More

  పాక్ ‘ఫేకుడు’..! భారత్ ‘చెడుగుడు’..!!

  భారత్‎కు వ్యతిరేకంగా నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న 20 యూట్యూబ్ ఛానెళ్లు, రెండు వెబ్ సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ ఛానళ్లు పాకిస్తాన్ వేదికగా పనిచేస్తున్నట్టు ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించారు. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సదరు ఛానెళ్లపై నిషేధం విధించింది. ఇన్‎ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2021లోని రూల్-16 ప్రకారం.. సదరు నిషేధిత ఛానెళ్లు, పోర్టల్స్‎ను నిషేధించినట్టు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో కంటెంట్‌ను నిరోధించే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. సదరు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్ల నిషేధానికి సంబంధించి కేంద్ర సమాచార ప్రసార శాఖ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. సదరు న్యూస్ ఛానెళ్లు, పోర్టల్స్‎ను వెంటనే బ్లాక్ చేసేవిధంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని.. టెలికామ్ మంత్రిత్వ శాఖకు సూచించింది.

  ఇక ఛానెళ్ల నిషేధంపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. అందులో నిషేధానికి దారితీసిన పరిస్థితులు, నిషేధిత ఛానెళ్ల ఆగడాలను వివరించింది. పత్రికా ప్రకటన ప్రకారం.. నిషేధిత ఛానెళ్లు, వెబ్‎సైట్లకు పాకిస్తాన్‎తో లింకులున్నాయి. భారత్‎కు సంబంధించిన సున్నితమైన విషయాలపై నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నాయి. ముఖ్యంగా కశ్మీర్, భారత ఆర్మీ, దేశంలోని మైనార్టీ వర్గాలు, రామ మందిరం, దివంగత జనరల్ బిపిన్ రావత్,.. వంటి అంశాలపై అభ్యంతరకరమైన వార్తల్ని ప్రసారం చేస్తున్నాయి.

  నిషేధిత సంస్థల్లో నయా పాకిస్తాన్ గ్రూప్ ద్వారా నిర్వహించబడుతున్న వాటితో పాటు, కొన్ని స్వతంత్ర యూట్యూబ్ ఛానళ్లు కూడా వున్నాయి. ఈ యూట్యూబ్ ఛానళ్లకు 35 లక్షల స్కబ్ స్క్రైబర్లతో పాటు 55 కోట్ల వ్యూస్ వున్నట్టు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. భారత్‎లో జరిగిన రైతుల నిరసనలపై తప్పుడు వార్తలను పోస్ట్ చేయడంతో పాటు.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టడం వరకు అన్నీ ఈ పాకిస్తానీ ప్రేరేపిత యూట్యూబ్ ఛానెళ్లే చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా భారత్ లోని మైనారిటీ వర్గాలను రెచ్చగొట్టే విధంగా ఇవి వార్తల్ని ప్రసారం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో.. ప్రజాస్వామ్య ప్రక్రియను అణగదొక్కేందుకే.. తప్పుడు కంటెంట్‌ను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

  బ్లాక్ చేయబడిన యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్ల విషయానికి వస్తే.. వీటిలో ‘ది పంచ్ లైన్’, ‘ది నేక్‎డ్ ట్రూత్’, ‘48 న్యూస్’, ‘కవర్ స్టోరీ’ అనే నాలుగు యూట్యూబ్ ఛానెళ్లు.. ప్రత్యేకంగా కశ్మీర్‎ అంశాలే టార్గెట్‎గా పనిచేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇక, ‘ఇంటర్నేషనల్ వెబ్ న్యూస్’, ‘ఖల్సా టీవీ’ ఛానెళ్లు ఖలిస్తాన్‌కు సంబంధించిన ప్రచార వీడియోలపై దృష్టి సారించాయి. ‘న్యూస్ 24’, ‘పంజాబ్ వైరల్’ ఛానెళ్లు ఖలిస్తానీతో పాటు.. కశ్మీర్ అంశాలను కూడా ప్రసారం చేస్తున్నాయి. ‘ఫిక్షనల్’, ‘హిస్టారికల్ ఫ్యాక్ట్స్’, ‘నయా పాకిస్తాన్ గ్లోబల్’, ‘గో గ్లోబల్’, ‘ఈ-కామర్స్’ అనే మరో ఐదు యూట్యూబ్ ఛానెళ్లు భారత వ్యతిరేక కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయి.

