ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ భారత్ లో ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. భారతదేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి, గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ విషయంలో మార్పులు తీసుకుని రావడానికి గూగుల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుమారు 80 ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి గూగుల్ 109 కోట్ల అదనపు సహాయం ప్రకటించింది. ఏప్రిల్ నెలలో ప్రజారోగ్య సమాచార ప్రచార కార్యక్రమాలను విస్తరించడానికి, భారతదేశంలో అత్యవసర సహాయక చర్యలకు తోడ్పడటానికి మొత్తం 135 కోట్ల రూపాయల గ్రాంట్లను ప్రకటించింది.
మేము సమయానుసారంగా భారత్ లో హెల్త్ ఇన్ఫ్రా ను మెరుగుపరచడానికి, ప్రజారోగ్య ప్రచారాలను విస్తరించడానికి లాభాపేక్ష లేకుండా సహాయం చేస్తున్నామని గూగుల్ సంస్థ తెలిపింది. భారతీయులకు తక్షణ సహాయం చేయడానికి కూడా ముందుకు వచ్చామని వెల్లడించారు. ఏప్రిల్‌లో, మా దాతృత్వ సంస్థ గూగుల్.ఆర్గ్ ద్వారా ప్రజారోగ్య సమాచార ప్రచార కార్యక్రమాలను విస్తరించడానికి, అత్యవసర సహాయక చర్యలకు తోడ్పడటానికి మొత్తం 18 మిలియన్ డాలర్లు (135 కోట్ల రూపాయలు) నిధులను ప్రకటించామని గూగుల్ కంపెనీ తెలిపింది.
హెల్త్ వర్కర్లకు అదనపు శిక్షణ, గ్రామీణ ప్రాంతాల్లోఆరోగ్య సౌకర్యాల మెరుగు, సుమారు 80 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు తెలిపింది. గివ్ఇండియా, పాత్ సంస్థలకు ఈ నిధులను అందించనుంది. ఈ రెండు సంస్థలు ఆక్సిజన్ ప్లాంట్లను దేశంలోని గ్రామాల్లో నిర్మించనున్నాయి. కొన్ని ప్రాంతాలను గుర్తించి అక్కడ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు,ఇతర అధికారులతో కలిసి ఈ ప్రోగ్రామ్ లో గూగుల్ పని చేస్తుంది. అపోలో మెడీ స్కిల్స్ ఇనిషియేటివ్తో కలిసి, 20వేల మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇప్పించనున్నారు. ఆశా, ఎఎన్‌ఎం వర్కర్ల శిక్షణా నిమిత్తం ఏకంగా రూ. 3.6 కోట్లు (5 లక్షల డాలర్లు) గ్రాంట్‌ను అందివ్వనుంది. భారతీయులకు సాయం చేసేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు. ఆక్సిజన్ ప్లాంట్లనిర్మాణం, గ్రామీణ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల శిక్షణపై దృష్టిపెట్టామని ట్వీట్ చేశారు. గూగుల్ తన కొత్త కమిట్ మెంట్ లో భాగంగా COVID-19 నిర్వహణలో ప్రత్యేక శిక్షణ ద్వారా 20,000 మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలను పెంచడానికి అపోలో మెడ్స్‌కిల్స్ లో పెట్టుబడులు పెడుతోంది.