Right Angle

ఇజ్రాయిల్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..! యుద్ధానికి ఇరాన్ సన్నాహాలు..!!

‘మే’ మాసం ఎండలు నిప్పులు కక్కుతున్న తొలివారంలో పరస్సరం శతఘ్నులతో దాడులు చేసుకున్నాయి ఇజ్రాయిల్-పాలస్తీనా దేశాలు. పదకొండు రోజులు-264 గంటల మారణహోమం తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రపంచ చరిత్రలో సంధికీ-యుద్ధానికీ మధ్య గీతను చెరిపిన ఘనత, జీవితానికి-మృత్యువుకు మధ్య వ్యవధిని రద్దు చేసిన అపకీర్తి పశ్చిమాసియాకు మాత్రమే దక్కుతుంది. పాలస్తినా-ఇజ్రాయిల్ యుద్ధ చరిత్ర ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైంది. 1947-49 యుద్ధం మొదలు 2021 సాయుధ ఘర్షణ వరకూ సాగిన ఈ రెండు అరబ్బు దేశాల వైరం అనేక మంది ప్రాణాలను బలిగొంది. దౌత్య-భౌగోళిక రాజకీయ చరిత్రను మార్చి వేసింది. అరబ్బు తీరంలో వందేళ్లుగా ఆరని కార్చిచ్చుగా రగులుతోన్న వివాదమది.

ఇజ్రాయిల్-పాలస్తినా యుద్ధ చరిత్ర భౌగోళిక రాజకీయాలను మార్చిందా? ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలకు కారణమేంటి? అమెరికా అణుఒప్పందం నుంచి వైదొలగడం ఇజ్రాయిల్ కు ప్రమాదంగా పరిణమించిందా? హమాస్ కంటే లెబనాన్ లోని ‘హిజ్బుల్లా’ ఎలా ప్రమాదకారి? అరబ్బు దేశాలు ఏకకాలంలో దాడికి దిగితే ఇజ్రాయిల్ తట్టుకోగలదా? ఇరాన్-ఇజ్రాయిల్-అమెరికా మధ్య ఉద్రిక్తత భారత్ కు ఎలా నష్టం చేస్తుంది? ఇలాంటి అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం…

‘‘ఎర్రతివాచీపై వడివడి అడుగులు వేస్తూ, బంగారు వన్నె ఇసుక తిన్నెలపై నడిచి మా లోగిలిలోకి రాదు పాలస్తినా. రక్తం పులుముకుని మా ముంగిట వాలుతుందని తెలుసు. ఇజ్రాయిల్ ను అరబ్బు తీరం నుంచి తరిమివేసేందుకు మా వద్ద ఉన్న ఏకైక ఆయుధం యుద్ధం మాత్రమే!’’ అన్నాడు ఈజిప్ట్ ను మూడు దశాబ్దాలు అప్రతిహతంగా పాలించిన గమాల్ అబ్దుల్ నాసర్.

‘‘అరబ్బులు ఆయుధ విసర్జన చేస్తే పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుంది. అదే ఇజ్రాయిల్ అస్త్ర సన్యాసం చేస్తే…మృత సముద్ర తీరం నుంచి వాగ్దత్త భూమి మాయమవుతుంది’’ అన్నాడు ఇజ్రాయిల్ ప్రస్తుత ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు. ‘‘చుట్టూ ముస్లీం సముద్రం ముప్పు పొంచి ఉన్న…విశాల అరబ్బు తీరంలో ముక్కనుపోలిన ఇజ్రాయిల్ ఎలా నిలదొక్కుకుంటుందీ…? అని సందేహించారు ప్రపంచ ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ రచయిత ఇసాక్ అసిమోవ్. ఖగోళంలో జరిగే మార్పులను ముందుగానే పసిగట్టి, తన కాల్పనిక రచనల్లో స్థానం కల్పించిన ఇసాక్ అసిమోవ్ కు భూగోళంలో పరిణామాలు అర్థం కాకపోవడం వైచిత్రి.

కేవలం పదకొండు రోజుల సాయుధ ఘర్షణతో కథ ముగియలేదని పరిణామాలను గమనిస్తే అర్థమవుతోంది. పాలస్తీనా-ఇజ్రాయిల్ ఘర్షణ తాత్కాలికంగా ముగిసినా అసలు ప్రత్యర్థి ఇరాన్ అదను కోసం ఎదురు చూస్తోందని ప్రపంచ భౌగోళిక రాజకీయాలను విశ్లేషిస్తున్న నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయిల్ పొరుగున ఉన్న లెబనాన్ లో ‘‘హిజ్బుల్లా’’ మరో హంతకదాడికోసం పథక రచన చేస్తోందని అంతర్జాతీయ పత్రికలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయిల్ పై హమాస్ ప్రయోగించిన శతఘ్నల సంఖ్య కేవలం 4వేల మూడు వందలు. మరో ముఫ్పై వేల శతఘ్నుల కుప్పపై కళేబరం కోసం మాటువేసిన రాబందువలె హమాస్ ఎదురు చూస్తోందని కూడా కథనాలు వెలువడుతున్నాయి.

హమాస్ కంటే ఐదు రెట్లు అధికంగా శతఘ్నల గుట్టను ‘హిజ్బుల్లా’ పోగు చేసిందని ‘‘మొస్సాద్’’ పసిగట్టింది. హమాస్ వారం రోజుల వ్యవధిలో ప్రయోగించిన మిసైళ్లను హిజ్బుల్లా కేవలం ఒక్క రోజులో ప్రయోగించగలదట. సుదూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఇరానియన్ ప్రెసిషన్ మిసైళ్లను కుప్పలు తెప్పలుగా పోసుకుని డేగవలె ఎదురు చూస్తోంది లెబనాన్! ఈ అత్యాధునిక ఆయుధాలు ఇజ్రాయిల్ కు ప్రాణసమానమైన సైనిక, ఆర్థిక మూలాలను ఖచ్చితంగా ఛేదిస్తాయని అంచనా వేసింది మొస్సాద్. ఇదే కనుక జరిగితే పశ్చిమాసియాలో అమెరికాకు ఉన్న ఏకైక మిత్ర దేశం ఇజ్రాయిల్ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడినట్టే అని పెంటగాన్ కూడా బెంగపెట్టుకుందని ఆదేశంలోని పత్రికలే కథనాలు రాస్తున్నాయి. మొస్సాద్ ఇంటలీజెన్స్ బేస్ కు ప్రతిక్షణం అందుతున్న నివేదికలే ఇజ్రాయిల్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇజ్రాయిల్ సైన్యం- ఆదేశానికి చెందిన అంతర్జాతీయ నిఘా విభాగం ‘‘మొస్సాద్’’లు తాజా దాడుల నేపథ్యంలో కాస్త గగుర్పాటు ప్రదర్శించాయి. ఉక్కు కవచంలా ‘ఐరన్ డోమ్’ గగనతలంలోనే శతఘ్నలను ముక్కలు చేసినా, ఊహించని దాడి భయమేదో ఇజ్రాయిల్ ను వెంటాడుతోంది.

ఇజ్రాయిల్ చుట్టూ ఉన్న పది ముస్లీం దేశాలు అరబ్బు తీరం నుంచి తమ మాతృభూమిని మాయం చేయాలని చూస్తున్నాయనే భయమే అందుకు ప్రధాన కారణం. సుదూరం నుంచి చూస్తే ఇజ్రాయిల్ సాహసం అనన్య సామాన్యంగా కనిపిస్తుంది కానీ, మొన్నటి దాడిలో చిగురుటాకులా వణికిపోయింది ఆ దేశం. నిరంతరం అశాంతితో రగిలే- ఎరిత్రియా, ఇథియోపియా, సుడాన్ లాంటి ఆఫ్రికా దేశాలు సహా ఈజిప్ట్ , జోర్డాన్, లెబనాన్, సిరియా, ఇరాక్, కువైత్, సౌదీ అరేబియా, ఎమెన్ లాంటి అరబ్బు దేశాలు ఇజ్రాయిల్ చుట్టూ మాటువేసి ఉన్నాయి. ఇరాక్ పొరుగున పొంచి ఉంది ఇరాన్. ఇరాన్ మద్దతు లేనిదే హమాస్ ఆ స్థాయిలో రెచ్చిపోదు. హిజ్బుల్లా ఏ క్షణంలో దాడికి దిగుతుందో తెలియదు. ముప్పేట దాడికి దిగితే ‘ఐరన్ డోమ్’ రక్షణ కవచం ఏ మేరకు నిలువరించగలదన్న సందేహం ఇజ్రాయిలీలను వెంటాడుతోంది. రణభూమిలో అవతరించిన ఇజ్రాయిల్ అరబ్బు దేశాల నిరంతర దాడులను తట్టుకుని నిలబడింది. యుద్ధకళకు కొత్త అర్థాన్ని చెప్పింది. ప్రత్యర్థి ప్రయోగించే శతఘ్నులను గగనతలంలోనే పేల్చేసే ‘ఐన్ డోమ్’ సాంకేతికత గురించి ప్రయోగాలు చేసి సఫలమైంది. అయినంత మాత్రాన అరబ్బు రాజ్యాల ప్రమాదాల నుంచి బయటపడినట్టు కాదు. ఏక కాలంలో అరడజను అరబ్బు దేశాలు ఇజ్రాయిల్ పై దాడికి దిగితే పరిస్థితి ఏమవుతుంది? అనే ప్రశ్న అమెరికాను వేధిస్తోంది. ఈ మొత్తం స్థితికి ప్రధాన కారణం ఇరాన్.

ఇరాన్-ఇజ్రాయిల్ శతృత్వానికి ప్రధాన కారణం ఇరాన్ అణు ప్రయోగాలను ఇజ్రాయిల్ నిరంతరం తన దాడులతో భగ్నం చేస్తోందన్నది ఇరాన్ ఆరోపణ. ఈ ఏడాది జనవరిలో ఇరాన్ అణు శాస్త్రవేత్త మోహసీన్ ఫఖ్రీజాదే` హత్యకు గురయ్యారు. ఫక్రిజాదే హత్యపై రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, నడి రోడ్డుపై ఓ ఆటోమాటిక్ మెషీన్ గన్ సాయంతో ఆయన్ను హంతకులు అంతమొందించారని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్‌లో ఇలాంటి దాడి చేయగల సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. ఇదివరకు కూడా ఇలాంటి పనిని ఆ దేశం చేసింది. అందుకే ఇజ్రాయెల్‌ను ఇరాన్ అనుమానిస్తోంది. 2010 నుంచి 2012 వరకు ఇరాన్ అణ్వాయుధ ప్రయోగంతో సంబంధమున్న నలుగురు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు. మరో శాస్త్రవేత్త ఓ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ మాత్రమే రహస్య ఆపరేషన్ల వెనుక ఉందన్న నిర్ణయానికి వచ్చే పరిస్థితి లేదు. గత ఏప్రిల్ లో ఇరాన్ అణుకర్మాగారమైన నతాంజ్‌లో యురేనియాన్ని శుద్ధి చేసే అత్యంత అధునాతన సెంట్రిఫ్యూజ్ వ్యవస్థను ప్రారంభించిన కాసేపటికే విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. ఫలితంగా నేలపై ఉన్న వర్క్ షాపులతోపాటు నేలమాళిగలో ఉన్న అణుశుద్ధి యూనిట్లు సహా కర్మాగారం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీని వెనక ఇజ్రాయెల్ హస్తం ఉందని, ఆ దేశ సైబర్ దాడే ఇందుకు కారణమని ఇరాన్ అధికారిక మీడియా ఆరోపించింది.

ఇరాన్ అణు ఇంధన సంస్థ అధిపతి అలీ అక్బర్ సలేహీ దీనిని అణు ఉగ్రవాదంగా అభివర్ణించారు. దీనికి వ్యతిరేకంగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ చర్యలు చేపట్టాలని కోరారు. పదేళ్ల క్రితం నతాంజ్‌పై జరిగిన ‘స్టక్స్‌నెట్’సైబర్ దాడిని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఇరాన్ అణుకర్మాగారంపై దాడిలో తమ ప్రమేయం ఉండొచ్చని ఇజ్రాయెల్ అధికారిక మీడియా కూడా అభిప్రాయపడడం మరింత ఉద్రిక్తతకు కారణమైంది. ఇరాన్‌లో జరిగే గూఢచర్య ఆపరేషన్లు, మరీ ముఖ్యంగా అణు కార్యక్రమాలకు వ్యతిరేకంగా దాడులు చేసే దేశాలు చాలా తక్కువ. మొసాద్, అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ ఉమ్మడిగా చేస్తాయి. ఇరాన్ అణు కార్యక్రమానికి సప్లై చైన్‌ను దెబ్బతీయాలని మొదట ప్రయత్నించాయి. ఇరాన్ ఈ కార్యకలాపాలను రహస్యంగా చేసేది. అవసరమైన సామగ్రిని బహిరంగంగా కొనలేదు. కాబట్టి, మధ్యవర్తుల సాయం తీసుకోవాల్సి వచ్చేది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. కొన్ని సార్లు సఫలమయ్యాయి కూడా.

2018 ఆరంభంలో ఇరాన్ అణు కార్యక్రమాలకు సంబంధించిన రహస్య పత్రాలు మొసాద్‌కు చిక్కాయి. 2020లో గూఢచర్య ఆపరేషన్లు బాగా పెరిగాయి. గత ఏడాది ఇరాన్ మిలటరీ కమాండర్, మేజర్ జనరల్ కాసిం సులేమానీ హత్య ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతను పెంచించింది. గతేడాది అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో కడ్స్ దళాల కమాండర్ జనరల్ కాసిం సులేమానీ హత్యకు గురయ్యాడు. అధ్యక్షుడి ఆదేశాలతో అతడిని చంపినట్లు పెంటగాన్ ధ్రువీకరించింది. 62 ఏళ్ల జనరల్ సులేమానీపై బగ్దాద్ విమానాశ్రయంలో అమెరికా దాడులు జరిపింది. ఇజ్రాయిల్-పాలస్తినా ఉద్రిక్తత వెనుక ఇరాన్ ఉందనే ఆరోపణలకు అనేక ఆధారాలూ ఉన్నాయి. ఖాసిం సులేమానీ, మెహసీన్ ఫక్రిజాదేల హత్య తర్వాత ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది ఇరాన్. ఆ తర్వాత కరోనా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా-ఇరాన్ ల మధ్య ఉద్రిక్తత సమసినా లోలోపల ఎవరి స్థాయిలో వారు పథక రచన చేస్తూనే ఉన్నారు.

నిధుల లేమితో నాటో బలహీన పడటం- అమెరికా బయటి దేశాల్లో యుద్ధాలు చేయడం విషయంలో పునరాలోచనలో పడటం, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ లతో శాంతి ఒప్పందం చేసుకుని తన బలగాలను ఉపసంహరించుకోవడం….మొత్తంగా జో బైడెన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో మార్పు వచ్చింది. గతంలో పెంటగాన్ రూపొందించే రక్షణ విధానంలో ‘ఇరాన్ ప్రమాదం’ ప్రధాన ఎజెండాగా ఉండేది. విదేశాంగ విధానంలో సైతం ఇరాన్ అణు ప్రమాదమే కీలక పాత్ర పోషించేది. పరిస్థితి మారింది. పాలస్తినా-ఇజ్రాయిల్ వివాదం విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఒక తప్పుడు భావన దశాబ్దాలుగా చెల్లుబాటు అవుతూనే ఉంది. ప్రగతిశీలవాదం వెనుక ఇజ్రాయిల్ వ్యతిరేకత-పాలస్తీనా అనుకూలతను ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదు. దీంతో పాటు సైనిక పరమైన సవాళ్లు సైతం పొంచి ఉన్నాయి. ప్రజాస్వామిక దేశం తన రక్షణ కోసం చేసే ప్రయత్నాలకూ-మత యుద్ధానికి సిద్ధమైన ఉగ్రవాదానికి మధ్య సామర్థ్యభేదం తక్కువేమీ కాదు. ఎల్లకాలం సాంకేతికత మాత్రమే రక్షించలేదు. మూక సంస్కృతి అలవడిన ఉగ్రవాదం ప్రాణాలకు తెగించి చేసే ఆత్మాహుతి దాడులను నివారించడం అంత సులువేమీ కాదు. అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి ఉన్న అమెరికా-ఆఫ్ఘన్ కొండల్లో రెండు దశాబ్దాలు యుద్ధం చేసి ఓటమితో వెనుదిరిగేందుకు కారణాలు సుస్పష్టం. సరిగ్గా ఈ అనుకూలతనే ఇరాన్ వాడుకుంటోంది.

ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత నివారించాలంటే అమెరికా ఇరాన్ తో మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకోవాలంటారు నిపుణులు. 2015లో ఒబామా హయాంలో జరిగిన అమెరికా-ఇరాన్ అణు ఒప్పందం నుంచి 2018 మేలో ట్రంప్ సర్కార్ వైదొలగింది. దీంతో సహజంగానే ఇజ్రాయిల్-ఇరాన్ ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అమెరికా-ఇరాన్-ఇజ్రాయిల్ దేశాలతో భారత్ కు సత్సంబంధాలే ఉన్నాయి. ఇటీవల చైనా-ఇరాన్ ల ద్వైపాక్షిక ఒప్పందాల కారణంగా భారత్-ఇరాన్ ల మధ్య గతంలో కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందాలు రద్దవడంతో దూరం పెరిగిందంటారు విదేశాంగ నిపుణులు. దేశాలమధ్య దౌత్యసంబంధాలు ఎల్లకాలం ఒకేలా వుంటాయని, వుండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఇరాన్‌ ఏడాది వ్యవధిలో రెండోసారి ఈ సంగతి రుజువు చేసింది. గతేడాది కీలకమైన రైల్వే ప్రాజెక్టు నుంచి మన దేశాన్ని తప్పించిన ఇరాన్. తాజాగా పర్షియన్‌ జలసంధిలోని ఫర్జాద్‌–బీ సహజవాయు క్షేత్రం కాంట్రాక్టు నుంచి పక్కనబెట్టింది. గతంలోలాగే ఇప్పుడు కూడా అది కారణాలు వెల్లడించలేదు. వాస్తవానికి పర్షియన్‌ జలసంధిలో చమురు, సహజవాయు నిక్షేపాల గురించిన అన్వేషణ ప్రతిపాదనలు చేసింది మన దేశమే!

ఓఎన్‌జీసీ విదేశాల్లో వాణిజ్యకార్యకలాపాల కోసం ఏర్పాటు చేసుకున్న ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌-OVL ద్వారా తనకున్న అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో 2008లో ఈ నిక్షేపాలను కనుగొన్నది. అందుకోసం భారీ మొత్తం వెచ్చించింది. ఫర్జాద్‌–బీలో 2 కోట్ల 30లక్షల ఘనపుటడుగుల పరిమాణంలో సహజవాయు నిక్షేపాలున్నాయని నిర్ధారించింది. ఇందులో 60 శాతం వరకూ వెలికితీయొచ్చునని లెక్కేసింది. ముందనుకున్న ప్రకారమైతే ఈ నిక్షేపాలను వెలికితీసే కాంట్రాక్టు సైతం ఓవీఎల్‌కు రావాల్సివుంది. ఈ ప్రాజెక్టులో 40 శాతం వాటా తీసుకుని, 1,100 కోట్ల డాలర్ల మేర పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా వున్నట్టు ఓవీఎల్‌ ఇరాన్‌కు తెలియజేసింది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. 2012లో ప్రాజెక్టు ఒక కొలిక్కి వస్తుందనగా ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు భారత్ కు అడ్డంకిగా మారాయి. హఠాత్తుగా ఇరాన్‌తో అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందంతో ఆంక్షల సడలింపునకు మార్గం సుగమమైంది. 2015లో ఈ ప్రాజెక్టుపై చర్చలు పునఃప్రారంభమయ్యాయి. ఈలోగా అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష్య పీఠాన్ని అధిరోహించడం, 2018లో ఇరాన్‌పై ఆగ్రహించి ఆంక్షలు విధించడంతో మరోసారి ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. అంతర్జాతీయ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా భౌగోళిక రాజకీయాల్లో వచ్చే మార్పులు ప్రపంచంలోని అన్ని కీలక దేశాల ఆర్థిక, సైనిక రంగాలను ప్రభావితం చేస్తాయి. ఇందుకు తాజా ఉదాహరణ ఇజ్రాయిల్-పాలస్తినా సాయుధ ఘర్షణేనని చెప్పొచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

19 + nine =

Back to top button