  ఇదిలావుంటే మరో 8 ఛానెళ్లను స్వయంగా పాకిస్తాన్ న్యూస్ యాంకర్లే నడుపుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అవి.. ‘జునైల్ హలీమ్ అఫీషియల్’, ‘తయ్యబ్ హనీఫ్’, ‘జైన్ అలీ అఫీషియల్’, ‘మొహ్సిన్ రాజ్‌పుత్ అఫీషియల్’, ‘కనీజ్ ఫాతిమా’, ‘సదాఫ్ దురానీ’, ‘మియాన్ ఇమ్రాన్ అహ్మద్’, ‘నజామ్ ఉల్ హసన్ బజ్వా’. వీటిలో ‘Kashmiri Mujahideen Targets Indian Army With Rockets’,.. ‘Pakistan Surprises to India On Rajasthan Border’,.. ‘50 Indian Spy Hang By Afghan Talibans To Send Big Message To Modi’ వంటి శీర్షికలతో తప్పుడు వీడియోలు పోస్ట్ చేశాయి. ఇక నిషేధిత ఛానెళ్లలో ‘ది నేక్‎డ్ ట్రూత్’, ‘హిస్టారికల్ ఫ్యాక్ట్స్’, ‘నయా పాకిస్తాన్ గ్లోబల్’, ‘జైన్ అలీ అఫీషియల్’ వంటి ఛానెళ్లకు కొన్ని కోట్లలో వ్యూస్ వున్నాయి. నయా పాకిస్తాన్ గ్లోబల్ తొమ్మిది కోట్లకు పైగా వ్యూస్ రాగా,.. నజామ్ ఉల్-హసన్ బజ్వా 11 కోట్లకు పైగా వ్యూస్ వున్నాయి.

  ఒక్కసారి ఈ నిషేధిత ఛానెళ్లు ప్రసారం చేసిన కంటెంట్ వైపు ఓ లుక్కేద్దాం. లక్షమంది సబ్‎స్క్రైబర్స్, రెండు కోట్ల వ్యూస్ వున్న ‘ది పంచ్ లైన్’ అనే యూట్యూబ్ ఛానెల్‎ భారత్‎పై ఓ రేంజ్‎లో విషం కక్కుతోంది. ఈ ఛానెల్‎లో ప్రసారమయ్యే ప్రతి కంటెంట్ కశ్మీర్, భారత ప్రభుత్వం, భారత ఆర్మీ టార్గెట్‎గానే వుంటుంది. ఇటీవల ఈ ఛానెళ్లలో ఓ ఫేక్ వీడియో ప్రసారమైంది. ‘కశ్మీర్ ముజాహిదీన్లు భారత ఆర్మీ క్యాంపుపై దాడి చేశారని.. 20 మంది జవాన్లను అంతమొందించార’నే శీర్షికతో ప్రసారమైన వీడియో ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకా ‘Imran Khan Zindabad !!’,.. ‘Kashmir Louds As Kashmiri People Got Major Victory Over Indian Army’,.. ‘14 KM Long Tunnel Of Indian Army Targeted By Kashmir Mujahedin’ పేర్లతో కూడా కొన్ని అభ్యంతరకర వీడియోలో పోస్ట్ చేసింది. ఈ వీడియోల వల్లనే భారత ప్రభుత్వం ‘ది పంచ్ లైన్’ ఛానెల్ ను నిషేధిత జాబితాలో చేర్చింది.

