More

  50 రోజులకే చేదెక్కిన స్టాలిన్..!
  #GoBackStalin ట్రెండింగ్..!!

  పోటుగాడు పందిరేస్తే పిచ్చుకలొచ్చి పీకేశాయట..! తమిళనాడులో స్టాలిన్ పాలన కూడా అలాగే వుంది. కరుణానిధి వారసుడిగా సీఎం పీఠమెక్కి 50 రోజుల్లోనే.. స్టాలిన్ తన అసమర్థతను చాటుకున్నాడు. దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ జోరుగా సాగుతుంటే.. అధికార డీఎంకే దాని మిత్రపక్షాలు మాత్రం అవకాశవాద రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ యాభై రోజుల్లో తమిళనాట అలాంటి ఘటనలు అనేకం జరిగాయి.

  వీటిలో ముందుగా విద్యుత్ కోతల గురించి చర్చించుకోవాలి. పరిస్థితిని గమనిస్తే.. స్టాలిన్ అధికారంలోకి వస్తూనే విద్యుత్ కోతల్ని కూడా వెంట తెచ్చాడనిపిస్తోంది. విద్యుత్ కోతలతో తమిళ ప్రజలు అల్లాడిపోతున్నారు. విచిత్రమేమిటంటే,.. విద్యుత్ సమస్యను గట్టెక్కించాల్సిన స్టాలిన్ సర్కార్.. విద్యుత్ కోతలపై వింత సమాధానలు చెబుతోంది. ఇటీవల విద్యుత్ సమస్యపై మాట్లాడిన ఆ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి సెంథిల్.. కోతలకు ఉడుతలే కారణమంటూ కళ్లు బైర్లు కమ్మే సమాధానం చెప్పాడు. చెట్ల కొమ్మలు కరెంటు వైర్ల మధ్యలోకి వావడం వల్ల.. వాటిపై ఉండే ఉడుతలు కరెంటు వైర్లపై పాకుతున్నాయట..! దీంతో వైర్లన్నీ కలిసిపోయి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందట..!! ఆమాత్యులవారు చెప్పిన సమాధానంతో మీడియా ప్రతినిధులు కళ్లు తేలేసి వుండవచ్చు. మరి, స్టాలిన్ అధికారంలోకి రాకముందు తమిళనాడులో ఉడుతలు అసలే లేవా..? అని అంతా ఆశ్చర్యపోతున్నారు..! ఆయన అధికారంలోకి రాగానే ఇలా ఉడుతలు కక్షగట్టి విద్యుత్ అంతరాయం కలిగిస్తున్నట్టుంది పాపం..!! విద్యుత్ కష్టాలతో.. తమిళ ప్రజలు 2006 – 2011 మధ్యనాటి కరుణానిధి ప్రభుత్వాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

  ఇదిలావుంటే, విభజించు.. పాలించు.. అనే బ్రిటీష్ వాడి సూత్రాన్ని స్టాలిన్ పక్కాగా అమలు చేస్తున్నట్టు అర్థమవుతోంది. తమ ఓట్లేసిన వారిని ఓ విధంగా.. ఓట్లు వేయని మరో విధంగా ట్రీట్ చేయడం ఆయనకే చెల్లింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే స్టాలిన్ అవకాశవాద రాజకీయాలు ప్రారంభించారు. కొవిడ్ టీకా పంపిణీలో స్టాలిన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష, కక్షపూరిత ధోరణి ఇందుకు అద్దం పడుతోంది. విషయమేంటంటే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ లోని 10 అసెంబ్లీ స్థానాల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి భారీ మెజారిటీ లభించింది. అంతేకాదు, పశ్చిమ తమిళనాడులో చాలా సీట్లు అన్నాడీఎంకే-బీజేపీ-పీఎంకే కూటమికే దక్కాయి. దీంతో ఆ ప్రాంతాల విషయంలో స్టాలిన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. తమిళనాడులో టీకా పంపిణీ తీరును గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.

  మే 21 గణాంకాలు పరిశీలిస్తే, చెన్నైలో 48,782 క్రియాశీల కేసులుండగా.. కోయంబత్తూరులో 29,345 క్రియాశీల కేసులున్నాయి. ఆ రోజు రాష్ట్రంలో యాక్టివ్ కేసుల విషయంలో చెన్నై తర్వాత రెండోస్థానం కోయంబత్తూరుదే. కానీ, టీకా పంపిణీలో మాత్రం అట్టడుగున నిలిచింది. ఆ రోజు కేవలం 172 డోసులను మాత్రమే పంపిణీ చేశారు. మే 15 నుండి మే 21 వరకు మొత్తం జిల్లాలో మొత్తం 4,714 డోసులు మాత్రమే ఇచ్చారు. ఇదే కాలంలో కోయంబత్తూరులో 22,453 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిజానికి, మే 10 నుంచే పశ్చిమ తమిళనాడులో టీకాల పంపిణీ తగ్గుతూవస్తోందని.. బీజేపీ నాయకుడు కె. అన్నామలై అభిప్రాయం వ్యక్తం చేశారు. మే 19న రాష్ట్ర వ్యాప్తంగా 36,199 టీకాలు పంపిణీ చేస్తే.. ఐదు పశ్చిమ ప్రాంత జిల్లాలు కోయంబత్తూర్, ఈరోడ్, నీలగిరి, సేలం, తిరుపూర్ జిల్లాల్లో కేవలం 2,244 టీకా డోసులు మాత్రమే ఇచ్చారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకాల్లో ఇది కేవలం 6 శాతం మాత్రమే. టీకాల విషయంలో తమిళనాడు పశ్చిమ ప్రాంతం నిర్లక్ష్యం చేయబడుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

