National

ఎయిర్ ఇండియా టాటా చేతిలోకి వెళ్లిందన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

ఎయిర్ ఇండియా.. స్వాతంత్ర్యానికి ముందు ఎయిరిండియాను టాటా గ్రూప్ నిర్వహించేది. జేఆర్డీ టాటా 1932లో ఎయిరిండియాను స్థాపించారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎయిరిండియాను జాతీయం చేశారు. అప్పటి నుండి ఎయిరిండియా ప్రభుత్వ రంగ సంస్థగా మారిపోయింది.

అయితే ఇటీవలి కాలంలో ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. దీంతో వేలంపాట నిర్వహించడానికి బిడ్స్ కూడా వేశారు. తాజాగా ఎయిర్ ఇండియా టాటాల చేతిలోకి వెళ్లిందనే వార్తలు వచ్చాయి. 68 ఏళ్ల తర్వాత ఎయిరిండియా మళ్లీ టాటాల పరమైందంటూ జాతీయ మీడియాలో నేడు కథనాలు వచ్చాయి. ఎయిరిండియాను దక్కించుకునేందుకు స్పైస్ జెట్ తదితర సంస్థలు పోటీపడగా చివరికి టాటా సన్స్ నెగ్గిందని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. ఎయిరిండియా బిడ్డింగ్ పూర్తయినట్టు వచ్చిన కథనాలు పూర్తిగా తప్పు అని తెలిపారు. ఈ వ్యవహారంలో బిడ్లకు కేంద్రం ఇంకా ఆమోదం తెలుపలేదని, కేంద్రం నుంచి ఏదైనా నిర్ణయం వస్తే మీడియాకు అధికారికంగా ప్రకటిస్తామని వివరించారు.

రూ. 43 వేల కోట్ల నష్టాలతో నడుస్తున్న నేపథ్యంలో ఎయిరిండియాను వదిలించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రైవేట్ పరం చేయాలని భావించింది. 2020 మార్చి 31 నాటికి ఎయిరిండియాకు దాదాపు రూ. 45,863.27 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఎయిరిండియాను నిర్వహించేందుకు ప్రభుత్వానికి ప్రతి రోజు దాదాపు రూ. 20 కోట్ల భారం పడుతోంది. ఎయిర్‌ ఇండియాను 2018లోనే కేంద్రం అమ్మకానికి పెట్టగా అప్పట్లో ఎవరూ కొనలేదు. ఎయిర్‌ ఇండియాలో కనీసం 76 శాతం వాటాను కొనుగోలు చేయాలని షరతు విధించడంతో ఏ ఒక్క కంపెనీ కేంద్రం విధించిన షరతులు అనుసరించి ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో రెండో సారి ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు సంబంధించి బిడ్లను కేంద్రం ఆహ్వానించింది. ఈసారి ఒకే సంస్థ కాకుండా రెండు సంస్థలు కలిసి బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చంటూ కొంత వెసులుబాటు కల్పించింది. వంద శాతం వాటాలను విక్రయించాలని కూడా నిర్ణయించింది. ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూపుతో పాటు స్పైస్‌ జెట్‌ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఎయిర్‌ ఇండియా భారీగా నష్టాల పాలైనప్పటికీ వేల కొట్ల విలువ చేసే ఆస్తులు ఆ సంస్థకి ఉన్నాయి. ముంబై, ఢిల్లీలలో నగరం నడిబొడ్డున ఎకరాల కొద్ది స్థలం అందుబాటులో ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

thirteen + 13 =

Back to top button