వంట నూనెల ధరలు భారీగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! అయితే వంట నూనెల ధరలను తగ్గించేందుకు కేంద్రం శుభవార్త చెప్పింది. వంట నూనెలపై ఉన్న బేసిక్ కస్టమ్స్ సుంకం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. దసరా, దీపావళి సీజన్ లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు కాస్త ఊరట కలిగించనుంది. వంటనూనెలపై ఉన్న అగ్రిసెస్ ను కూడా తగ్గిస్తున్నట్టు తెలిపింది. రిఫైన్డ్ వంటనూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకం ఇప్పటివరకు 32.5 శాతం ఉండగా, ఇప్పుడది 17.5 శాతానికి తగ్గింది. పామాయిల్ పై అగ్రిసెస్ 7.5 శాతానికి తగ్గగా, ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు నూనెపై అగ్రిసెస్ 5.5 శాతానికి తగ్గింది. ఈ ఎత్తివేత, తగ్గింపులు అక్టోబరు 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కారణంగా దేశంలో వంటనూనెల ధరలు బాగా తగ్గనున్నాయి.
పామ్ ఆయిల్ ధర కేజీకి రూ.132గా ఉంది. సన్ ఫ్లవర్ ఆయిల్ ధర కేజీకి రూ.169 వద్ద కొనసాగుతోంది. అలాగే సోయా ఆయిల్ ధర కేజీకి రూ.155గా, వనస్పతి ధర కేజీకి రూ.136గా ఉంది. వేరుశనగ నూనె కేజీకి రూ.182 వద్ద కొనసాగుతోంది. ఇక ఆవ నూనె కేజీకి రూ.184 వద్ద ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ ధరల్లో భారీగా మార్పులు రానున్నాయి. వినియోగదారులకు ఊరట కలగనుంది.