లోక్‌సభ మాజీ స్పీకర్, బీజేపీ పార్లమెంటేరియన్ సుమిత్రా మహాజన్‌కి పుస్తకాల పట్ల ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుస్తకాలు చదవడమే కాకుండా.. వాటిని సేకరించడం కూడా ఆమెకు ఎంతో ఇష్టం. ఆమె వ్యక్తిగత సేకరణలో అనేక భాషలలో రాజకీయ, చారిత్రక, ఆధ్యాత్మికతకు సంబంధించి విస్తృత శ్రేణి పుస్తకాలు ఉన్నాయి. సుమిత్రా మహాజన్ ఇప్పుడు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత పుస్తకాల సేకరణను కాస్తా ఉచిత పబ్లిక్ లైబ్రరీగా మార్చాలని నిర్ణయించుకున్నారు.
ఇటీవల సుమిత్రా మహాజన్ ఇండోర్ లోని తన నివాసంలో కొత్తగా లైబ్రరీని ప్రారంభించారు. సంవత్సరాలుగా ఆమె సేకరించిన పుస్తకాలను అందులో ఉంచారు. ఎవరైనా వచ్చి.. హ్యాపీగా చదువుకోవచ్చని ఆమె తెలిపారు. ఇండోర్ ప్రజల కోసం ఆమె రాసిన లేఖలో, ఇండోర్‌లోని మనీష్‌పురిలో తన నివాసంలో నిర్మించిన లైబ్రరీని సందర్శించాలని పుస్తక ప్రియులను ఆహ్వానించారు. ఆసక్తి ఉన్నవారు ప్రతిరోజూ సాయంత్రం 4-6 గంటల మధ్య లైబ్రరీని సందర్శించవచ్చు. చదవడానికి ఉచితంగా పుస్తకాన్ని తీసుకోవచ్చు. సుమిత్రా మహాజన్ ఇండోర్ నగరం నుండి ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత తీసుకున్న ఈ చొరవ కారణంగా ఎంతో మంది పుస్తక ప్రియులకు సహాయంగా నిలవనుంది.
“నాకు చదవడం పట్ల ఉన్న ఆసక్తి కారణంగా, నా స్నేహితులు, బంధువులు నాకు పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు. వక్తగా, పుస్తకాలు కొనడం, వేరే వాళ్లకు ఇవ్వడం ఇలా కొనసాగింది. సంవత్సరాలుగా, నా వ్యక్తిగత పుస్తకాల సేకరణ ఒక లైబ్రరీగా అభివృద్ధి చెందింది” అని ఆమె లేఖలో చెప్పుకొచ్చారు. లైబ్రరీలో ప్రజలు మరాఠీ, హిందీ, ఇంగ్లీషుతో సహా వివిధ భాషలలో ఆధ్యాత్మికత, రాజకీయ, నాన్-ఫిక్షన్ మొదలైన పుస్తకాలు చదవవచ్చు.
సుమిత్రా మహాజన్ పద్దెనిమిదవ శతాబ్దపు మాల్వా రాణి జీవితం ఆధారంగా దేవి అహల్యాబాయి హోల్కర్‌పై ‘మాతోశ్రీ’ అనే పుస్తకాన్ని కూడా రచించారు. లోక్‌సభ అధినేత్రిగా ఆమె తరచూ అసెంబ్లీ లైబ్రరీని సందర్శించి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని ఎంపీలను కోరేవారు.
