యూపీ మోస్ట్ వాంటెడ్ జాబితాలోని క్రిమినల్.. తీహార్ జైలులో శవమై

0
941

ఢిల్లీలోని తీహార్ జైలులోని ఒక గ్యాంగ్‌స్టర్ అతని గదిలో శవమై కనిపించడం కలకలం రేపింది. ఈ రోజు ఉదయం జైలు నంబర్ 3 వద్ద అంకిత్ గుజ్జర్ మరణించినట్లు జైలు అధికారులు గుర్తించారు. అతను ఉత్తర ప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. అతడి తలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటికే 1.25 లక్షల రూపాయల బహుమతిని ప్రకటించారు. గుజ్జర్ ఎనిమిది హత్య కేసుల్లో నిందితుడు. అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యంత భద్రత ఉన్న తీహార్ జైలులో అంకిత్ గుజ్జర్ ఉన్నాడు. మరొక గ్యాంగ్‌స్టర్ రోహిత్ చౌదరితో కలిసి “చౌదరి -గుజ్జార్ గ్యాంగ్” ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. గుజ్జర్ తన నెట్‌వర్క్‌ను దక్షిణ ఢిల్లీలో కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలోని చాందీనగర్‌లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తిని హత్య చేసినట్లు అంకిత్ గుజ్జర్ పై అభియోగాలు మోపబడ్డాయి. ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా అవతలి వ్యక్తిని చంపేస్తామనే హెచ్చరికతో అతను గ్రామంలో పోస్టర్లు కూడా పెట్టాడని పోలీసులు తెలిపారు.

గ్రేటర్ నోయిడాలో భారతీయ జనతా పార్టీ నాయకుడు విజయ్ పండిట్‌ను హత్య చేసిన 29 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ అంకిత్ గుజ్జర్ బుధవారం ఉదయం తీహార్ జైలు కాంప్లెక్స్ లోపల శవమై కనిపించాడు. అతడిని నలుగురు వ్యక్తులు కొట్టి చంపారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హత్యకు సంబంధించి డిప్యూటీ సూపరింటెండెంట్ పాత్రపై కూడా జైలు అధికారులు విచారణ చేస్తున్నారు. గుజ్జర్ గతంలో సుందర్ భాతి గ్యాంగ్ కోసం పని చేశాడు. నోయిడా బీజేపీ నేత విజయ్ పండిట్ హత్య కేసులో 2015 లో అరెస్టయ్యాడు. అతను హత్య, దోపిడీకి సంబంధించిన ఎనిమిది కేసులతో సహా 22 కేసులలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

గుజ్జర్ తండ్రి విక్రమ్ సింగ్, తన కుమారుడి రక్షణకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో జైలు అధికారులు అతడిని హత్య చేశారని ఆరోపించారు. “నా కుమారుడు గత ఏడాదిగా తీహార్ జైలులో ఉన్నాడు. అతన్ని జైలు అధికారి కొట్టి చంపారు. తన కొడుకుకు రక్షణ ఇవ్వడానికి రూ. 10,000 డిమాండ్ చేశారు, అందుకు తన కొడుకు నిరాకరించాడు. వారు అతనిని లక్ష్యంగా చేసుకొని హత్య చేశారని ” విక్రమ్ సింగ్ ఆరోపించారు.

డీజీ (తీహార్) సందీప్ గోయల్ మాట్లాడుతూ మరణించిన వ్యక్తిని జైలు నంబర్ 3 లో ఉంచారని తెలిపారు. బుధవారం ఉదయం అతను శవమై కనిపించాడని.. న్యాయ విచారణ కొనసాగుతోందని అన్నారు. అంకిత్ గుజ్జర్ దక్షిణ-ఢిల్లీకి చెందిన గ్యాంగ్‌స్టర్ రోహిత్ చౌదరికి అత్యంత సన్నిహితుడని, రోహిత్ చౌదరిని గత ఏడాది ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ విభాగం హర్యానాలోని జజ్జర్ నుంచి అరెస్టు చేసిందని అధికారులు తెలిపారు. “అంకిత్ గుజ్జర్ ని 2016 లో యూపీ పోలీసులు అరెస్టు చేశారు. 2019 లో బెయిల్‌పై విడుదల చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, అతను రోహిత్ చౌదరిని కలుసుకున్నాడు. అతనితో కలిసి నేరాలు చేయడం ప్రారంభించారు”అని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here