More

  మోదీ గతి శక్తి దెబ్బ..! తట్టాబుట్ట సర్దుకోనున్న చైనా కంపెనీలు..!!

  ప్రధాన మంత్రి గతిశక్తి ప్రాజెక్టు ద్వారా దేశంలో లాజిస్టిక్స్ రంగం పరుగులు పెట్టబోతోంది. ఇన్నాళ్ళూ భారత ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు వేటికవే విడిపోయి సమన్వయ లోపంతో పనిచేసేవి. పారిశ్రామిక వాడలున్నచోట రోడ్లు, రైలు వంటి మౌళిక సదుపాయాలు అసలే ఉండవు. దీంతో ఉత్పత్తులు తయారీకి కాకుండా వాటిని తరలించడానికే ఎక్కువ ఖర్చు అవుతోంది. ఈ ఖర్చు భారత జీడీపీలో ఏకంగా 13 శాతం వరకు ఉంటోంది. ఇది అత్యంత భారీ స్థాయి. లాజిస్టిక్స్ రవాణా ఖర్చు ఇంతటి స్థాయిలో ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయమే. అయితే ఇంతటి అంతరాన్ని తొలగించడానికి భారత ప్రభుత్వం సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. అదే గతిశక్తి పోర్టల్.

  భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతోన్న దేశాల్లో ఒకటి. ఈ దశలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతుంటాయి. వాటన్నిటినీ తొలగించుకుని ముందుకు సాగితే దేశం త్వరితగతిన అభివృద్ది చెందడానికి వీలవుతుంది. లేకపోతే అభివృద్ది కుంటుపడుతుంది. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ అడ్డంకులను గుర్తించి త్వరితగతిన పరిష్కారం కనుక్కోవలసి ఉంటుంది. దేశంలో పరిశ్రమలు స్థాపించే వారు ఇన్నాళ్ళూ మౌళిక వసతుల సదుపాయాల లోపంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని పరిశ్రమలు భౌగోళికంగా అనుకూలంగా ఉండే ప్రదేశాల్లో స్థాపించాల్సి వస్తుంది. ఉదాహరణకు, ఎక్కడైనా ఒక టొమాటో సాస్ లేదా కెచప్ ఫ్యాక్టరీ స్థాపించాలంటే టొమాటోలు ఎక్కువగా ఎక్కడ పండుతాయో అక్కడే స్థాపించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు చిన్న చిన్న పట్టణాలను కూడా ఎంపిక చేసుకుంటారు పారిశ్రామికవేత్తలు. అయితే ఆ టొమాటోలను కెచప్ లుగా తయారు చేసిన తర్వాత వాటిని రవాణా చేయడానికి సరైన మౌళిక సదుపాయాలు ఉండవు. దీంతో ఉత్పత్తులను రవాణా చేయడానికి భారీగా ఖర్చవుతుంది. రోడ్లు చిన్నవిగా ఉండటం, అవసరమైన చోటకు వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్లడం వంటివాటితో రవాణా ఖర్చు భారీగా పెరిగిపోతుంది. ఇక విడిభాగాల అసెంబ్లింగ్ ఫ్యాక్టరీలైతే మరీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. విడిభాగాలను మరో ఫ్యాక్టరీకు తరలించడానికి సరైన రోడ్లు లేక చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తోంది.

  ఈ ఫ్యాక్టరీలున్న చోట్ల ఇతర శాఖల మధ్య సమన్వయ లోపం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు పరిశ్రమలకు పర్యావరణ అనుమతులు లభిస్తాయి. అయితే ఆ ఫ్యాక్టరీ ఉత్పత్తులను తరలించడానికి రోడ్డు మార్గం ఉంటుంది. ఫ్యాక్టరీకు లాభాలు వచ్చి దానిని విస్తరించేటప్పుడు రవాణా వసతులను కూడా విస్తరించాల్సి వస్తుంది. అయితే దీన్ని విస్తరించే సమయంలో పర్యావరణ అనుమతులు లభించడం చాలా కష్టమవుతుంది. దీనికోసం ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ విధంగా పరిశ్రమలకు ముందస్తు మౌలిక సదుపాయాలు లేకుండా అనుమతులు ఇవ్వడం, తర్వాత వాటికి మౌళిక సదుపాయాలు అవసరమైనప్పుడు ఒక్కో శాఖ నుండి ఒక్కో అభ్యంతరం రావడంతో పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ ఇబ్బందులన్నీ తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  వీటన్నిటికీ ప్రధాన కారణం కేంద్ర మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడటమే అని గుర్తించిన ప్రభుత్వం దీనికి గతిశక్తి అనే పోర్టల్‎ను స్థాపించింది. ఇందులో భారత ప్రభుత్వంలోని 16 మంత్రిత్వ శాఖలతో పాటు వాటి విభాగాలను కూడా ఏకతాటిపై తెస్తుంది. ఇందులో రైల్వేలు, రోడ్డు మార్గ శాఖలు కూడా ఉన్నాయి. గతిశక్తి పథకం ద్వారా దేశంలో ప్రభుత్వం పెద్ద యెత్తున మౌలిక సదుపాయాలు నిర్మించడానికి సైతం ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే అమలులో ఉన్న సాగరమాల, భారతమాల ప్రాజెక్టులు కూడా గతిశక్తి ప్రాజెక్టులోనే పరిశీలించబడతాయి. ఫార్మాస్యూటికల్ క్లస్టర్లు, టెక్స్‌టైల్ క్లస్టర్లు, డిఫెన్స్ కారిడార్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఎలక్ట్రానిక్ పార్కులు, ఫిషింగ్ క్లస్టర్లు, అగ్రి జోన్లు లాంటి వాటన్నిటికీ గతిశక్తి ప్రాజెక్టు ద్వారా సకల మౌలిక సదుపాయాలూ కల్పించబడతాయి. అంతేకాదు భవిష్యత్తులో మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఇబ్బంది రాకుండా ఇస్రో నుండి సాంకేతికతను పొంది పరిశ్రమలకు అనుకూల ప్రాంతాలను గుర్తిస్తుంది. ఈ మొత్తం సమాచారం ఉపగ్రహాల ఛాయా చిత్రాలతో పొందుపరుస్తుంది. ఈ ప్రాంతాల్లో ఏదైనా పరిశ్రమను ఏర్పాటు చేయాలనుకుంటే దానికి అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేస్తాయి. అవసరమైన చోట్లను గుర్తించి వాటికి రోడ్లతో పాటు వీలైతే రైలు కనెక్టివిటీ వంటివి కూడా చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న రహదారుల పొడవును రెండు లక్షల కిలోమీటర్లకు పొడిగించడమే టార్గెట్ గా పెట్టుకుంది. చిన్న చిన్న నగరాలకు కూడా రహదారులను విస్తరించడం వల్ల స్థానికంగా కూడా పరిశ్రమలు వచ్చే అవకాశముంటుంది. గంగా నది ని కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా సరుకు రవాణా కోసం అభివృద్ది చేయనున్నారు. భారత దేశంలోనే అతిపెద్ద నది కావడం, ఇది ఉత్తర భారతం మొత్తం విస్తరించడం వల్ల తక్కువ దూరాలకు సరుకు రవాణా కోసం ఈ నదిని బాగా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచనతో ఉంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు దేశం మొత్తం 200 ఎయిర్ పోర్టులను కూడా నిర్మించాలని నిర్ణయించుకుంది. ఓడ రేవులు లేని ప్రాంతాల్లో సరకు రవాణాకు వాయు మార్గం ఎంతో సహకరిస్తుంది. దీనికోసం ఏకంగా 200 కొత్త ఎయిర్ పోర్టులను నిర్మిస్తోంది. దీంతో పాటు ఏకంగా 11 కొత్త పారిశ్రామిక వాడలను అభివృద్ది చేయడంతో పాటుగా రెండు రక్షణ రంగ ఉత్పత్తుల కారిడార్లను కూడా అబివృద్ది చేయదలచింది.

  అయితే ఈ గతిశక్తి ప్రాజెక్టు దీర్ఘాకాలిక ప్రయోజనాలను దృష్టిలొ పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టు. వంద లక్షల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంది. ముందుగా రోడ్ల కనెక్టివిటీని పెంచడం, రైలు మార్గాలను ఆధునీకరించడం, ఆధునిక ఎయిర్ పోర్టులను నిర్మించడం లాంటివాటిని ప్రభుత్వం చేపడుతుంది. వీటికి కొన్ని సంవత్సరాలు సమయం అవుతుంది. ఇది భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేకిన్ ఇండియా ప్రాజెక్టుకు ఊతమిస్తుంది. మౌలిక సదుపాయాలను కల్పించడం వల్ల పెద్దయెత్తున పరిశ్రమలు స్థాపించబడతాయి. లాజిస్టిక్స్ ప్రయాణ ఖర్చులను తగ్గిస్తే పరిశ్రమలపై రవాణాభారం తగ్గుతుంది. దీంతో ఇతర దేశాల్లోని కంపెనీలు కూడా భారత్ వైపు చూడటానికి గతిశక్తి ప్రాజెక్టు సహకారం అందిస్తుంది.

  ఇక ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే భారత్ లో మేకిన్ ఇండియా ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. భారత్ లో వస్తువులను తయారు చేస్తే అది భారత రూపాయిని బలోపేతం చేస్తుంది. దీంతో పాటు స్థానికులకు ఉద్యోగాలు లభించడం వల్ల ప్రజల జీవన విధానం పెరుగుతుంది. వీటితో పాటు గతంలో పరిశ్రమలను పెట్టాలంటే రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి లంచాలు ముట్టజెప్పే దశ నుండి అనుకున్న వెంటనే పరిశ్రమ స్థాపించడానికి అన్ని అనుమతులు దొరికే దశకు భారత్ చేరుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‎కు విదేశీ పరిశ్రమలు క్యూ కట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చైనా నుండి పలు పరిశ్రమలు వలసవెళ్లే ఆలోచనలో ఉన్నాయి. కోవిడ్ జీరో టోలరెన్స్ నుండి నియంతృత్వంతో ప్రజలను నియంత్రించడం వరకు చైనా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో చైనాను విడిచి వెళ్ళే ఆలోచనలో ఉన్న కంపెనీలను భారత్ వైపుకు ఆకర్షించే అవకాశం ఎంతో ఉంది.

  Trending Stories

  Related Stories