National

బంగ్లా నుంచి బెంగాల్ లోకి..
బెంగళూరు ఘటనతో విస్తుపోయే నిజాలు

ఇటీవలే మనం బెంగళూరులో జరిగిన ఓ గ్యాంగ్ రేప్ గురించి మాట్లాడుకున్నాం గుర్తుంది కదా..! బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడిన.. ఓ ఆరుగురు అక్రమార్కులు అదే దేశానికి చెందిన ఓ యువతిపై.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతిని చిత్రహింసలకు గురిచేస్తూ గ్యాంగ్ రేప్‌కి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన వెలుగుచూసింది. బెంగళూరులోని రామమూర్తి నగర్‌ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని వారి చెర నుంచి విడిపించారు. బాధితురాలు అసోంకి చెందిన యువతిగా మొదట ప్రచారం జరిగినప్పటికీ.. ఆమె బంగ్లాదేశ్‌కి చెందిన యువతి అని ప్రాథమిక దర్యాప్తులోనే గుర్తించారు.

అప్పట్లో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. గ్యాంగ్ రేప్ ముఠాలో వున్నది ఆరుగురు వ్యక్తులు కాదని.. ఆ ముఠా బంగ్లాదేశ్ నుంచి కొన్ని వందల మంది మహిళలను అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చినట్లు తేలింది. ఉద్యోగాల పేరుతో అమాయక బంగ్లాదేశీ యువతులను బెంగళూరు తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు శోభుజ్ ఈ వ్యభిచార రాకెట్ వెనుక ప్రధాన సూత్రధారిగా గుర్తించారు.

బెంగళూరు గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రస్తుతం రామమూర్తి నగర్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇందులో భాగంగా బాధితురాలిని విచారించగా.. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు మహిళల అక్రమ రవాణా జరుగుతున్న చేదు నిజం వెలుగుచూసింది. తనలాగే కొన్ని వందల మంది మహిళలను మాయ మాటలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ తీసుకొస్తున్నారని తెలిపింది. గ్యాంగ్ రేప్ ఘటనలో ప్రధాన నిందితుడు శోభుజ్.. మహిళల అక్రమ రవాణాలో కీలక సూత్రధారిగా పోలీసులు తేల్చారు. అతని గ్యాంగే బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు అక్రమంగా మహిళలను తీసుకొస్తున్నట్లు గుర్తించారు. భారత్‌లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి తమను ఇక్కడికి తీసుకొచ్చారని బాధిత యువతి పోలీసులతో వెల్లడించింది. కొన్ని నెలల క్రితం తనతో పాటు కొన్ని వందల మందిని అక్రమంగా బోర్డర్ దాటించారని చెప్పింది. బంగ్లాదేశ్‌కు చెందిన రఫీక్ అష్రాఫుల్ అనే వ్యక్తి బోర్డర్‌లో భద్రతా సిబ్బందిని తప్పించుకుని రావడంలో తమకు సాయం చేశాడని తెలిపింది. శోభుజ్ గ్యాంగ్‌లో అతను కూడా ఒక సభ్యుడని తాను భావిస్తున్నట్లు చెప్పింది.

ఈ ఘటన ద్వారా పశ్చిమ బెంగాల్ లోని భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని.. అక్కడే అన్ని ఫేక్ ఐడీలు సృష్టించి.. బంగ్లా మహిళల్ని వ్యభిచార కూపంలోకి లాగుతున్నట్టు స్పష్టమవుతోంది. అక్రమ రవాణా రాకెట్ గురించి బాధిత యువత పోలీసులకు పూర్తి సమాచారం ఇవ్వడంతో.. తీగ లాగితే డొంకలు కదులుతున్నాయి. అక్రమంగా భారత్‌లోకి తీసుకొచ్చిన తర్వాత మొదట తమను బెంగాల్‌లోని హౌరాకి తీసుకెళ్లారని.. అక్కడే కొద్దిరోజుల పాటు ఉంచారని తెలిపింది. ఆ సమయంలోనే నకిలీ గుర్తింపు కార్డులను స‌ృష్టించి.. ఆపై తమను చిన్న చిన్న గ్రూపులుగా విభజించి వివిధ నగరాలకు తరలించారని చెప్పింది. ఉద్యోగాల పేరుతో తమను ఇక్కడికి తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపారని.. ఈ వ్యభిచార రాకెట్‌లో వచ్చే డబ్బుల్లో ఎక్కువ భాగం శోభుజ్‌కే వెళ్తాయని పోలీసులకు వివరించింది. బాధితురాలు వెల్లడించిన విషయాల ఆధారంగా.. శోభుజ్ గ్యాంగ్‌పై పోలీసులు ఫోకస్ చేశారు. ఆ గ్యాంగ్‌లో మొత్తం ఎంతమంది ఉన్నారు.. అసలు బంగ్లాదేశ్ నుంచి ఎన్ని గ్యాంగ్స్ భారత్‌లో మకాం వేశాయి.. వంటి వివరాలను కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 + 10 =

Back to top button