గోవా: గోవా రాష్ట్రంలోని అతి పెద్ద మెడికల్ కాలేజీలో తీవ్ర విషాదం నెలకొంది. గోవా మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో నాలుగు రోజుల వ్యవధిలో ఏకంగా 74 మంది ప్రాణాలను వదిలారు. మెడికల్ ఆక్సిజన్ ను అందించడంలో ఏర్పడ్డ వైఫల్యాల కారణంగా ఈ స్థాయిలో మరణాలు సంభవిస్తూ ఉన్నాయి.
4 రోజుల్లోనే 74 మంది కరోనా బాధితులు ఆక్సిజన్ అందక మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున 13 మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. గురువారం 15 మంది చనిపోగా, బుధవారం 20 మంది, మంగళవారం 26 మంది ఆక్సిజన్ లేక మృతి చెందారు. పది రోజుల్లో గోవా రాష్ట్రానికి కేవలం 40 టన్నుల ఆక్సిజన్ మాత్రమే వచ్చిందని చెబుతూ ఉన్నారు. కోల్హాపూర్ ప్లాంట్ నుంచి గోవాకు ఆక్సిజన్ ను కేటాయించినప్పటికీ అది సరిపోవడం లేదు. రోజువారీ కేటాయింపులను 11 టన్నుల నుంచి 22 టన్నులకు పెంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రవాణాలో జరుగుతున్న తప్పుల వల్లనే ఆక్సిజన్ సరఫరాలో జాప్యం జరుగుతోందని పలువురు చెబుతూ ఉన్నారు.
ఈ ఆసుపత్రిలో జాయిన్ అయిన ప్రజల్లో చాలా వరకూ రాత్రి సమయాల్లో బాగుంటున్నారని.. కానీ ఉదయం 1 గంట నుండి 6 గంటల మధ్య ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతూ ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ సమయాన్ని ‘డార్క్ అవర్స్’ అంటూ అధికారులు కూడా చెబుతున్నారు. డ్యూటీలో ఉన్న వాళ్ల తప్పుల కారణంగానే ఈ ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయని.. వరుసగా మరణాలు సంభవిస్తూ ఉన్నా కూడా కనీసం పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ ఉన్నారు.
గోవా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి, హెల్త్ మినిస్టర్ చేసిన కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ అంటూ ఆరోపణలు గుప్పించారు. ఆక్సిజన్ ను సరఫరా చేసే వాహనాలు ఆలస్యంగా వస్తున్న కారణంగానే ఈ మరణాలు సంభవిస్తూ ఉన్నాయని మరో వైపు ఆసుపత్రి అధికారులు చెబుతూ ఉన్నారు.