శుక్రవారం నుంచి వచ్చే 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ కింద ప్రభుత్వ కేంద్రాల్లో పెద్దలందరూ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా బూస్టర్ డోస్‌లను పొందవచ్చని అధికారులు బుధవారం తెలిపారు. థర్డ్ డోస్ కవరేజీని మెరుగుపరిచే లక్ష్యంతో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 18-59 మధ్య వయస్సు గల 77 కోట్ల జనాభాలో 1 శాతం కంటే తక్కువ మంది బూస్టర్ డోస్ ను వేయించుకున్నారు.
బూస్టర్ డోస్‌ను శుక్రవారం నుంచి ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్‌ను అందించనున్నారు. అర్హులైన వారు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ బూస్టర డోసును పొందవచ్చని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ నెల 15 నుంచి 75 రోజుల పాటు 18- 59 ఏళ్లున్న వారందరికీ ఉచితంగా బూస్టర్ డోసు అందించనున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.