More

    ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన కేజ్రీవాల్

    దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు మన కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోతో పాటు లక్ష్మీ, గణేష్ చిత్రాలను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక బలోపేతానికి.. శ్రేయస్సు కోసం దేవుళ్ల ఆశీస్సులు కూడా అవసరమని తెలిపారు. ఇండోనేషియా జనాభాలో దాదాపు 85 శాతం మంది ముస్లింలు, కేవలం 2 శాతం హిందువులు మాత్రమే ఉన్నా.. అక్కడ కరెన్సీపై వినాయకుడి బొమ్మ ఉందని గుర్తు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మీ-గణేష్ పూజ చేస్తున్నప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చిందని చెప్పారు. కరెన్సీ నోట్ల‌పై లక్ష్మీ, గణేష్ ఫొటోలు ఉంటే బాగుంటుందని అనిపించిందన్నారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని తాను అనడం లేదని.. దేవుడి ఆశీస్సులు లభిస్తాయని అన్నారు.

    తాజాగా ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. భారత దేశం స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా భారత్‌ ఇంకా అభివృద్ధి చెందుతోన్న దేశంగానే ఉందని.. దేశాభివృద్ధి కోసం ఒకపక్క ప్రజలు శ్రమించాలని.. అలాగే మన ప్రయత్నాలు ఫలించేందుకు దేవుడి ఆశీస్సులు కావాలని లేఖలో చెప్పుకొచ్చారు. అలాగే తన ప్రతిపాదనకు భారీగా మద్దతు వస్తోందన్నారు. దీనిపట్ల ప్రజలు ఆసక్తిగా ఉన్నారని, సాధ్యమైనంత త్వరగా అమలుపరచాలని కోరుకుంటున్నారని కేజ్రీవాల్ వెల్లడించారు.

    Trending Stories

    Related Stories