అమిత్ షాను కలవాలని కిషన్ రెడ్డిని కోరిన గద్దర్

ప్రజాగాయకుడు గద్దర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. దేశ వ్యాప్తంగా తనపై ఉన్న కేసుల గురించి ఆయనతో చర్చించారు. ఆ కేసులను ఎత్తేయాలని, ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించేందుకు ఆయన అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోరారు. తనపై కేసులను ఎత్తేయడానికి, న్యాయ సహాయం అందించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా గతంలో గద్దర్ కోరారు. ప్రభుత్వ పిలుపు మేరకు 1990లో నక్సలిజాన్ని వదిలిపెట్టి, తాను జనజీవన స్రవంతిలో కలిశానని చెప్పారు. 1997 ఏప్రిల్ 6న తనపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. తన వెన్నుపూస వద్ద బుల్లెట్ ఇప్పటికీ ఉందని చెప్పారు. ఆ బుల్లెట్ వల్ల తనకు అనేక అనారోగ్య సమస్యలు వచ్చాయని, అప్పటి నుంచి తాను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని తెలిపారు. తాను పరారీలో ఉన్నానని తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రను చేపట్టారు. ఈ యాత్రకు విశేష స్పందన వచ్చింది. తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ అవమానపరిచారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అంబర్ పేట నియోజకవర్గంలో కిషన్ రెడ్డి కంటతడి పెట్టారు. అక్కడ అందిన భారీ స్వాగతంతో భావోద్వేగానికి లోనయ్యారు. తాను కేంద్రమంత్రి అయ్యానంటే… అంబర్ పేట, సికింద్రాబాద్ ప్రజల ఆశీర్వాదమే అన్నారు. దేశానికి మంత్రినైనా అంబర్ పేట బిడ్డనే అన్నారు కిషన్ రెడ్డి. సీఎం పదవి తన చెప్పుతో సమానమని కేసీఆర్ అన్నారని.. రాష్ట్రంలో ఏ అధికారి ఎక్కడుంటారో తెలియని గందరగోళ పరిస్థితి ఉందన్నారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడి చేతిలో తెలంగాణ బందీ అయిందని.. బంధ విముక్తి కోరుకుంటోందని చెప్పారు కిషన్ రెడ్డి. హైదరాబాదులో ఆయన జన ఆశీర్వాద యాత్రను ముగించారు. ఇక ఈరోజు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన ఆస్పత్రిలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 58 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేశామని తెలిపారు. చివరి వ్యక్తి వరకు ఉచిత వ్యాక్సిన్ అందిస్తామని, దేశ ప్రజలకు టీకాలు ఇచ్చిన తరువాతే ఇతర దేశాలకు పంపిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు