ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలోని పాతల్‌గావ్‌లోని ఖుతపాని వద్ద 400 కుటుంబాలకు చెందిన 1200 మంది సభ్యులు హిందూమతాన్ని తిరిగి స్వీకరించారు. ఈ కుటుంబాలు మూడు తరాల క్రితం క్రైస్తవ మతంలోకి మారారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఆర్యసమాజ్, హిందూ సమాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బీజేపీ రాష్ట్ర మంత్రి ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ ప్రజలందరి పాదాలను కడిగి, వారిని తిరిగి హిందూమతంలోకి స్వాగతించారు.


రాష్ట్ర మంత్రి మరియు జష్‌పూర్ రాజకుటుంబానికి చెందిన ప్రబల్ ప్రతాప్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హిందుత్వను రక్షించడమే తన జీవిత లక్ష్యం అని ఆయన అన్నారు. ఘర్ వాపసీ(హిందూ మతంలోకి తిరిగి రావడం) కుటుంబాల్లో ఎక్కువ మంది బస్నా సారాయిపల్లి నివాసితులేనని తెలిపారు. “ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తమ అసలైన మతంలోకి తిరిగి రావడం శుభసూచకం. ఒకరి బలవంతం మీద పని ఎప్పటికీ నిలకడగా ఉండదు, మిషనరీలు వీరి మతం మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాయి. విద్య, ఆరోగ్యం పేరుతో మతాన్ని కూడా వ్యాపారం చేశారు. ఈ కుట్రలను మేము బయటపెడుతూనే ఉంటాం” అని ప్రబల్ ప్రతాప్ సింగ్ తెలిపారు.

హిందూ మతంలోకి తిరిగి వచ్చిన కుటుంబాలకు చెందిన వారు తమ పూర్వీకులు సుమారు 3 తరాల క్రితం మతం మారారని చెప్పారు. ఆ సమయంలో వారు చాలా పేదవారని తెలిపారు. మిషనరీలు వ్యవసాయానికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం, ఆసుపత్రుల్లో చికిత్సను అందిస్తామని చెప్పడంతో వారు మతం మారారని కుటుంబ సభ్యులు తెలిపారు. దేశ వ్యాప్తంగా పలు హిందూ సంఘాలు ఒకప్పుడు బలవంతంగా మతం మారిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకుని వచ్చే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.
