గత కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్ లో తీవ్రవాదుల చర్యలకు ఎటువంటి ఉపాధి కూడా నోచుకోని కుటుంబాలు చాలానే ఉన్నాయి. భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో జమ్మూ కశ్మీర్ అభివృద్ధి విషయంలో ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తూ ఉంది. వేల కోట్లతో మౌళిక సదుపాయాలను నిర్మిస్తూ ఉంది. అక్కడి పిల్లలను తీవ్రవాదం వైపు ఆకర్షితులు అవ్వకుండా ఎన్నో చర్యలను తీసుకుంటూ ఉంది. దీంతో యువత కూడా ఉద్యోగాల విషయంలోనూ, ఉపాధి విషయంలోనూ ముందుకు వెళుతూ ఉన్నారు.
తాజాగా ఇద్దరు అమ్మాయిలు పలువురికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్ గ్రామానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) పథకం కింద పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించారు. దద్సర్ గ్రామానికి చెందిన రౌకాయ జాన్, సోబియా అనే అమ్మాయిలు పుట్టగొడుగుల పెంపకం ద్వారా పారిశ్రామికవేత్తలుగా మారారు. భారత వ్యవసాయ శాఖ ఆర్థిక మరియు సాంకేతిక సహాయంతో పుట్టగొడుగుల యూనిట్లను స్థాపించడానికి వారిద్దరికీ సహాయం చేసింది.

రౌకాయ జాన్ మాట్లాడుతూ.. “మష్రూమ్ యూనిట్‌ను ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ రాయితీతో పాటు శిక్షణ కూడా ఇచ్చింది. మా యూనిట్‌ను విజయవంతం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని.. తమకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినప్పటికీ నిరుద్యోగిగానే ఉన్నాను. ఇప్పుడు ఈ పథకం కింద, నేను నా ఇంట్లో నా స్వంత మష్రూమ్ యూనిట్‌ని ప్రారంభించాను.” అని తెలిపింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి జమ్మూ మరియు కాశ్మీర్ ప్రజలు పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వారి స్వంత ఉపాధిని సృష్టించుకోవాలని ఆమె తెలిపింది.

మరో కాశ్మీరీ అమ్మాయి సోబియా మాట్లాడుతూ కశ్మీర్‌లోని యువత ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని అన్నారు. “ఇది చాలా మంచి పథకం. ఇది ప్రధానంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది. డిపార్ట్‌మెంట్ మాకు సబ్సిడీని అందించడం వల్ల మేము ప్రయోజనం పొందాము. అధికారులు అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి మాకు శిక్షణ ఇస్తూ ఉంటారు. కశ్మీర్ లోయలోని యువత ఈ పథకం నుండి ప్రయోజనం పొందాలి మరియు వారి స్వంత వ్యాపార యూనిట్లను ప్రారంభించాలి” అని చెప్పుకొచ్చింది.
DDC చైర్‌పర్సన్ పుల్వామా సయ్యద్ బారీ ఆంద్రాబీ మాట్లాడుతూ “NRLM పథకం ప్రగతిశీలమైనది మరియు ఈ పథకంలో పుల్వామా లోని అన్ని బ్లాక్‌లను కవర్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దీంతో నిరుద్యోగ యువకులు, ముఖ్యంగా మహిళలు ప్రయోజనాలను పొందుతారు.” అని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో మరింత మంది యువతీయువకులకు భారత ప్రభుత్వం చేయూత ఇవ్వనుంది.