వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీకో గుడ్ న్యూస్

0
741

వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. పార్టీ పేరును రిజిస్టర్ చేసినట్టుగా పార్టీ అధ్యక్షుడు వాడుక రాజగోపాల్‌కు ఎన్నికల సంఘం నుంచి లేఖ అందింది. తమ పార్టీని రిజిస్టర్ చేయాల్సిందిగా కోరుతూ 28 డిసెంబరు 2020లో రాజగోపాల్ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయగా, షర్మిల తల్లి విజయలక్ష్మి నిరభ్యంతర పత్రాన్ని సమర్పించారు. కొన్ని కారణాల వల్ల పార్టీ పేరు రిజిస్ట్రేషన్ పెండింగులో ఉంటూ వచ్చింది. తాజాగా, ఈసీ గుర్తించడంతో ఈ నెల 16 నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీకి రాజకీయ గుర్తింపు లభించినట్టు అయింది. ప్రస్తుతానికి మాత్రం వైఎస్సార్ తెలంగాణ పార్టీకి రాజగోపాలే అధ్యక్షుడుగా ఉన్నారు. త్వరలోనే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షురాలిగా షర్మిల పేరును ఆమోదించి ఎన్నికల సంఘానికి పంపనున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాను దేశాన్ని ఏలతానని కేసీఆర్‌ చెబుతుంటే నవ్వొస్తోందని, ఆయన ఇంత కాలం బూతులే మాట్లాడుతారు అనుకున్నా.. ఇప్పుడు జోకులు కూడా బాగానే చెబుతున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ రాలేదని.. తాగుబోతుల తెలంగాణ, అప్పుల తెలంగాణ ఏర్పడిందని విమర్శించారు. తెలంగాణలో బడులు, గుడుల కంటే వైన్స్ షాపులే ఎక్కువున్నాయని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా కాకుండా బతుకేలేని తెలంగాణగా మార్చేశారన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం బంగారమైందని, ఉద్యోగాలు వాళ్ల కుటుంబంలో తప్ప బయటివారికి రాలేదన్నారు. తెలంగాణను మళ్లీ ఏపీ కలిపేస్తారంటూ కేసీఆర్, కేటీఆర్ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని షర్మిల ఆరోపించారు. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టి మూడోసారి అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.