More

    19 సంవత్సరాలు తప్పించుకుని తిరుగుతున్న టెర్రరిస్ట్.. ఎట్టకేలకు

    గత 19 సంవత్సరాలుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ మాజీ ఉగ్రవాదిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేశారు. దుల్లా అలియాస్ జమీల్‌గా గుర్తించబడిన అతను దాదాపు రెండు దశాబ్దాలుగా అరెస్టును తప్పించుకుంటూ ఉన్నాడు. తాజా నివేదికల ప్రకారం జమీల్‌ను కిష్త్వార్‌లోని కుంద్వార్ ఛత్రూలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు పట్టుకున్నారు. గులాం బకర్‌వాల్ కుమారుడైన జమీల్ రియాసి జిల్లాలోని అర్నాస్‌కు చెందినవాడు. పోలీసు అధికారులు అరెస్ట్ గురించి మాట్లాడుతూ “విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం పోలీసులు అతడు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఇన్స్‌పెక్టర్ సందీప్ పరిహార్ నేతృత్వంలోని బృందం పరారీలో ఉన్న జమీల్ ను అరెస్టు చేసింది” అని తెలిపారు. రణబీర్ పీనల్ కోడ్ (RPC) సెక్షన్ 120B (నేరపూరిత కుట్ర), 435 (అల్లర్లు) మరియు ఆయుధాల చట్టం సెక్షన్ 7/27 కింద జమీల్ పై చాట్రూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జమీల్ హిజ్బుల్ ముజాహిదీన్ తో సంబంధాలు కలిగి ఉన్నాడు. 2002 లో ఒక తీవ్రవాద ఘటనకు సంబంధించిన కేసులో వాంటెడ్ అయ్యాడు.

    గత 11 రోజులుగా ఉగ్రవాదుల స్థావరాలపై భారీగా దాడులు చేపట్టారు. పరారీలో ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో నజీర్ అహ్మద్ మరియు నయీమ్ అహ్మద్ 12, 13 సంవత్సరాల తర్వాత పట్టుబడ్డారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు గత కొన్ని వారాలుగా అనేక మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 17 న కిష్త్వార్‌లోని మర్వాకు చెందిన అబ్దుల్ గని అనే మరో మాజీ తీవ్రవాదిని జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. గని కూడా గత 20 సంవత్సరాలుగా అరెస్ట్ నుండి తప్పించుకుంటున్నాడు. సెప్టెంబర్ 15 న, మరో మాజీ తీవ్రవాది నజీర్ అహ్మద్ 12 సంవత్సరాల తర్వాత అరెస్టయ్యాడు. అంతకు ముందు జూలై 6 న, కిష్త్వార్ పోలీసులు 13 సంవత్సరాల క్రితం కేసుకు సంబంధించి నయీమ్ అహ్మద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎంతో మంది తీవ్రవాదులు ఇంకా ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నారు. ఇంకొందరు పాకిస్తాన్ లో తలదాచుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు తీవ్రవాద సంస్థల్లో యాక్టివ్ గా పని చేసి ప్రస్తుతం తప్పించుకుని తిరుగుతూ.. తీవ్రవాదులకు సమాచారం అందిస్తూ ఉన్నారు కొందరు.

    ప్రభుత్వ అధికారులు కూడా తీవ్రవాదులకు సహాయం చేస్తూ:

    తీవ్రవాదులకు సహాయం చేస్తున్న ప్రభుత్వ అధికారులపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూకశ్మీర్‌ పాలనా యంత్రాంగం ఇటీవలే విధుల నుంచి తప్పించింది. తాజాగా ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేశామని అధికారులు చెప్పారు. గత 6 నెలల కాలంలో మొత్తంగా 25 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు కశ్మీర్‌ అధికారులు వెల్లడించారు. పాక్‌ కేంద్రంగా పనిచేసే హిజ్బుల్‌ మొజాహిదీన్‌ ఉగ్రసంస్థ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌ ఇద్దరు కుమారులనూ గతంలో ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగింది. శ్రీనగర్‌లో శాసన మండలి సభ్యుని ఇంట్లో ప్రభుత్వ ఆయుధాలను దొంగిలించిన కానిస్టేబుల్‌ షౌకత్‌ ఖాన్‌ను కూడా విధుల నుండి తప్పించారు.

    Trending Stories

    Related Stories