శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయన ఎక్కడకు చేరుకున్నారో అనే మిస్టరీ వీడింది. భార్య, ఇద్దరు అంగరక్షకులతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పారిపోయినట్టు వైమానిక దళ అధికారి ఒకరు తెలిపారు. 73 ఏళ్ల గొటబాయ తన అధికారిక నివాసంపై నిరసన కారులు దాడులు చేసిన సమయంలో ఆ నివాసాన్ని విడిచిపెట్టాడు. అనంతరం ఆయన దుబాయ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు అధికారులు తెలిపారు. అధ్యక్షుడి హోదాలోనే దేశాన్ని విడిచి పెట్టడం ద్వారా తనను అరెస్టు చేయకుండా, నిర్బంధించకుండా ఉండేలా ప్రయత్నించారని చెబుతున్నారు.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇటీవల తీవ్ర ప్రజాగ్రహాన్ని చవిచూసిన గొటబాయ అధ్యక్ష భవనం నుంచి వెళ్లిపోయారు. అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతానని పార్లమెంటు స్పీకర్, ప్రధాని విక్రమసింఘేకు ఆయన ఇది వరకే తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను స్పీకర్ మహీంద అభయ్‌వర్ధనేకు అందించారు కూడా..! అధ్యక్షుడు గొటబాయ రాజీనామా చేయడంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి.
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే అధికార నివాసంలోకి నిరసనకారులు శనివారం చొచ్చుకెళ్లారు. గొటబాయ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనకారులు అధ్యక్షుడి భవనాన్ని చుట్టుముట్టారు. నిరసనకారుల ఆగ్రహాన్ని పసిగట్టిన నిఘా వర్గాలు రాజపక్సేను అధికారిక నివాసం నుంచి ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించాయని అప్పట్లో శ్రీలంక రక్షణవర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు ఆయన మాల్దీవుల్లో తేలాడు.