ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలోని తాజ్ మహల్ వద్ద నమాజ్ చేసినందుకు నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు కాగా.. ఒకరు ఆజాంగఢ్ కు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.
బుధవారం సాయంత్రం తాజ్ మహల్ పరిధిలోని షాహీ మసీదులో నమాజ్ చేశారు. దీంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, సీఐఎస్ఎఫ్ అధికారులు నలుగురిని పోలీసులకు అప్పగించారు. నలుగురిపై ఐపీసీ సెక్షన్ 153 కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
తాజ్ మహాల్ లో నమాజ్ ను నిషేధిస్తూ సుప్రీం కోర్ట్ ఉత్తర్వులు ఉన్నాయి. అయితే కేవలం శుక్రవారం స్థానికులకు మాత్రమే మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు నమాజ్ చేసుకునే అవకాశం ఉందని సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ తెలిపారు. కాగా కొంతమంది మాత్రం తాజ్ మసీదుల లోపల నమాజ్ చేయడంపై కొన్ని రోజుల క్రితం వరకు నిషేధం లేదని.. తాజ్ మసీదులో క్రమం తప్పకుండా నమాజ్ చేస్తారని.. అయితే ఈ నిషేధాన్ని ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కొన్ని రోజుల నుంచి అమలు చేస్తుందని ఇంతేజామియా కమిటీ చీఫ్ ఇబ్రహీం జైదీ అన్నారు. తాజ్ లో నమాజ్ నిషేధానికి సంబంధించి బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. కాగా నలుగురు టూరిస్టులతో వచ్చిన గైడ్ వినోద్ దీక్షిత్ మాత్రం ఆ నలుగురికి నమాజ్ చేయడం నిషేధమని తెలియదని.. తెలియకుండా తప్పు చేశారని అన్నారు.