దేశంలో న్యాయస్థానాలు సంచలనాలకు కేరాఫ్ అడ్రగా మారుతున్నాయి. జిల్లా కోర్టు నుంచి మొదలు.. సుప్రీంకోర్టు వరకు ఎన్నో సంచలన తీర్పులను వెల్లడిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అలాంటి తీర్పులు అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఓ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
స్నేహంలో ఒక పురుషుడు, ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నంత మాత్రానా.. అది ఆమె నుంచి లైంగిక సంబంధానికి అంగీకారం తెలిపినట్లు కాదని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా.. జస్టిస్ భారతీ డాంగ్రే నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఓ వ్యక్తి తన స్నేహితురాలిని పలుమార్లు లొంగదీసుకున్నాడు. తీరా గర్భం దాల్చాక.. మాట మార్చాడు. ఈ వ్యవహారంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే.. ముందస్తు బెయిల్ కోసం అతను దాఖలు చేసిన అభ్యర్థనను బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని, ఆ మహిళను బలవంతంగా లొంగదీసుకున్నాడో లేదో తేల్చాల్సిన అవసరం ఉందని బెంచ్ ఆదేశించింది.
ఒక అమ్మాయి అబ్బాయితో స్నేహంగా ఉంటే.. అది ఆమెతో లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఆమె ఇచ్చిన సమ్మతిగా భావించడానికి వీల్లేదు అని జస్టిస్ భారతి అభిప్రాయపడ్డారు. నేటి సమాజంలో.. స్నేహం అనేది ఆడా-మగా అనే తేడాలను బట్టి ఉండడం లేదు. ఒకే తరహా అభిప్రాయాలు, ఆలోచనలు లేదంటే కంఫర్ట్ జోన్‌లో ఉండడం లాంటి అంశాలను బట్టే స్నేహాలు చేస్తున్నారు. ముఖ్యంగా పని చేసే చోట కలిసి మెలిసి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగని.. స్నేహం అనేది బలవంతంగా మహిళలను లొంగదీసుకునేందుకు మగవాళ్లకు దొరికే హక్కు ఎంత మాత్రం కాదు అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కేసులో ఆమె అతని పట్ల ఆకర్షితురాలైందని, కానీ, పెళ్లి ప్రస్తావనతో అతనికి లొంగిపోయిందా? లేదంటే బెదిరింపులకు, బలవంతం చేశాడా? అనేది నిర్ధారణ కావాల్సి ఉందని న్యాయమూర్తి అన్నారు.
ఒక్క బాంబే హైకోర్టు మాత్రమే కాదు ఇతర హైకోర్టులు కూడా సంచలన తీర్పులు ఇచ్చి వార్తల్లో నిలిచాయి. ముస్లిం మహిళల పెళ్లి వయస్సుకు సంబంధించి హర్యానా, పంజాబ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముస్లిం అమ్మాయి 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. పంజాబ్‌కు చెందిన ముస్లిం దంపతులు తమ 17 ఏళ్ల కుమార్తె 36 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని పంజాబ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అల్కా శరీన్ తమ బంధువులు వ్యతిరేకిస్తున్నారనే కారణంతో వీరిద్దరి పెళ్లి చట్ట విరుద్దం కాదని ప్రకటించింది. బంధువుల వ్యతిరేకత వల్ల వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను భంగం కలగదని హైకోర్టు తీర్పులో వెల్లడించింది. జంటకు భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
ఒక్క పంజాబ్ హైకోర్టు మాత్రమే కాదు.. మిగతా రాష్ట్రాల హైకోర్టులు సైతం పలు సంచలన తీర్పులను వెల్లడించాయి. సామాన్యంగా భార్యాభర్తలు వీడిపోయిన సందర్భంలో భార్యకు భర్త భరణం ఇవ్వటం చాలా ఏళ్ల నుంచి వస్తున్న పద్ధతి. అయితే వీడాకులు తీసుకునే భార్య తన భర్తకు భరణం ఇవ్వాలని గత నెలలో బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. అలాగే మరో హైకోర్టు కూడా భార్య చదువుకున్నంత మాత్రానా జాబ్ చేయాలని ఏం లేదని అది ఆమె నిర్ణయానికి వదిలేయాలని తీర్పునిచ్చింది. ఇక మైనర్ భార్యతో సంసారం వ్యభిచారం కిందకే వస్తుందని మరో హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. కేవలం ఒక్క హైకోర్టులే కాదు.. సుప్రీంకోర్టు కూడా పలుమార్లు సంచలన తీర్పులను వెల్లడించింది.