దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేసిన నేతలు చరిత్రలో కీర్తింపబడతారు. సరిహద్దుల్లోని భూభాగాలను తమ తాతల జాగీర్లుగా భావించి ఇతర దేశాలకు వదిలేసి తమ ఉదారతను చాటుకుంటారు. త్రివిధ దళాల్లో పనిచేసే సైనికులు, వారికి ఉప్పందించి బాసటగా నిలిచే నిఘా విభాగాల అధికారులు మాత్రం ప్రాణాలను ఫణంగా పెట్టి అధీన రేఖలను కంటికి రెప్పలా కాపాడతారు.
భారత్ పై అంతర్జాతీయ కుట్రల తాలూకు గుట్టు కనిపెట్టే RAW-Research and analysis wing ఆది నుంచీ అనేక సాహసాలు చేసింది. RAWలో పనిచేసే అనేక మంది అధికారుల కృషి మూలంగా సరిహద్దులన్నీ సురక్షితంగా ఉన్నాయి. దేశాధినేతలు ఏమరపాటుగా ఉన్న సందర్భాల్లో, ప్రమాదం పొంచి ఉందని భావించిన క్షణాల్లో రాజకీయ నిర్ణయాలను సైతం ప్రభావితం చేసిన ఘనత ఒక్క RAW కు, అందులో పనిచేసిన, చేస్తున్న అధికారులకు మాత్రమే దక్కుతుంది. అనేక యుద్ధాలు, ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద కుట్రలను నివారించేందుకు కృషి చేసింది రీసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్.
‘నేషనలిస్ట్ హబ్’ తన రెండో వార్షికోత్సవం సందర్భంగా చేస్తున్న ప్రత్యేక వీడియోల్లో ఇది అతి ముఖ్యమైంది. RAWలో స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన, సిక్కీం విలీనంలో కీలకంగా వ్యవహరించిన జీబీఎస్ సిద్దూజీ నేషనలిస్ట హబ్ కృషిని మెచ్చుకుంటూనే, మేం చేసిన ఓ పొరపాటును మా దృష్టికి తెచ్చారు. అందుకు నేషనలిస్ట్ హబ్ సిద్దూ గారికి రుణపడి ఉంటుంది.
నిఘావిభాగాలకు సంబంధించి పత్రికల్లో, వివిధ మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే వార్తల్లో చాలా వరకు అర్ధ సత్యాలే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వండి వార్చినవి కూడా ఉండటం కద్దు. నిజాలు బయటకు రానప్పుడు అబద్ధాలే వాటి ప్రతినిధులుగా చెలామణీ అవుతాయి. సిక్కీం విలీనం విషయంలో దోవల్ పాత్ర గురించి ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా జూన్ 20 వ తేదీన ‘నేషనలిస్ట్ హబ్’ పబ్లిష్ చేసిన వీడియోపై RAW మాజీ అధికారి, సిక్కీం విలీనంలో అత్యంత కీలక పాత్ర పోషించిన అరుదైన అనుభవం ఉన్న జీ.బీ.ఎస్ సిద్దూ స్పందించారు.
స్వయంగా ఫోన్ చేసి మరీ… విలీన కాలంనాటి వివారాలు వెల్లడించారు. సిక్కీం మెర్జర్ సమయానికి అజిత్ దోవల్ సిక్కీం లేడనే విషయాన్ని స్వయంగా ధృవీకరించారు. మా తప్పును సరిదిద్దారు. దొర్లిన పొరపాటుకు క్షంతవ్యులం. నిజాలను వెల్లడించినందుకు వారికి సదా కృతజ్ఞులం. దేశంలోనే అత్యున్నత నిఘా విభాగం RAWలో స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన జీ.బీ.ఎస్ సిద్దూ రెండు అద్భుతమైన పుస్తకాలు రాశారు.
