More

    ఎమ్మెల్యే రాజాసింగ్ కు పాకిస్తాన్ నుంచి బెదిరింపులు.. గన్ లైసెన్స్ కావాలని డీజీపీకి లేఖ..!

    బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రాణహాని మరింత పెరిగింది. దేశంలోని కొన్ని సంఘ విద్రోహ శక్తుల నుంచి ఆయనకు గతంలో బెదిరింపులు వచ్చాయి. అలాగే ఆయన ఉగ్రవాదులు హిట్ లిస్ట్ లో ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు సైతం హెచ్చరించాయి. దీనితో తనకు భద్రత పెంచాలని గతంలోనూ కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఐతే ఆయన రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చొరవ చూపలేదు. ఫిట్ నెస్ లేని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయనకు కేటాయించడం, అది తరుచూ నడి రోడ్డుపై ఆగిపోవటం వంటి ఘటనలు జరిగాయి. ఎప్పటికప్పుడు ఆ విషయాన్నీ రాజాసింగ్ తెలంగాణ సర్కార్ దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది.

    ఐతే తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. పాకిస్తాన్ కు చెందిన ఎనిమిది నెంబర్ల నుండి తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. ఈ విషయమై తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు రాజాసింగ్ లేఖ కూడా రాశారు. గతంలో ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం విషయంలోనూ పోలీస్ ఉన్నతాధికారులకు సైతం లేఖలు రాశారు.

    ఐతే ఇప్పుడు తనకు పాకిస్తాన్ నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రాజాసింగ్ ఆ లేఖలో ఆరోపించారు. జై శ్రీరామ్ అన్న ప్రతిసారీ పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేశారని రాజాసింగ్ గుర్తు చేశారు. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ విషయమై ఫిర్యాదు చేసినా కూడా కేసు ఎందుకు నమోదు చేయలేదని రాజాసింగ్ ప్రశ్నించారు. తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని అభ్యర్ధించినా ఇంతవరకు గన్ లైసెన్స్ ఇవ్వలేదని రాజాసింగ్ చెప్పారు. తనపై కేసులున్నాయనే కారణంగా గన్ లైసెన్స్ ఇవ్వని విషయాన్ని రాజాసింగ్ ఆ లేఖలో ప్రస్తావించారు.

    కేసులున్నవారికి కూడా గన్ లైసెన్స్ లు ఇచ్చిన విషయాన్ని రాజాసింగ్ ఆ లేఖలో ప్రస్తావించారు. తనకు ప్రాణహాని ఉందన్నారు. తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని రాజాసింగ్ కోరారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన రాజాసింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. చంపేస్తామని ఆగంతకులు బెదిరించారని రాజాసింగ్ చెప్పారు. ఈ విషయమై రాజాసింగ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా రాజాసింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చినట్టుగా రాజాసింగ్ తెలిపారు. తనకు పాకిస్తాన్ కు చెందిన ఎనిమిది ఫోన్ నెంబర్ల నుండి బెదిరింపులు వచ్చాయని రాజాసింగ్ డీజీపీకి రాసిన లేఖలో స్పష్టం చేశారు.

    Trending Stories

    Related Stories