దిగ్గజ గాయకుడు ఘంటసాల కుమారుడు రత్నకుమార్ కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన కోలుకున్నారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్‌గా వచ్చింది. రత్నకుమార్‌కు కిడ్నీ సమస్యలు ఉన్నాయని డయాలసిస్ చేయించుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

డబ్బంగ్ ఆర్టిస్టుగా రత్నకుమార్ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రత్నకుమార్ 12వేలకు పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పి గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. మంచి గాయకుడు కూడా.. డబ్బింగ్ చిత్రాలకు స్క్రీన్ ప్లే సమకూర్చారు. కృష్ణుడు పాత్రలకు డబ్బింగ్ చెప్పడంలో ఆయన ప్రత్యేకమైన ఒరవడిని సృష్టించారు. బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ రత్నకుమార్ స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఇప్పటి వరకు ఆయన వెయ్యికిపైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు.
17ఏటే డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. రత్నకుమార్ ఘంటసాల రెండో కుమారుడు. ఆయనకు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఒక కుమార్తె వీణ ఘంటసాల కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్. మరొక అమ్మాయి లా చదువుతోంది. రామానంద్ సాగర్ రామాయణంలో శ్రీరాముడు పాత్ర ధారి అరుణ్ గోవిల్‌కు, సర్వదమన్ బెనర్జీ నటించిన కృష్ణ పాత్రకూ, ఆది శంకరాచార్య పాత్రధారికి డబ్బింగ్ చెప్పారు. తమిళ్ హీరోలకు తెలుగులో డబ్బింగ్ ఇచ్చారు. నటుడు జగపతి బాబుకు ఆయన కెరీర్ ప్రారంభ దశలో డబ్బింగ్ చెప్పారు. ఘంటసాల రత్నకుమార్ మరణం తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నింపింది. పలువురు ప్రముఖులు ఆయన మరణానికి సంతాపం చెబుతున్నారు.