- ‘‘Sikkim – Dawn of Democracy: The Truth Behind The Merger With India’’,
- ‘‘The Khalistan Conspiracy: A Former R&AW Officer Unravels the Path to 1984’’ లాంటి అపురూప పుస్తకాలను చరిత్రకు కానుకగా ఇచ్చారు.
సిక్కీంపై రాసిన పుస్తకం గురించి 2019, అక్టోబర్ 22న మేం చేసిన వీడియోలో వివరంగనే చెప్పే ప్రయత్నం చేశాం. ప్రస్తుతం పంజాబ్ లో మరోసారి ఖలిస్థాన్ ఉద్యమం పెల్లుబికే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, కెనడాలోని సిఖ్ డయాస్పొరా-ట్విటర్ ల మధ్య జరిగిన ‘ఒప్పంద ఉద్యమా’ల వార్తల నేపథ్యంలో జీబీఎస్ సిద్దూ రాసిన ‘‘The Khalistan Conspiracy’’ పుస్తకంలో ఆసక్తికరమైన వివరాలను తాజా స్థితి నేపథ్యంలో వివరించే ప్రయత్నం చేస్తాను. జీబీఎస్ సిద్దూ గారు 1979కి పూర్వం RAW ఆదేశాల నిమిత్తం కెనడాలోనే ఉండటం, అక్కడి పరిస్థితులపై పూర్తిగా తెలిసి ఉండటం మరో అనుకూల అంశం.
ఒక రాజకీయ పార్టీ అధికారం కోసం ఒక మారణహోమాన్ని రచించి, ఎంత అమానుషంగా అమలు చేస్తుందో చెప్పే భీతిగొలిపే చరిత్రే… జీబీఎస్ సిద్దూ రాసిన ‘‘The Khalistan Conspiracy’’ పుస్తకం. భారతదేశంలో అతిపిన్న వయసున్న ఏకైక మతం సిక్కిజాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం బలిచేసి, సిక్కు ప్రజల దైవ ప్రతీకపై సైన్యాన్ని ఉసిగొల్పిన ఘనత కాంగ్రెస్ పార్టీదే!
ఉపఖండ ఇతిహాసంలో హిందూ-సిక్కు మతాల మధ్య విభజనను, పూరించలేని అంతరాన్నీ, అంతకు మించిన వైరాన్నీ సృష్టించిన ఖ్యాతి నాటి ప్రధాని ఇందిరాగాంధీకి మాత్రమే దక్కుతుంది. జీబీఎస్ సిద్దూ తన పుస్తకంలో ఇవే అంశాలను అనుభవపూర్వకంగా చెప్పే ప్రయత్నం చేశారు. నిఘావిభాగ అధికారులు వెల్లడించే చరిత్రలోని రహస్యాలకు విలువ-ఆసక్తి రెంటితో పాటు విషాదం కూడా పెనవేసుకుపోయి ఉంటుంది. గతజల సేతుబంధనమే అయినా భవిష్యత్తు అంచనాలకు ఉపకరించే పాత రోజుల్లోని వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జూలై చివరివారంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయ్ రామ్ ఠాకూర్ కు ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ కాల్ చేసింది ఖలిస్థాన్ అనుకూల సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ వేదిక బాధ్యుడు గురు పఖ్వంక్ సింగ్ పన్నూ. దీంతో ఒక్కసారిగా మరోసారి ఖలిస్థాన్ అంశం చర్చకు వచ్చింది. నిజానికి ఈ ఏడాది మార్చినెల నుంచి కెనడాలోని సిక్కు డయాస్పొరా ఖలిస్థాన్ ఉద్యమం గురించి పదే పదే మాట్లాడుతోంది.
