భారతదేశంలో కరోనా తీవ్రత తగ్గుతూ ఉంది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ను చేపడుతూ వస్తోంది. దీంతో పలు దేశాలు భారత ప్రయాణీకులపై ఆంక్షలను ఎత్తివేస్తూ వస్తోంది. కోవిడ్ -19 డెల్టా వేరియంట్ ద్వారా ప్రభావితమైన యుకె, భారత్ మరియు మరో మూడు దేశాలద ప్రయాణికులపై నిషేధాన్ని ఎత్తివేశామని జర్మనీ ఆరోగ్య సంస్థ సోమవారం తెలిపింది.
భారత్‌తో పాటు పలు దేశాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను జర్మనీ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. భారత్‌ను హై ఇన్సిడెన్స్ ఏరియా కేటగిరీ కిందకు చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం భారతీయులకు జర్మనీలో ప్రవేశించేందుకు అనుమతి లభించనుంది. ఇందుకు సంబంధించి జర్మనీ ప్రభుత్వ ఏజెన్సీ రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ భారత్, నేపాల్, రష్యా, పోర్చుగల్, బ్రటన్‌లను హై ఇన్సిడెన్స్ ఏరియాలుగా వర్గీకరించామని తెలుపుతూ సోమవారం వెల్లడించింది. కోవిడ్-19 తీవ్రత తగ్గిన నేపథ్యంలో జర్మనీ అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసింది. భారత్ ప్రయాణికులకు అనుమతినిస్తూ నిబంధనలు సడలించింది. ఈ మేరకు.. ‘‘డెల్టా వేరియంట్‌తో ప్రభావితమైన ఐదు దేశాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను రేపటి నుంచి ఎత్తివేస్తున్నాం’’ అని భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్ జె. లిండ్నర్ ఒక ప్రకటనలో తెలిపారు. తాజా సడలింపుల ప్రకారం ఇండియా, యూకే, పోర్చుగల్ దేశాల ప్రయాణికులపై నిషేధం ఎత్తివేశారు. అయితే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, క్వారంటైన్‌లో ఉండటం వంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్ పై ప్రభావం చూపిస్తూ ఉండడంతో పలు దేశాలు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాయి. ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ లండన్ పర్యటన సందర్భంగా బ్రిటన్ నుండి వచ్చే ప్రయాణికుల పట్ల జర్మనీ వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉందని భావించారు. డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్న బ్రిటన్ నుండి ప్రయాణించే ప్రజలకు గత నెలలో మెర్కెల్ ఐసోలేషన్ తో సహా కఠినమైన ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆమె కొన్ని సడలింపులు ఇస్తూ వస్తున్నారు. ఇతర దేశాల నుండి వచ్చే వారు కరోనా నెగటివ్ రిజల్ట్ ను చూపించాల్సి ఉంటుంది. 10 రోజుల ఐసోలేషన్ లో ఉండాలి.. ఐదు రోజుల తరువాత మరోసారి కూడా నెగటివ్ అని ఫలితం వస్తే ఐసోలేషన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అధిక వ్యాప్తి ఉన్న ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులు పూర్తిగా టీకాలు వేయించుకున్నట్లయితే దిగ్బంధం నుండి మినహాయింపు పొందుతారు.