కోటయ్య మరణంపై వివరణ.. ఆనందయ్య ముందుకు అనుమతి

0
783

కృష్ణపట్నంలో ఆనందయ్య మందు గురించి తెలుసుకుని ఎంతో మంది అక్కడికి వెళ్లారు. చాలా మంది ఆనందయ్య మందు వేసుకోవడంతో తమకు బాగైందని తెలిపారు. వారిలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య కూడా ఒకరు. కొన్ని రోజుల క్రితం ఆ మందు వేయించుకున్న కోటయ్య ఆరోగ్యం నిమిషాల్లో మెరుగుపడింది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా పెరిగిపోయాయి. ఆనంద‌య్య మందు వేసుకోగానే నిమిషాల్లో మెరుగుప‌డింద‌ని ఇటీవ‌ల‌ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు బాగా వైర‌ల్ అయింది. ఆ తర్వాత అనారోగ్యం పాలైన కోటయ్య జీజీహెచ్‌లో చికిత్స పొందారు. చివరికి ఆరోగ్యం విష‌మించ‌డంతో ఆయన మృతి చెందారు. కంట్లో చుక్కలు వేసుకున్న వారం రోజుల అనంత‌రం కోటయ్య ఆరోగ్యం క్షీణించడంతో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనను చేర్చారు. మెరుగైన వైద్యం కోసం ఈ నెల 22న‌ నెల్లూరు జీజీహెచ్‌కి తరలించగా అప్ప‌టి నుంచి ఆయ‌న‌ అక్కడే చికిత్స పొందుతూ మరణించారు.

ఈ వార్తలపై ఆనందయ్య మిత్రుడు స్పందించారు. ఈ నెల 20వ తేదీన కంటి చుక్కల మందుకు మాత్రమే కోటయ్య కృష్ణపట్నం వచ్చారని.. అప్పటికే ఆయనకు కోవిడ్ తగ్గిపోయిందన్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయని చెప్పడంతో చుక్కల మందు వేయడంతో ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయన్నారు. ఆ తర్వాత ఆయన ఆస్పత్రిలో ఉంటే తాము వెళ్లి మాట్లాడామని కూడా స్పష్టం చేశారు. అప్పటికే కోటయ్యకు 80 శాతం ఊపిరితిత్తులు పాడయ్యాయన్నారు. అలాగే వేరే ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ చనిపోయారన్నారు. ఆనందయ్య మందుపై తప్పుడు ప్రచారం తగదని ఆనందయ్య మిత్రుడు వెల్లడించారు.

మరో వైపు ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీసీఏఆర్ఎస్ (జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ) కమిటీ ఇచ్చిన నివేదికను పూర్తిగా పరిశీలించిన ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీకి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. ఆనందయ్య కుటుంబీకులు కంట్లో వేస్తున్న మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీనిపై కమిటీ నుంచి నివేదిక రావాల్సి ఉందని, నివేదిక పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనికి మరికొంత సమయం పడుతుందని తెలిపింది.

సీసీఏఆర్ఎస్ నివేదిక ప్రకారం.. ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందని చెప్పలేమని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ మందు వాడుతున్నంత మాత్రాన ఇతర మందులు ఆపొద్దని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం నిర్ణయంపై ఆనందయ్య కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగతా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రాలేదని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. ‘కె’ అనే మందును కమిటీ ముందు చూపించకపోవడంతో దానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల ఎలాంటి హాని లేదని సీసీఆర్ఏఎస్ నివేదిక తేల్చడంతో ప్రభుత్వం వాటికి అనుమతి ఇచ్చింది.

ప్రస్తుతం ఆనందయ్య కృష్ణపట్నం సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అకాడమీలోనే ఉన్నారు. ఆనందయ్య సోమవారం సాయంత్రానికి ఇంటికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

ten − one =