మార్చినెలలో భారత్-కెనడా ద్వైపాక్షిక సంబంధాల్లో సుహృద్భావ వాతావరణం నెలకొనాలని కోరుతూ కెనడాలోని సిక్కులు మువ్వన్నెల జెండాలతో కార్ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీపై హేయమైన దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది కెనడా ఎంపీ జగ్మీత్ సింగ్ తోడల్లుడు జోధ్ వీర్ ధలీవాల్. జగ్మీత్ సింగ్ పై ఖలిస్థాన్ ఉగ్ర కార్యకలాపాలకు మద్దతు ఇస్తాడనే ఆరోపణలున్నాయి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో జరిగిన రైతుల ఆందోళనలకు జగ్మీత్ సింగ్ భారీ ఎత్తున నిధులు పంపాడనేది బహిరంగ రహస్యం.
ఇదంతా కాకతాళీయంగా జరుగుతన్నదేమీ కాదు. ఇటీవల గ్రెటా థన్ బర్గ్ ‘టూల్ కిట్’ కుట్రలో భాగంగానే ఒక్కోటి బట్టబయలవుతున్నాయి. పోయెటిక్ జస్టిస్ సంస్థ ఈ కథ వెనుక దర్శకత్వం వహిస్తోంది. గ్రెటా థన్ బర్గ్ టూల్ కిట్ పై ‘నేషనలిస్ట్ హబ్’ చాలా వివరమైన వీడియోలు చేసింది. ఆధారాలను బహిర్గతం చేస్తూ కథనాలను ప్రసారం చేసింది.
ఇదంతా వర్తమానం. అసలు ఖలిస్థాన్ ఉగ్రవాదం ఎలా మొదలైంది? ఎవరు రచించిన పథకం ఇంత రక్తసిక్తంగా మారింది? ప్రపంచానికి తెలియకుండా ఉండిపోయిన రహస్యాలేంటి? ఇలాంటి అంశాలను జీబీఎస్ సిద్దూ రాసిన ‘‘The Khalistan Conspiracy’’ పుస్తకం ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సిక్కీం విలీన లక్ష్యం విజయవంతంగా నెరవేరాక ‘రా’ అధికారి జీబీఎస్ సిద్దూ 1976, సెప్టెంబర్ లో మరో ఆపరేషన్ నిమిత్తం కెనెడా వెళ్లిపోయారు. కెనడాలోని సిఖ్ డయాస్పొరా ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు యాతనలు పడుతున్నకాలమది. ఆనాటికి ‘ఖలిస్థాన్’ నినాదం హాస్యాస్పదమైందంటారు జీబీఎస్ సిద్దూ. అయితే 1981 నాటికి కెనడాతో పాటు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో క్రమంగా ‘ఖలిస్థాన్’ నినాదానికి మద్దతు పెరగడం మొదలైంది. ఖలిస్థాన్ నినాదం పంజాబ్ లో మొదలై విదేశాలకు విస్తరించలేదు. అందుకు భిన్నంగా విదేశాల్లో పుట్టి భారత్ లోకి ప్రవేశించింది. పూర్తి స్థాయి సాయుధ నిర్మాణ రూపం తీసుకోవడానికి పునాదులు కూడా పంజాబ్ లో పడలేదు.
దేశరాజధాని ఢిల్లీ ఖలిస్థాన్ ను డిజైన్ చేసింది. మోడల్ గా ఒక సన్యాసిని ఎంపిక చేసింది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే…ఖలిస్థాన్ ఉద్యమ ఆరంభంలో కీలక నిర్ణయాలను సిక్కు ప్రతినిధులు తీసుకోలేదు. ఇందిరాగాంధీ, ఆమె తనయుడు సంజయ్ గాంధీ, ఆయన అనుయాయుడు కమల్ నాథ్, వీరికి పావుగా ఉపయోగపడిన జైల్ సింగ్ లే అడుగడుగునా ఆజ్ఞలు జారీ చేశారు. అతి తక్కువ కాలంలో ‘సాయుధ’ రూపం తీసుకోవడానికి, ఆర్థిక వనరులు సృష్టించుకోవడానికి కారణమిదే ! కాంగ్రెస్ అధికార సాధనకు పంజాబ్ ప్రయోగశాలగా మారడమే దేశ చరిత్రలో విషాదం.
