గిరిజనుల పవిత్ర చెట్లను అక్రమంగా నరికిన మాజీ మావోయిస్టు సజీవ దహనం

0
862

చెట్లను అక్రమంగా, ఇష్టానుసారం నరుక్కుంటూ వెళుతున్న ఓ మాజీ మావోయిస్టు గ్రామస్థులందరూ కలిసి సజీవ దహనం చేశారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని సిమ్‌డేగా జిల్లాలో సాల్‌వుడ్ అటవీ చెట్లను అక్రమంగా నరికి విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై మంగళవారం (డిసెంబర్ 4) నాడు ‘సంజు ప్రధాన్’ అనే మాజీ మావోయిస్టును గ్రామస్థులు కలిసి సజీవ దహనం చేశారు. కొలెబిరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బెస్‌రాజరాలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్థానిక పోలీసులను, అధికారులను ఈ ఘటనపై దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.

ఛప్రిదీపాకు చెందిన ప్రధాన్ మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై గతంలో అరెస్టయ్యాడు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ప్రధాన్ కలప విక్రయించే వ్యాపారం ప్రారంభించాడు. ఖుత్‌కట్టి అటవీ భూమి నుంచి సాల్‌ కలపను అక్రమంగా నరికివేసినట్లు గ్రామస్థులు ఆరోపించారు. అయితే మృతుడు ఆ ఆరోపణలను ఖండించాడు. గిరిజన సంప్రదాయంలో, ఖుత్‌కట్టి అడవులు గిరిజన సమాజానికి చెందినవి. ఖుత్‌కట్టి అటవీ భూమిలో ఉన్న చెట్లను ముఖ్యంగా సాల్ వుడ్ చెట్లను గిరిజనులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. గత ఏడాది అక్టోబర్‌ 21న ప్రధాన్‌ వద్ద నుంచి భారీగా 120 సీఎఫ్‌టీ కలపను అటవీశాఖ స్వాధీనం చేసుకోవడంతో గిరిజనులు ప్రధాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై కేసు కూడా నమోదైంది.

మంగళవారం మధ్యాహ్నం బబల్‌కెర పంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులు సమావేశం నిర్వహించారు. దాదాపు 200 మంది గ్రామస్థులు ప్రధాన్‌ను అతని నివాసం నుండి బయటకు లాగి కొట్టడం ప్రారంభించారు. అతని ఇంటి నుంచి దుంగలను సేకరించి అతడిని ఉంచి నిప్పంటించారు. పోలీసులను గ్రామంలోకి రానీయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎస్పీ షామ్స్ తబ్రేజ్, ఎస్‌డిపిఓ డేవిడ్ ఎ దొడ్రాయ్, బానో, తేతైతంగార్, కోలేబిరా పోలీస్ స్టేషన్‌ల ఇన్‌ఛార్జ్ అధికారి గ్రామానికి వచ్చారు. సగం కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు గ్రామ పెద్ద సుభం బుధో, మరో 12 మందిని నిందితులుగా నమోదు చేశారు. 200 మంది తెలియని వ్యక్తులపై అల్లర్లు మరియు హత్యలకు సంబంధించి కూడా కేసులు నమోదు చేయబడ్డాయి. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న మృతురాలు సప్నా దేవి భార్య, అతని తల్లి జస్మైత్ దేవి వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేయడానికి గ్రామంలో పోలీసులని మోహరించారు. ఇది ఘోరమైన నేరమని, నిందితులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని పోలీసులు తెలిపారు. మరణించిన ప్రధాన్ గతంలో నిషేధిత నక్సల్ సంస్థ పిఎల్‌ఎఫ్‌ఐతో సంబంధం కలిగి ఉన్నాడు. అతనిపై మూడు నక్సల్ కేసులలో చార్జిషీట్ నమోదు చేశారు. కొన్నాళ్ల క్రితం బెయిల్‌పై విడుదలైన తర్వాత నక్సల్స్ కార్యకలాపాలకు దూరంగా ఉన్నాడు.