కెనడాలోని షెర్‌బోర్న్ ప్రాంతంలో గురువారం కార్తీక్ వాసుదేవ్ అనే భారతీయ విద్యార్థి కాల్చి చంపబడ్డాడు. కెనడాలోని టొరంటోలో కాల్పులకు కార్తీక్ బలయ్యాడు. సబ్ వే స్టేషన్ వద్ద జరిగిన కాల్పుల్లో 21 ఏళ్ల కార్తీక్ వాసుదేవ్ కు బుల్లెట్ గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఓ ఆగంతుకుడు తుపాకీతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. కార్తీక్ వాసుదేవ్ మార్కెటింగ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ చదివేందుకు జనవరిలో టొరొంటోకు వెళ్లాడు. సెనెకా కాలేజీలో అతడికి అడ్మిషన్ లభించింది. అతను ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థి.
భారత విద్యార్థి దుర్మరణం పట్ల భారత ఎంబసీ షాక్ కు గురైంది. “నిన్న టొరంటోలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ విద్యార్థి కార్తీక్ వాసుదేవ్ దురదృష్టవశాత్తు మృతి చెందడం పట్ల మేము దిగ్భ్రాంతి చెందాము” అని టొరంటోలోని భారత కాన్సులేట్ ఒక ట్వీట్‌లో పేర్కొంది. కార్తీక్ వాసుదేవ్ మృతదేహాన్ని భారత్ కు త్వరగా పంపించేందుకు వీలుగా తమవంతు సహకారం అందించనున్నట్టు ప్రకటించింది. కార్తీక్ వాసుదేవ్ కుటుంబంతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపింది. భారత విద్యార్థి మరణించడం పట్ల విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా విచారం వ్యక్తం చేశారు. “ఈ విషాద సంఘటనకు బాధపడుతూ ఉన్నాను. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి” అని జైశంకర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
21 ఏళ్ల మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ విద్యార్థిని ఎందుకు కాల్చి చంపారో టొరంటోలోని పోలీసు అధికారులు ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు. సాక్షులను ముందుకు రావాలని పోలీసులు కోరారు. పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. అనుమానితులపై తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసు అధికారులు కెనడియన్ న్యూస్ ఏజెన్సీ సిబిసికి తెలిపారు. షెర్బోర్న్ సబ్‌వే స్టేషన్ వెలుపల గ్లెన్ రోడ్‌లో కాల్పులు జరిగాయి. కార్తీక్ తండ్రి మాట్లాడుతూ.. “మా బిడ్డను కోల్పోయాము.. నా కొడుకు చాలా మంచి పిల్లవాడు. నా కొడుకు ఎందుకు టార్గెట్ అయ్యాడు?” అని అన్నారు. కార్తీక్ జనవరిలో కెనడాకు వచ్చాడు.. ఐదేళ్లు ప్లాన్ చేసుకున్నాక కెనడా వెళ్ళాడు.