భింద్రన్ వాలేకు, అకాలీదళ్ మితవాద నేత హర్ చంద్ సింగ్ లోంగోవాల్ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. అతివాద పక్షానికి నేతృత్వం వహించిన భింద్రన్ వాలే సహజంగానే యువతను ఆకర్శించాడు. ఖలిస్థాన్ ఉద్యమం సాయుధ రూపు తీసుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది.
‘ఖలిస్థాన్’ కుట్ర 1978లోనే మొదలైందంటారు జీబీఎస్ సిద్దూ. ‘ఎమర్జెన్సీ’ అపప్రదనూ, కాంగ్రెస్ వ్యతిరేకతనూ ఏమార్చేందుకు అనేక కొత్త అంశాలను ఆయారాష్ట్రాల్లో ప్రచారంలోకి తెచ్చింది హస్తం పార్టీ. పంజాబ్ లో అధికారంలో ఉన్న అకాలీ-జనతా ప్రభుత్వాన్ని అస్థిరతపాలు చేయాలంటే సాధుసంతుణ్ని వెతికి పట్టుకోవాలన్న కుయుక్తిని ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీలకు నూరిపోసింది పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి జ్ఞానీ జైల్ సింగ్.
ఈ కుట్ర బీజాలు నాటింది జ్ఞానీ జైల్ సింగ్ అనేది బహిరంగ రహస్యం. సిక్కునేతను వాడుకుని, మరో సిక్కు సంతుని పావుగా చేసుకుని, సాయుధ ఉద్యమానికి తెరలేపి చివరకు సిక్కు ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేసి, అంతిమంగా ఆ నిందను మరో సిక్కుపై వేసిన ఘనత, ఆపరేషన్ బ్లూస్టార్ మరక తుడుచుకునేందుకు సిక్కు బ్యూరోక్రాట్ మన్మోహన్ సింగ్ ను ప్రధాని చేసిన అమానవీయమైన, దారణమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం.
జ్ఞానీ జైల్ సింగ్ తన ఆత్మకథ ‘‘Memoirs of Giani Zail Singh: The Seventh President of India’’లో మాత్రం ఖలిస్థాన్ కుట్రలో, రక్తపాతంలో తనకు ఎలాంటి పాత్ర లేదనీ బుకాయించే ప్రయత్నం చేశారు. పట్టణ ప్రాంత హిందూ వ్యాపార వర్గాల ప్రతినిధిగా ఉన్న జనతాపార్టీకి, మితవాద అకాలీ నాయకత్వానికి మధ్య విభేదాలు ఆనాటికే ఉన్నాయి. ఈ అవిశ్వాసాలను వాడుకుని కాంగ్రెస్ పార్టీ ‘ఖలిస్థాన్’ కుట్రకు తెరలేపింది.
జీబీఎస్ సిద్దూ రాసిన పుస్తకం మొదటి భాగం ఆసక్తికరమైన పరిశీలనతో మొదలవుతుంది. ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని, వ్యక్తిత్వాన్నీ ఎలా అంచనావేయాలన్న చారిత్రక సందేహం నుంచి ఈ భాగం ఆరంభమవుతుంది. ‘‘AN OBJECTIVE assessment by future historians of Indira Gandhi’s role as prime minister of India would not be complete without a closer scrutiny of two of her most controversial decisions – promulgation of National Emergency and Operation Blue Star.’’ అంటారు సిద్దూ. అత్యయిక స్థితీ, ఆపరేషన్ బ్లూస్టార్ నిర్ణయాలను మినహాయించి ఇందిరాగాంధీని అంచనా వేయడం అసాధ్యమంటారాయన. ఎమర్జెన్సీ విధించడమనేది స్వల్ప వ్యవధిలో తీసుకున్న నిర్ణయమే కావచ్చు, కానీ ‘ఆపరేషన్ బ్లూస్టార్’ అనే ఉత్పాతానికి 1980లోనే బీజాలు పడ్డాయంటారాయన.
