విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్

0
886

విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మతిస్థిమితం సరిగా లేని యువతిపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. ప్రేమగా మాట్లాడుతూ ఆసుపత్రికి తీసుకుని వచ్చిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆమెను ఆసుప్రతిలోని ఓ గదిలో బంధించాడు. ఆపై మరో ఇద్దరితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని పాయకాపురం వాంబే కాలనీకి చెందిన దారా శ్రీకాంత్ (26) ప్రభుత్వాసుపత్రిలో పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్టర్ వద్ద ఫాగింగ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటి సమీపంలో నివసించే 23 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని, తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో ఉద్యోగం కూడా ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన యువతి ఈ నెల 19న ఇంట్లో చెప్పకుండా బ్యాగులో దుస్తులు సర్దుకుని శ్రీకాంత్ పనిచేసే ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. శ్రీకాంత్ ఆమెను సరుకులు భద్రపరుచుకునే చిన్న గదిలో ఉంచాడు. అదే రోజు రాత్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విషయాన్ని తోటి ఉద్యోగి బాబూరావుకు చెప్పడంతో అతడు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతడు తన స్నేహితుడైన జె.పవన్ కల్యాణ్‌ను ఆసుపత్రికి రప్పించాడు. అనంతరం ముగ్గురూ కలిసి మరోమారు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు.

కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌పై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దిశ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతిని వైద్య పరీక్షల నిమిత్తం పాత ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

నున్న పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిని గుర్తించారు పోలీసులు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.