  మే 10 వరకు తమిళనాడుకు ఇచ్చిన మొత్తం మోతాదులలో 20 శాతం డోసులను తమిళనాడు పశ్చిమ ప్రాంతానికే కేటాయించారు. అయితే, మే 19 నాటికి ఇది 6 శాతానికి పడిపోయింది. ఇక్కడ గమనించదగ్గమరో విషయం ఏమిటంటే, మే 18 నాటికి తమిళనాడులో మొత్తం 13 లక్షల 63 వేల డోసులు వున్నాయి. పైగా, మే 16 ఒక్కరోజే 9 లక్షల 62 వేల డోసులు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాయి. అయినా, తమిళనాడు పశ్చిమ ప్రాంతంలో టీకాల పంపిణీ గణనీయంగా తగ్గింది. దీనినిబట్టి టీకాల పంపిణీ విషయంలో కక్షపూరిత ధోరణి స్పష్టంగా తెలుస్తోంది. డీఎంకే పార్టీకి ఓటువేయని ప్రాంతాలపై.. స్టాలిన్ సర్కార్ సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏంకావాలి..? అందుకే, ఆ ప్రాంత ప్రజల నుంచి స్టాలిన్ ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. పట్టుమని 50 రోజుల గడిచాయో లేదో.. స్టాలిన్‎పై తమిళనాడు పశ్చిమ ప్రాంతంలో నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ ట్రెండింగ్‎లో #GoBackStalin ప్రస్తుతం టాప్‎లో వుంది.

  అంతేకాదు, తమిళనాడులో యాంటీ ఇండియన్, యాంటీ ప్రవృత్తి అంతకంతకూ పెరిగిపోతోంది. పెరిగిపోతోందని అనేకంటే డీఎంకే పెంచిపోషిస్తోందని అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాధారణంగా ప్రసంగం ముగిసిన తర్వాత మన దేశంలో నాయకులు ‘జైహింద్’ అనే పదం వాడటం ఆనవాయితీగా, అలవాటుగా వస్తోంది. కానీ, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం దీనిని నిషేధించింది. అంతకుముందున్న అన్నాడీఎంకే ప్రభుత్వం ‘జైహింద్’ పదాన్ని కొసాగించింది. కానీ, డీఎంకేతో పాటు.. మిత్రపక్ష పార్టీలన్నీ ‘జైహింద్’ పదాన్ని ఉచ్ఛరించబోమంటూ శపథం చేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగంలో కూడా ఈ పదాన్ని నిషేధించారు. పైగా, ఇదో గొప్ప విషయమన్నట్టు డీఎంకే ఎమ్మెల్యే E.R. ఈశ్వరన్ జబ్బలు చరుచుకున్నాడు. గవర్నర్ ప్రసంగంలో ‘జైహింద్’ పదాన్ని తొలగించినందుకు సీఎం స్టాలిన్ కు శాసనసభలోనే ధన్యవాదాలు తెలిపాడు. తద్వారా తమ పార్టీలో నిండి దేశవ్యతిరేక భావనను చాటిచెప్పాడు.

  ప్రసంగం తర్వాత తొలిసారి ‘జైహింద్’ అనే పదం వాడింది ఓ తమిళుడే. 1907లో డాక్టర్ చెంపకరన్ పిళ్లై అనే స్వాతంత్ర్య సమరయోధుడు తొలిసారి ఈ పదాన్ని ఉపయోగించాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన ఆ పదాన్ని నిషేధించి .. భారతీయ సంప్రదాయాలు మాకు పడవంటూ చెప్పకనే చెప్పింది స్టాలిన్ సర్కార్. ఈ 50 రోజుల స్టాలిన్ ప్రభుత్వ పాలనలో తమిళ ప్రజలకే కాదు.. దేశ ప్రజలకు ఎదురైన చేదు అనుభవాలివి. రానున్న ఐదేళ్లలో స్టాలిన్ నుంచి ఇంకా ఎలాంటి విపత్తులు ఎదురవుతాయో చూడాలి.

  Trending Stories

  Related Stories