిండిపోయాయి. లక్షలాది మంది వరద గుప్పిట్లో చిక్కుకుని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఓ వైపు వరద బాధితుల సహాయార్ధం భారత సైన్యం రంగంలోకి దిగింది. రేపు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రాచలంలో పర్యటించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. స్వయంగా అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించనున్నారు. వరద బాధితులను గవర్నర్ పరామర్శించనున్నారు. ఈరోజు రాత్రి తమిళిసై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకొని.. అక్కడ నుంచి రైలులో భద్రాచలం వరకూ ప్రయాణించనున్నారు. భద్రాచలంకు వరద ముప్పు పొంచి ఉంది. రికార్డ్ స్థాయికి దాటి మరీ చేరుకుంటోంది వరద నీరు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు రోడ్డు మ్యాప్ ను తయారు చేస్తున్నారు. కేసీఆర్ గోదావరి పరివాహక ప్రాంతంలో దెబ్బతిన్న పంటలను, నీట మునిగిన గ్రామాలతో పాటు ప్రాజెక్టులను కూడా పరిశీలించే అవకాశముంది. ఆయన వరద బాధితులతో కూడా మాట్లాడేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.