  ఇక, బ్లాక్ చేసిన రెండవ ఛానెల్.. ‘ఇంటర్నేషనల్ వెబ్ న్యూస్’. ఇది ఖలిస్తానీ ప్రచార ఛానెల్. వాస్తవాలను వక్రీకరించడం ద్వారా ఖలిస్తానీ అనుకూల, భారత వ్యతిరేక కంటెంట్‌ను ప్రసారం చేస్తుంది. ఈ ఛానల్‌లో ‘రిఫరెండం 2020’కి సంబంధించిన పలు వీడియోలు ఉన్నాయి, వీటిని ఉగ్రవాద సంస్థ ‘సిక్ ఫర్ జస్టిస్’ నిర్వహిస్తోంది. ఈ ఛానెల్ గురించి మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇది భారతదేశం గురించి వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తున్నప్పటికీ,.. ప్రజెంటర్ మాత్రం పాకిస్తాన్ యాంకర్. దీనిని బట్టి ఖలిస్తానీల వెనుక ఎవరున్నారో మరోసారి స్పష్టమైంది. ఖలిస్తానీ అనుకూల కంటెంట్‎ను ప్రసారం చేస్తున్నందువల్లే ‘ఇంటర్నేషనల్ వెబ్ న్యూస్’ను బ్యాన్ చేశారు.

  కానీ, పరిశీలిస్తే ఈ ఛానెల్‎లో విషం పాలు ఇంకా ఎక్కువగానే వున్నట్టు స్పష్టమవుతోంది. హిందూ సంస్థలచే ప్రతిరోజు మైనార్టీలు చంపబడుతున్నారని.. గోమాంసాన్ని అత్యధికంగా ఎగుమతి చేసే దేశం భారతేననే శీర్షికలతో తప్పుడు వార్తల్ని వ్యాప్తి చేస్తోంది. నిజానికి భారత్ గేదె మాంసాన్ని మాత్రమే ఎగుమతి చేస్తోంది. దేశంలో గోవధ నిషేధం అన్నది జగమెరిగిన సత్యం. అలాంటిది భారత్ ఎలా గోమాంసాన్ని ఎగుమతి చేస్తుంది..? ఓవైపు పాకిస్తాన్‌లోని మైనార్టీ హిందువులు, ఇతర మైనారిటీలు ప్రతిరోజూ మెజారిటీ ముస్లింల చేతిలో అఘాయిత్యాలను ఎదుర్కొంటూవుంటే,.. ‘మైనారిటీలకు పాకిస్తాన్ సురక్షిత ప్రదేశం’ అంటూ ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తోంది.

  ఇక, నిషేధిత జాబితాలో నెక్ట్స్ ఛానెల్ ‘ఖల్సా టీవీ’. ఈ ఛానెల్‎కు కూడా ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ ‘సిక్ ఫర్ జస్టిస్’తో సంబంధాలున్నాయి. ఇందులో ప్రధానంగా ఖలిస్తానీ అనుకూల కంటెంట్ ప్రసారమవుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఛానెల్ ఉపయోగించిన టైటిల్‌ను తరచుగా ‘జియో టీవీ’ వంటి పాకిస్తాన్ వార్తా ఛానెల్‌లు ఉపయోగిస్తాయి. ఉదాహరణకు, జియో టీవీ వార్తల్లో ఉపయోగించిన ‘Sikhs For Justice Scores First Win In A Defamation Case’ టైటిల్‎ను.. యాజిటీజ్‎గా జియో టీవీలో కూడా వాడారు. సిక్ ఫర్ జస్టిస్ అనే ఉగ్రవాద సంస్థ న్యాయంస్థానంలో విజయం సాధించిందనేది పూర్తిగా తప్పుడు వార్త. నిజానికి ఆ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారిస్తామని మాత్రమే కోర్టు చెప్పింది.

  ఇప్పుడు ‘నేక్‎డ్ ట్రూత్’ యూట్యూబ్ ఛానెల్ విషయానికి వద్దాం. ఈ ఛానెల్ దృష్టి మొత్తం కశ్మీర్ అంశంతోనే ముడిపడి వుంటుంది. కేవలం భారత్ వ్యతిరేక కంటెంట్ కారణంగా.. ఈ ఛానెల్‎కు నాలుగున్నర లక్షల మంది సబ్ స్క్రైబర్లు, 8 కోట్ల 89 లక్షల వ్యూస్ వున్నాయి. భారత ప్రభుత్వం నిషేధించడంతో ఇకపై ఈ ఛానెల్ యూట్యూబ్‎లో కనిపించదు.