ఎమర్జెన్సీకి కారణమైన నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ ఉదంతాన్ని ఈ భాగంలోనే ఊటంకించారు సిద్ధూ. ‘‘West Bengal chief minister Siddhartha ShankarRay, in a handwritten letter dated 8 January 1975, 1 had suggested mass arrest of political leaders and suspension of fundamental rights as a measure to handle the deteriorating situation. She did not pay much heed to his advice all the time.’’ దేశవ్యాప్తంగా చేసిన నేతల నిర్బంధం పర్యవసానాల గురించి ఇందిగాంధీ అనాలోచితంగా వ్యవహరించారంటారు సిద్దూ.
ఎన్నికల్లో గెలిచేందుకు భింద్రన్ వాలే ఉపయోగించుకోవాలన్న సంజయ్ గాంధీ సలహాను ఇందిగా గాంధీ ఆమోదించిందనే రహస్యం పాటియాలలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తల ద్వారా బయటకు పొక్కిన ఉదంతాన్ని సిద్దూ ఈ భాగంలో ఆసక్తికరంగా రాశారు. హిందూ, సిక్కుల మధ్య విభజన తీసుకువచ్చేందుకు ఖలిస్థాన్ నినాదాన్ని అస్త్రంగా వాడుకుంటే మెజారిటీ హిందూవుల్లో సిక్కు వ్యతిరేకత బలపడుతుందనేది సంజయ్ సూచన సారాంశం.
విదేశాల్లో ఉన్న ఖలిస్థాన్ అనుకూల శక్తుల కూపీ లాగమని 1980 చివర్లో జీబీఎస్ సిద్ధూను ఆదేశాంచా ‘రా’ అధికారులు. క్రమంగా ‘ఖలిస్థాన్’ కార్యకలాపాలు ఊపందుకోవడంతో నాటి ‘రా’ చీఫ్ ఆదేశాలతో 1981 డిసెంబర్ నుంచి 1983 సెప్టెంబర్ వరకూ సుమారు మూడు సార్లు జీబీఎస్ సిద్దూ అమెరికా, కెనడాల్లో పర్యటించి అనేక రహస్యాలను చేరవేశారు.
ఎనభయ్యో దశకానికి ముందు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆర్థిక సహకారంతో ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాలు చేసిన జగ్ జీత్ సింగ్ చౌహన్ చరిత్ర గురించి సిద్ధూ సమయానుకూలంగా వెల్లడించారు. కెనడాలో సిక్కు జనాభా సుమారు 22 శాతానికి పైగా ఉంది.
ఎందుకు సిక్కులు కెనడాలో స్థిరపడ్డారు అనే సందేహానికి రెండో భాగంలో జీబీఎస్ ఆసక్తికరమైన చరిత్రను కళ్లముందుంచారు. 1897లో మహారాణి విక్టోరియా బ్రిటిష్ భారత సైనికుల ఒక దళాన్ని డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్‌లో పాల్గొనడానికి లండన్ ఆహ్వానించారు. అప్పుడు ఒక అశ్వికదళం భారత మహారాణితోపాటు బ్రిటిష్ కొలంబియా వెళ్తోంది. ఆ సైనికుల్లో రిసాలేదార్ మేజర్ కేసర్ సింగ్ ఒకరు.
అలా, రిసాలేదార్ కెనెడాకు షిఫ్ట్ అయిన మొదటి సిక్కు అయ్యారు. కేసర్ సింగ్‌తోపాటు మరి కొంతమంది సైనికులు కెనెడాలో ఉండాలని నిర్ణయించుకున్నారు. వారు బ్రిటిష్ కొలంబియానే తన ఇల్లుగా అనుకున్నారు. మిగతా సైనికులు భారత్ తిరిగొచ్చి దానిని ఇక్కడివారికి ఒక కథలా చెప్పారు. భారత్ చేరుకున్న సైనికులు బ్రిటిష్ ప్రభుత్వం తమను అక్కడ స్థిరపడాలని కోరింది. ఇష్టం ఉన్న వారు అక్కడికి వెళ్లచ్చు అని చెప్పారు. అక్కడి నుంచే, సిక్కులు కెనెడా వెళ్లే పరంపర మొదలైంది. తర్వాత కొన్నేళ్లకే 5 వేల మంది భారతీయులు బ్రిటిష్ కొలంబియాకు చేరుకున్నారు. వారిలో 90 శాతం మంది సిక్కులే.
భింద్రన్‌వాలేను కాంగ్రెస్ వారే ప్రోత్సహించారు. అకాలీల ముందు సిక్కుల డిమాండ్ల గురించి మాట్లాడేలా ఒక వ్యక్తిని తీసుకురావాలని, వారికి లభిస్తున్న మద్దతును తగ్గించాలని భావించిన కాంగ్రెస్ అతడిని ప్రోత్సహించింది. భింద్రన్ వాలే వివాదాస్పద అంశాలపై రెచ్చగొట్టేలా ప్రసంగించడం మొదలైంది. మెల్లమెల్లగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు.
పంజాబ్‌లో హింసాత్మక ఘటనలు పెరిగాయి. 1982లో చౌక్ గురుద్వారా వదిలిన భింద్రన్‌వాలే మొదట స్వర్ణమందిరంలో గురునానక్ నివాస్, తర్వాత కొన్ని నెలలకు అకల్ తఖ్త్‌లో తన అభిప్రాయాలను అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. భింద్రన్ వాలే ప్రాబల్యం పెరిపోయి చివరికి ఇందిగాంధీకి తలనొప్పిగా మారాడు. అంతేకాదు, భింద్రన్ వాలే కాల్చేసి, ఉగ్రవాదాన్ని రూపిమాపిన కీర్తిని ప్రచార అంశంగా మార్చుకుని 1985లోపు జరగాల్సిన ఎన్నికల్లో విజయం సాధించాలన్నది కాంగ్రెస్ అసలు ఉద్దేశం.
అనుకున్నట్టుగానే జరిగింది. కాకపోతే ఇందిరాగాంధీ సిక్కు బాడీగార్డుల చేతిలో హతమైంది. ఆమె తనయుడు రాజీవ్ గాంధీ ప్రధాని పీఠమెక్కాడు. మొత్తంగా జీబీఎస్ పుస్తకం అనేక ఆసక్తికరమైన అంశాలు, అరుదైన వ్యక్తుల ప్రస్తావన, ఆశ్చర్యపోయే ఘటనల ఉద్విగ్నతలను కళ్లకు కడుతుంది.
బయటకు సద్యోజనితంగా కనిపించే రాజకీయ పరిణామాల వెనుక కనిపించని అనేక కోణాలు, ఉద్దేశాలూ, దురుద్దేశాలూ ఉంటాయనీ, ఆ నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నవారికి వాటి పర్యవసానాలు కొన్నిసార్లు అంతుబట్టవనీ జీబీఎస్ పుస్తకం సాంతం చదివితే అర్థమవుతుంది. మొత్తంగా.. ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ గా తెలుగునాట మొదలైన నేషనలిస్ట్ హబ్.. పరిశోధనాత్మక కథనాలను ప్రజలకు ముందుకు తెచ్చి.. తెలుగు మీడియాలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. మా ప్రయత్నానికి ప్రేక్షకుల ఆదరణతోపాటు.. R & AW లో కీలక పాత్ర వహించిన G. B. S. సిద్ధూ లాంటి మహానుభావుల ఆశీర్వాదాన్ని కూడా పొందడం మా బాధ్యతను ద్విగుణీకృతం చేస్తోంది. వారికి మా వినమ్ర పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం.