గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసులో నిందితుడైన అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి వైవాహిక జీవితంపై ఆసక్తి లేదని ఆయన మాజీ భార్య పేర్కొంది. 2019లో పెళ్లి జరిగిన వెంటనే, ఆమె అత్తగారింట్లో గృహ హింసను ఎదుర్కొంది. అందుకే మేము ఆమెను తిరిగి తీసుకువచ్చారని ఆమె తండ్రి ఆరోపించారు.
ప్రస్తుతం పోలీస్ రిమాండ్‌లో ఉన్న అబ్బాసీ 2019లో షద్మాను వివాహం చేసుకున్నాడు. తాను అబ్బాసీతో కలిసి జీవించిన కాలంలో అతను తనతో చాలా అరుదుగా మాట్లాడేవాడని ఆమె పేర్కొంది. భర్త మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ను ఎప్పుడూ ముట్టుకోలేకపోయానని, వాటిని అతడు చాలా జాగ్రత్తగా చూసుకునేవాడని ఆమె ఆరోపించింది. అతను ఆ సమయంలో ఏదైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆమెకు తెలియదు. అతడు వైవాహిక జీవితంపై పెద్దగా ఆసక్తి చూపలేదని ఆమె తెలిపింది.
అబ్బాసీ మాజీ మామ ముజఫరుల్ హక్ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తెకు 2019లో అబ్బాసీతో వివాహం జరిగిందని చెప్పారు. వివాహం జరిగిన వెంటనే, గృహ హింస ఘటనలు చోటుచేసుకోవడంతో వారు ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. “పెళ్లయిన కొన్ని నెలల తర్వాత మేము ఆమెను తిరిగి తీసుకువచ్చాము. అతను ఫోన్‌లో తలాఖ్ చెప్పాడు.. అప్పటి నుండి, అతనితో మాకు ఎలాంటి సంబంధం లేకుండా పోయింది” అని ముజఫరుల్ హక్ అన్నారు.
అబ్బాసీ తండ్రి తన కొడుకు మానసికంగా అస్థిరంగా ఉన్నాడని పేర్కొన్నాడు. అయితే ముజఫరుల్ హక్ టైమ్స్ నౌ కు మాట్లాడుతూ అతను పూర్తిగా సాధారణంగా ఉన్నాడని, తన కుమార్తెతో వివాహం చేసుకున్నప్పుడు మానసిక సమస్యల సంకేతాలు కనిపించలేదని చెప్పాడు.
ముంబైలో UP ATS విచారణ:
నగరంలో అబ్బాసీకి గల సంబంధాలపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) బృందం మంగళవారం ముంబై చేరుకుంది. నివేదిక ప్రకారం, అబ్బాసీ ఆధార్ కార్డులో పేర్కొన్న చిరునామా నవీ ముంబైలో ఉంది. ఏటీఎస్ బృందం వాషి సమీపంలోని మిలీనియం టవర్‌ను సందర్శించి, కార్డులోని చిరునామాగా పేర్కొన్న ఫ్లాట్‌ను 2013లో విక్రయించినట్లు గుర్తించారు. విచారణలో అబ్బాసీ తండ్రి మునీర్ అబ్బాసీ సెక్టార్‌లోని తాజ్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో మరో ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆ ఫ్లాట్ ప్రస్తుతం అద్దెకు ఇచ్చారు. అబ్బాసీ కుటుంబం 2020 అక్టోబర్‌లో గోరఖ్‌పూర్‌కు మారింది.