ఫ్రాన్స్‌లోని పారిస్‌కు చెందిన ఓ యువతి తన భారతీయ ప్రియుడిని పెళ్లాడేందుకు భారత్ కు వచ్చింది. బెగుసరాయ్ జిల్లాకు చెందిన రాకేష్‌కుమార్‌తో రిలేషన్ షిప్ లో ఉన్న ఫ్రాన్స్‌కు చెందిన మేరీ లోరీ హెర్ల్ అతడిని పెళ్లి చేసుకోవాలని భావించి భారత్ కు వచ్చేసింది. ఆదివారం నాడు హిందూ సంప్రదాయంలో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి గురించి తెలుసుకున్న తర్వాత ‘బీహారీ వరుడు’ మరియు ‘విదేశీ వధువు’ని చూసేందుకు గ్రామస్థులు ఎగబడ్డారు. సోమవారం నాడు విదేశీ వధువును చూసేందుకు బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

బెగుసరాయ్‌లోని కటహరియా నివాసి రామచంద్ర సాహ్ కుమారుడు రాకేష్ కుమార్.. పారిస్‌కు చెందిన మహిళా వ్యాపారవేత్త మేరీ లారీ హర్ల్‌ను సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. పెళ్లికి మేరీ తన తల్లితో కలిసి వచ్చింది. వధూవరులు వచ్చే వారం పారిస్‌కు వెళ్లనున్నారు.

తన కుమారుడు ఢిల్లీలో ఉంటూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తున్నాడని రాకేష్ తండ్రి రామచంద్ర సాహ్ తెలిపారు. ఆరేళ్ల క్రితం భారత్‌కు వచ్చిన మేరీతో అతడికి స్నేహం కుదిరింది. ఆమె తన దేశానికి తిరిగి వెళ్లిన తర్వాత కూడా వారు సన్నిహితంగా ఉన్నారు. తరువాత ప్రేమలో పడ్డారు. రాకేష్ కూడా మూడేళ్ల క్రితం పారిస్ వెళ్లాడు. అక్కడ రాకేష్ మేరీ భాగస్వామ్యంతో వస్త్ర వ్యాపారం ప్రారంభించాడు. ఇంతలో ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడింది. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న మేరీ కుటుంబీకులు వారి పెళ్ళికి అంగీకరించారు. మేరీ భారతీయ సంస్కృతిని ఎంతగానో ఇష్టపడింది, ఆమె భారతదేశానికి వచ్చి తన భర్త గ్రామంలో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. మేరీ తన కుటుంబ సభ్యులు మరియు రాకేష్‌తో కలిసి గ్రామానికి చేరుకున్నారు. ఇద్దరు ఆదివారం నాడు భారతీయ సనాతన సంప్రదాయం ప్రకారం వేద మంత్రాలు మధ్య ఒక్కటయ్యారు.