  నిషేధిత జాబితాలో మరో ఛానెల్ న్యూస్ 24. పేరు భారత్ లోని ఓ జాతీయ వార్తా సంస్థను పోలివున్నా.. ఇది పక్కా భారత వ్యతిరేక ఛానెల్. ఇలా ఓ భారతీయ ఛానెల్ పేరు పెట్టుకోవడం వల్ల తప్పుడు ప్రచారాన్ని సులభంగా ప్రసారం చేయవచ్చేనే భావనతో ఛానెల్‎కు ‘న్యూస్ 24’ అని పేరు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రసారమయ్యే కంటెంట్ మొత్తం కశ్మీర్, భారత్-చైనా సంబంధాలు, భారత సైన్యం గురించి తప్పుడు సమాచారమే వుంటుంది. ఇలా భారత వ్యతిరేక సమాచారం పోస్ట్ చేస్దుంది కాబట్టే.. ఈ యూట్యూబ్ ఛానెల్‎ను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం.

  ‘48 న్యూస్’ విషయానికి వస్తే.. 2 కోట్ల 40 లక్షల వ్యూస్ కలిగిన ఈ యూట్యూబ్ ఛానెల్ ప్రధాన లక్ష్యం భారత్ పై విషం చిమ్మడమే. ఫేక్ వార్తల్ని వడ్డించడంలో ఈ ఛానెల్ నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్టుంది. న్యూఢిల్లీలోకి టర్కీ ఆర్మీ ఎంటరైందంటూ.. ఓ ఫేక్ వీడియోను వదిలింది. దీనిని బట్టి.. దీని విషం పాలు ఏ రేంజిలో వుందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇదే టైటిల్ తో ‘నయా గ్లోబల్ పాకిస్తాన్’ అనే మరో యూట్యూబ్ ఛానెల్ కూడా ఇది కంటెంట్‎ను వదిలింది.

  నిషేధిత జాబితాలోని మరో ఛానెల్ పేరు ‘ఫిక్షనల్’. పేరుకు తగినట్టే ఇది కల్పిత ఛానెల్. ఫిక్షనల్ అనేది అత్యంత సాధారణ పదం కాబట్టి,.. ఛానెల్ విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ఈ ఛానెల్‎కు ఏకంగా నాలుగు కోట్ల వ్యూస్ వున్నట్టు.. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్ నోట్ ద్వారా తెలుస్తోంది. ఈ ఛానెల్ పైత్యం ఇంకాస్త పీక్స్‎కి వెళ్లింది. ‘ఆరెస్సెస్ క్రిస్టియన్ స్కూళ్లను ధ్వంసం చేస్తుండటంతో జో బైడెన్ మోదీ ప్రభుత్వంపై ఆంక్షలు విధించారు’ అంటూ ఓ తప్పుడు కథనాన్ని వండి వార్చింది. దీనిపైత్యం వల్ల ఆ ఛానెల్ ఇప్పుడు యూట్యూబ్‎లో లేకుండా పోయింది.

  మరో నిషేధిత ఛానెల్ ‘హిస్టారికల్ ఫ్యాక్ట్స్’. పేరులో ‘ఫ్యాక్ట్స్’ అని వున్నా.. ఈ ఛానెల్ చెప్పేవన్నీ అబద్ధాలే. భారత్ గురించి నకిలీ వార్తలు వ్యాప్తి చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ‘హిస్టారికల్ ఫ్యాక్ట్స్’ అని పేరు పెట్టుకున్నా.. అది చెప్పే వార్తలకు ఎలాంటి చారిత్రక ఆధారం వుండదు. కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే అలాంటి పేరు పెట్టుకుంది. 9 లక్షలమంది సబ్ స్క్రైబర్లు, 16 కోట్ల వ్యూస్ కలిగివుంది. ఇక, ఈ ఛానెల్ ప్రసారం చేసిన ఓ వీడియో టైటిల్ చూద్దాం. ‘Indian Soldiers Recited Kalima After Caught Up By Kashmiri Mujahidin’. కశ్మీరీ ముజాహిదీన్లు పట్టుబడిన తర్వాత భారత జవాన్లు ‘కలీమా’ పఠించారట. ఇదీ ఈ ఛానెల్ పైత్యం.

  నిషేధిత జాబితాలోని మరో ఛానెల్ పేరు ‘నయా పాకిస్తాన్ గ్లోబల్’. దీనికి 7 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, 9 కోట్ల వ్యూస్ వున్నాయి. ఈ ఛానెల్‌ పేరును ఇటీవల ‘నయా పాకిస్తాన్ ఇంటర్నేషనల్’ అని మార్చారు. ఛానెల్ యొక్క వివరణ ఇలా ఉంది. ఆ ఛానెల్ ప్రొఫైల్‎లో ఇలావుంది. ‘నయా పాకిస్తాన్ ఇంటర్నేషనల్’అనేది ‘నయా పాకిస్తాన్ గ్లోబల్’ మీడియా నెట్‌వర్క్ యొక్క YouTube ఛానెల్ అని.. ఇది దక్షిణాసియా, మధ్యప్రాచ్యంపై కరెంట్ అఫైర్స్‌ను కవర్ చేస్తుందని ప్రకటించుకుంది. ప్రస్తుతం ఈ ఛానెల్ భారత్ లో అందుబాటులో లేకపోయినా.. యూట్యూబ్‎లో మాత్రం వుంది.

  ఇదిలావుంటే, ఈ ఫేక్ బాగోతంలో పాకిస్తాన్ న్యూస్ యాంకర్లు, రిపోర్టర్ల హస్తం కూడా వుంది. ఓవైపు పాకిస్తాన్ న్యూస్ ఛానెళ్లలో పనిచేస్తూనే.. తమ వ్యక్తిగత ఛానెల్‌లను ఉపయోగించి.. భారత వ్యతిరేక ప్రచారం సాగించారు. తరచూ తప్పుడు వార్తలను ప్రచురించారు.

  అలాంటి ప్రయివేట్ యూట్యూబ్ ఛానెళ్లలో ‘జునైద్ హలీమ్ అఫీషియల్’ ఒకటి. పాకిస్తాన్ లోని ప్రముఖ న్యూస్ యాంకర్లలో జునైద్ హలీమ్ ఒకరు. ఆయన వీడియోలకు వేలల్లో వ్యూస్ వస్తాయి. వీక్షణలను పొందుతాయి. ‘Countries Take Big Action Against Modi – Joe Biden’ వంటి శీర్షికలతో భారత వ్యతిరేకతను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాడు జునైద్. అదేవిధంగా, తయ్యబ్ హనీఫ్, జైన్ అలీ అఫీషియల్, మొహ్సిన్ రాజ్‌పుత్ అఫీషియల్, కనీజ్ ఫాతిమా, సదాఫ్ దురానీ, మియాన్ ఇమ్రాన్ అహ్మద్, నజామ్ ఉల్ హసన్ బజ్వాల ఛానెల్‌లు భారతదేశంపై తప్పుడు ప్రచారం చేస్తూ.. కోట్లాది వ్యూస్ ను సంపాదించాయి. ఈ ఛానెళ్లలో ఎక్కువ భాగం ప్రస్తుతం యూట్యూబ్ నుంచి తీసివేయబడ్డాయి. ఇలా భారత్ పై విషం చిమ్మడానికి పాకిస్తానీ మతోన్మాదులు ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. అయితే, ఫేకుడుగాళ్ల యూట్యూబ్ ఛానెళ్లు బ్లాక్ చేసి.. భారత్ దిమ్మదిరిగే షాకిచ్చింది. వీరి పన్నాగాన్ని ప్రజలముందుకీడ్చింది.

  Trending Stories

  Related Stories