More

    ఫ్యాక్ట్ చెక్: మోదీ నీతా అంబానీకి నమస్కారం పెట్టారా..?

    ప్రసార భారతి మాజీ సిఈఓ జవహార్ సిర్కార్ భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీకి నమస్కారం చేస్తున్న ఓ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. జూన్ 7న జవహార్ ఈ ట్వీట్ ను చేశారు.

    ఈ ఫోటోతో పాటూ మోదీని విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘తోటి పార్లమెంటు సభ్యులు మరియు రాజకీయాల నాయకులు కూడా ఇలాంటి మర్యాద, గౌరవం పొందుతారేమోనని ఆశిస్తూ ఉన్నానని.. పరిణతి చెందిన ప్రజాస్వామ్యంలో, ద్వి-మార్గం సంబంధం, సహాయాలు, లావాదేవీలు మనకు తెలుస్తాయి. చరిత్ర ఈ విషయాన్ని తెలియజేస్తుంది’ అని జవహార్ విమర్శించారు. ఆ ఫోటోలో గౌరవంగా మోదీ నమస్కరిస్తూ ఉండగా.. అక్కడ ఫోటోలోని మహిళ నీతా అంబానీ అని తెలుస్తోంది.

    నిజా నిజాలు:

    ఆయన పోస్టు చేసిన ఈ ఫోటో ‘ఫేక్’ అని స్పష్టంగా తెలుస్తోంది. మోదీ ఒకప్పటి ఫోటోను తీసుకుని ఆ ఫోటోలో ఉన్నది నీతా అంబానీగా ఎడిట్ చేశారు.

    మోదీ సవినయంగా నమస్కరిస్తున్న ఫోటోలో ఉన్నది దీపిక మోండుల్. “Divya Jyoti Cultural Organisation and Welfare Society” అనే ఎన్జీవోను ఆమెను నడుపుతూ ఉన్నారు. ఈ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో 2015 నుండి వైరల్ చేస్తూ ఉన్నారు. ఇంకొందరు ఈ ఫోటోలో ఉన్న మహిళ ప్రముఖ పారిశ్రామిక వేత్త భార్య ప్రీతీ అదానీ అంటూ పోస్టులు పెట్టారు. ఆ వార్తలో కూడా ఎటువంటి నిజం లేదని.. పలు మీడియా సంస్థలు తేల్చి చెప్పాయి. ఢిల్లీ బేస్ ఎన్.జి.ఓ. దివ్యజ్యోతి కల్చర్ ఆర్గనైజేషన్ అండ్ వెల్ ఫేర్ సొసైటీ ఛీఫ్ ఫంక్షనల్ ఆఫీసర్ అయిన దీపిక మోండుల్ కు మోదీ నమస్కారం చేస్తున్న ఫోటో.

    ఈ ఫోటో ఫేక్ అని చెబుతూ జవహార్ ట్వీట్ కింద పలువురు నెటిజన్లు ట్వీట్లు చేశారు. ‘hidden replies’ అనే ట్యాబ్ ను క్లిక్ చేయగా.. జవహార్ అబద్దం చెబుతున్నారంటూ పలువురు ట్వీట్లు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని.. అందుకే ఇలా పోస్టులు పెడుతున్నారని విమర్శించారు నెటిజన్లు.

    తన తప్పు బయటపడిందని అనుకున్న జవహార్ చివరికి తన ట్వీట్ ను డిలీట్ చేసేశారు. మోదీ నీతా అంబానీకి వినయంగా నమస్కారం పెడుతున్న ఫోటోలో ఎటువంటి నిజం లేదు.

    Trending Stories

    Related Stories