రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మొదటి గంటలోగా ఆసుపత్రికి తరలించిన వారికి 5000 రూపాయలు

0
649

రోడ్డు ప్రమాదాలు.. మనం చూస్తున్నప్పుడే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే చాలా మంది మనకెందుకు అక్కడ ఎంతో మంది ఉన్నారు.. వారు రక్షిస్తారు అని అనుకుంటూ ఉండొచ్చు. అలా ఎవరూ ముందుకు రాకపోవడం వలన ఎంతో మంది ప్రాణాలు పోయాయి. పార్లమెంట్‌లో కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. గతేడాది దేశవ్యాప్తంగా 3,66,138 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా.. 1,34,714 మంది మృతిచెందారని తెలిపారు. సకాలంలో వైద్య చికిత్స అందించగలిగితే వీరిలో చాలా మంది ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది.

ప్రజల్లో మార్పు తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆదుకునేవారికి రూ.5 వేలు పారితోషికంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు కేంద్రం వెల్లడించింది. తొలి గంటలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తామని తెలిపింది. ఈ పథకం అక్టోబరు 15 నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన 10 మందికి రూ.1 లక్ష చొప్పున అందిస్తారు. ఈ పథకంలో ప్రమాదం గురించి పోలీసులకు మొట్టమొదట ఎవరైనా సమాచారం అందిస్తే, ఆ వివరాలను వైద్యులతో ధ్రువీకరించుకున్న అనంతరం పోలీసులు ఆ వ్యక్తికి ఓ రసీదు ఇస్తారు. ఆ రసీదు కాపీని జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పనిచేసే ఓ కమిటీకి పోలీసులే పంపిస్తారు. రోడ్డు ప్రమాద బాధితులను ఎవరైనా నేరుగా ఆసుపత్రికి తరలిస్తే, వారి పూర్తి వివరాలను ఆసుపత్రి వారే పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి కేంద్రం తాజా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.

క్షతగాత్రులను మొదటి గంటలోగా (గోల్డెన్‌ అవర్‌) ఆస్పత్రికి తరలించిన వారికి రూ. 5 వేల ప్రోత్సాహక బహుమతి అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతల రవాణా శాఖ ముఖ్య కార్యదర్శులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ లేఖ రాసింది. అక్టోబరు 15, 2021 నుంచి 2026 మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ పథకం కింద రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల రవాణా విభాగాలకు రూ.5 లక్షలు చొప్పున నిధులు అందజేయనున్నట్టు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మార్గదర్శకాల్లో వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి నగదు బహుమతులు, ధ్రువపత్రాల ద్వారా సాధారణ ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రమాద బాధితుల ప్రాణాలను రక్షించే వ్యక్తికి ఏడాదిలో గరిష్ఠంగా ఐదుసార్లు నగదు బహుమతి అందజేస్తారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడానికే కేంద్రం వినూత్న పథకాన్ని తీసుకొచ్చింది.