పుతిన్ ఫోటో చూసి.. చొక్కాలు చింపుకుంటున్న దేశాధినేతలు..!

0
756

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అధినేతల్లో ఒకరు. అందులోనూ అగ్రరాజ్యం అమెరికా తర్వాత అత్యధిక సైనిక బలం ఉన్న రష్యాకు అధ్యక్షుడు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఫొటో ఒకటి జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రస్తావనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రష్యా-ఉక్రెయిన్‌పై సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్.. ఇలా హార్స్ రైడింగ్‌తో ఎంజాయ్ చేస్తోండటాన్ని జీ7 దేశాధినేతలు, ప్రధానమంత్రులు తప్పు పట్టారు. నిజానికి- ఇది 2009 నాటి ఫొటో. అయినప్పటికీ- ఇప్పుడు ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ.. జీ7 సదస్సులో ఇది ప్రస్తావనకు వచ్చింది. యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని ఏ మాత్రం అంచనా వేయడంలో పుతిన్ విఫలం అయ్యాడని, ఇలా తన ఇష్టాన తాను ప్రవర్తిస్తున్నాడంటూ మండిపడ్డారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చొక్కా లేకుండా గుర్రపు స్వారీ చేస్తున్న చిత్రాన్ని చూసి ఎగతాళి చేశారు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. పుతిన్‌ను కామెంట్ చేస్తూ తమ రాబోయే ఫోటోషూట్ గురించి సరదాగా మాట్లాడుకున్నట్లు ది హిల్ నివేదించింది. కోట్లు, చొక్కాలు విప్పేసి మనమందరం పుతిన్ కంటే కఠినంగా ఉన్నామని చూపించాలి అంటూ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కామెంట్‌ చేయగా.. చొక్కా లేకుండా గుర్రపుస్వారీ చేయాలి అంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ట్రూడో చమత్కరించారు. మన పెక్స్ కూడా చూపించాలి అంటూ జాన్సన్ ఈ సందర్భంగా అన్నారు.

పుతిన్ చొక్కా లేకుండా అవుట్‌డోర్ యాక్టివిటీస్ చేయడం స్ట్రాంగ్‌మ్యాన్ ఇమేజ్‌లో భాగమని.. అతను నిష్ణాతుడైన టైక్వాండో అభ్యాసకుడని ది హిల్ నివేదించింది. జర్మనీ బవేరియన్ ఆల్ప్స్‌లో జరుగుతున్న మూడు రోజుల G7 సమ్మిట్ మొదటి రోజున పుతిన్ గురించి జోక్ చేసారని ది హిల్ వెల్లడించింది. ప్రస్తుతం G7 దేశాలలో అమెరికా, కెనడా, గ్రేట్ బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్ ఉన్నాయి. జర్మనీ దక్షిణ ప్రాంతంలోని బవారియన్ ఆల్ప్స్ రీజియన్‌లో గల ఎల్మావ్ క్యాజిల్ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఈ సమ్మిట్ మొదలైంది. రెండు రోజుల కొనసాగుతుంది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్ దీనికి అధ్యక్షత వహిస్తారు. ఉగ్రవాదం, ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ, వాతావరణ మార్పులు, పర్యావరణం.. వంటి కీలక అంశాలు ఇందులో చర్చకు రానున్నాయి. అనంతరం జీ7 దేశాల ప్రతినిధులు తీర్మానాన్ని ఆమోదిస్తాయి.

ఇక రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగు నెలలకుపైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులను ముమ్మరం చేసింది. జర్మనీలో జీ7 దేశాల సదస్సు జరుగుతున్న వేళ.. వ్లాదమిర్ పుతిన్ క్షిపణులతో దాడులు చేయాలని రష్యా సైన్యాన్ని ఆదేశించడం మరింత ఉత్కంఠకు దారి తీసింది. దీంతో రష్యా సైనికులు క్షిపణులతో ఉక్రెయిన్‌ నగరాలపై విరుచుకుపడుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకొనేందుకు దాడులు ముమ్మరం చేసిన రష్యా సేనలు.. రాజధాని కీవ్‌పైనా దృష్టి పెట్టాయి. తాజాగా కీవ్‌లో క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఒకరు చనిపోగా.. నలుగురు గాయపడ్డారని స్థానిక మేయర్‌ ప్రకటించారు. అయితే.. రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులు, మొండి వైఖరిపై చర్చించిన జీ7 నేతలు పుతిన్‌కు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించిన ఏడు సంపన్న దేశాల గ్రూప్.. ఇంకా ఒంటరి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here