More

    ఆ మరణాలపై స్పందించిన తెలంగాణ గవర్నర్

    తెలంగాణలోని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ చికిత్సలు వికటించి నలుగురు చనిపోవడం, మరికొందరు మహిళలు ఇన్ఫెక్షన్ బారినపడటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంక్వైరీ కమిటీ విచారణ చేపట్టింది. క్యాంప్‌ జరిగిన రోజు విధులు నిర్వహించిన ఉద్యోగులను ఎంక్వైరీ కమిటీ ప్రశ్నించింది. స్టెఫలో కొకస్‌ బ్యాక్టీరియా వల్ల ఇన్‌ఫెక్షన్‌ సోకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ అయిన మహిళలు మృతి చెందినట్లు సమాచారం. గత నెల 25వ తేదీన 34 మందికి డీపీఎల్‌ కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయగా, వారిలో నలుగురు చనిపోయారు. మిగతా వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. చికిత్స పొందుతున్న 30 మంది మహిళల ఆరోగ్యం నిలకడగా ఉంది.

    ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. త్వరగా ఎక్కువ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్‌, ఆ సమయంలో ఇన్ఫెక్షన్‌ వల్లే కుటుంబ నియంత్రణ చికిత్సలు వికటించి నలుగురు మహిళలు చనిపోయి ఉంటారని ఒక డాక్టర్‌గా తాను భావిస్తున్నట్లు తమిళిసై అన్నారు. కుటుంబ నియంత్రణ చికిత్సలు అంటే మరింత మంది ముందుకు వచ్చేలా చేయాలని, జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తిరిగి జరగకూడదని, ఎక్కువ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్లు సరికాదని స్పష్టం చేశారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను గవర్నర్ తమిళిసై పరామర్శించారు. ఇలా కు.ని. చికిత్సలు వికటించి చనిపోవడం మామూలు విషయం కాదని, ఆమోద యోగ్యం కాదని గవర్నర్ అన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగు పరచాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానని గవర్నర్‌ తెలిపారు. నిమ్స్‌లో జరుగుతున్న చికిత్సలపై బాధితులు సంతృప్తిగా ఉన్నారన్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories