More

  గంటా దారెటు..?

  చాలా కాలం పాటు సైలెంట్‎గా ఉన్న టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మళ్లీ వార్తల్లోకెక్కారు. మరోసారి పార్టీ మారతారన్న ప్రచారం ఫుకార్లు షికార్లు చేస్తున్నాయి. డిసెంబర్ 1న తన పుట్టిన రోజు తర్వాత కీలక ప్రకటన చేస్తారన్న వదంతులు తాజాగా చర్చకు దారితీశాయి.

  గంటా శ్రీనివాసరావు… రాజకీయ రంగంలో ఈ పేరు పెద్దగా ఎవరికి పరిచయం చేయనవసరం లేదు. గంటా రాజకీయ ప్రస్థానం అందరికంటే భిన్నం. ప్రకాశం జిల్లాలో పుట్టిన గంటా శ్రీనివాసరావు విశాఖలో స్థిరపడ్డారు. వ్యాపారవేత్త నుండి రాజకీయ నేతగా ఎదిగారు. సినీ రంగం సైతం టచ్ చేశారు. ఇప్పటి వరకు మూడు పార్టీలు మారిన ఆయన ఎక్కడి నుండి పోటీ చేసినా గెలుపుమాత్రం ఖాయం. అయితే పోటీ చేసినప్పుడల్లా నియోజకవర్గం మాత్రం మార్చేస్తారు. గెలుపొందినపుడల్లా మంత్రి పదవి వరించడం.. గంటాకు ప్రత్యేకం. ప్రస్తుతం టిడిపి విశాఖ నార్త్ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా… 2019 ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గాలిని తట్టుకుని గెలవడంతో నాడు డైనమిక్ పొలిటికల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీ అధికారం పగ్గాలు చేపట్టడంతో గంటాకు మౌనం తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఈ మూడేళ్లలో అడపా దడపా గళం విప్పి తన ఉనికిని చాటుకుంటూ వస్తున్న గంటా శ్రీనివాసరావు.. పార్టీ అధినేత చంద్రబాబు వచ్చినా… కనిపించేవారు కాదు. అలా అజ్ఞాతంలో ఉంటూ మౌనం వహిస్తూ వస్తున్న గంటా… మరోసారి వార్తలో నిలిచారు. డిసెంబర్ 1న తన పుట్టినరోజు నాడు కీలక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. డిసెంబర్ 3న అనకాపల్లి జిల్లా పర్యటన నిమిత్తం విశాఖ రానున్న సీఎం వైఎస్.జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

  ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహారించిన గంటా.. ఒకానొక దశలో సీనియర్లను సైతం పక్కన పెట్టి దూసుకుపోయారన్న విమర్శలు వచ్చాయి. టిడిపిలో గెలిచినప్పటికి ఆ పార్టీకి అంటిముట్టనట్లు వ్యవహారిస్తూ సుమారు మూడున్నర ఏళ్ళు మౌనంగా ఉండిపోయారు. ప్రస్తుతం టిడిపి పరిస్థితి అయోమయంలో ఉంది. వైసీపీని ఎదుర్కోవడంలో టిడిపి విఫలమయ్యిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గంటా పక్కపార్టీల వైపు కన్నేశారట. ఒకానొక సందర్భంలో కాపు సామాజిక వర్గానికి చెందిన గంటా… ఆ ట్యాగ్‎ను సైతం వినియోగించారు. అన్ని రాజకీయ పార్టీ నేతలతో హైదరాబాద్‎లో జరిగిన సమావేశాలకు సైతం హాజరయ్యారు. స్టీల్‎ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. కానీ అవి రక్తి కట్టించలేదు. ఇవేవి సాధ్యపడక రాజకీయ పద్మవ్యూహంలో గంటా చిక్కుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అధీనంలోకి వెళ్ళిపోయిన విశాఖ… ఇక తన రాజకీయ ఎత్తుగడలకు సాధ్యపడదని గంటా కొంతకాలం వరకు భావించరట. దీంతో పాటు తాను ఎప్పుడూ వెళ్లినా టిడిపి రెడ్ కార్పెట్ పరుస్తుందన్న ధీమా కూడా గంటాలో వచ్చిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ తరుణంలో వైసీపీకి చెందిన ఉత్తరాంధ్ర అగ్ర నేతలతో గంటా శ్రీనివాసరావు మంతనాలు జరిపారని.. వారి సహాయ సహకారాలతో పార్టీ మారతారన్న ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది.

  Trending Stories

  Related Stories