ప్లీజ్ సీఎంగారు.. నాకు మంత్రి పదవి వద్దు..!

0
688

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడగా.. తాజాగా రాజస్థాన్‌లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎంకు సొంత పార్టీ ఎమ్మెల్యే, కేబినెట్‌ మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మంత్రివర్గంలో బండి నియోజకవర్గం ఎమ్మెల్యే అశోక్‌ చంద్నా.. క్రీడలు, యువజన వ్యవహారాలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఉపాధి, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిలీఫ్‌ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. కాగా, తన శాఖలపై ఇతరుల జోక్యం మితిమీరిపోయిందని తనకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు గౌరవం లేనిచోట తాను ఉండలేను అంటూ అశోక్‌.. సీఎంకు గెహ్లాట్‌కు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశాడు. తన శాఖలన్నింటిని ఆ అధికారికే ఇచ్చేయండి అంటూ అసహనం వ్యక్తంచేశారు.

అయితే, గత కొంతకాలంగా తన పరిధిలోని శాఖల్లో సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ కుల్దీప్‌ రంకా జోక్యం మితిమీరిపోయిందని ఆయన మండిపడ్డారు. తనకు సంబంధించిన శాఖల్లో రంకా తలదూర్చడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క‍్రమంలో ఆ శాఖలన్నింటిని చూసే బాధ్యతలు ఆయనకే అప్పజెప్పండి. గౌరవం లేని మంత్రి పదవి నుంచి తనను తొలగించండి అని సీఎంను అశోక్‌ చంద్నా కోరారు. దీంతో ఈ విషయం తాజాగా రాజస్థాన్‌లో చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో సీఎం అశోక్‌ స్పందించారు. మంత్రి అశోక్ చంద్నా చాలా మంచి వ్యక్తి అని సీఎం అన్నారు. అతను ఇటీవల ఎన్నో క్రీడా పోటీలను నిర్వహించారని… బాధ్యతలు పెరగడంతో కాస్త టెన్షన్ పడటంతో ఏదో అలా మాట్లాడారని వివరణ ఇచ్చారు. దీనిని సీరియస్‌గా తీసుకోకూడదని… తాను త్వరలోనే అశోక్‌ చంద్నాతో మాట్లాడతానని తెలిపారు. తాను అతనితో ఇంకా మాట్లాడలేదు కాబట్టి ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. అశోక్‌ ఒత్తిడిలో పనిచేస్తున్నట్లు ఉన్నాడని సీఎం తెలిపారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here