తెలుగుదేశం పార్టీని ఇప్పటికే పలువురు నాయకులు వీడుతున్న సంగతి తెలిసిందే..! తాజాగా మరొక సీనియర్ నాయకుడు టీడీపీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే సమాచారం. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి త్వరలో టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు పార్టీలో సరైన గౌరవం లేదని గోరంట్ల అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. తనలాంటి సీనియర్ ను కూడా హైకమాండ్ సరిగా పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన చెందుతున్నారని, ఈ నేపథ్యంలో పార్టీకి ఆయన రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. నారా లోకేష్ యువ నేతలను ఎక్కువగా పట్టించుకుంటూ ఉన్నారని.. తన లాంటి సీనియర్లకు కనీసం స్పందించడం లేదని ఆయన పలువురితో చెప్పినట్లు తెలుస్తోంది.
ఆయన పార్టీని వీడడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసి మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. మీడియా కథనాలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారం పట్ల ఇప్పుడేమీ వివరణ ఇవ్వనని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు ఆయన స్పందన కోరినప్పటికీ, అంతకుమించి మాట్లాడేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీని వీడి ఇతర పార్టీలోకి చేరుతారా లేక రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెబుతారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఆయన రాబోయే రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం లేకపోలేదని ఆయన సన్నిహితులు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అంతంత మాత్రమే ఉన్న టీడీపీకి ఇలా సీనియర్లు వరుసగా గుడ్ బై చెబుతూ ఉండడం తీరని లోటు..!
బుజ్జగించే ప్రయత్నాలు:
గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించే ప్రయత్నాలను టీడీపీ నేతలు చేస్తూ ఉన్నారు. బుచ్చయ్య చౌదరితో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, పార్టీకి బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయడం లేదని చెప్పారు. రాజమండ్రి డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు కూడా గోరంట్ల రాజీనామా చేయడం లేదని తెలిపారు. గోరంట్ల రాజీనామా చేయబోతున్నారనే వార్త తెలియగానే పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా గోరంట్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోరంట్లతో అన్ని విషయాలను మాట్లాడామని, ఆయన రాజీనామా చేయబోరని చెప్పారు. ఏ సమస్యలున్నా పార్టీలో అంతర్గతంగా పరిష్కరించుకుంటామని అన్నారు.