More

    లడఖ్ లో తీరు మారితేనే భారత్ తో సంబంధాలు మెరుగుపడతాయి: చైనా కు చెప్పిన మంత్రి ఎస్. జైశంకర్

    వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి భారత్-చైనా దేశాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. చైనా దూకుడును ఎప్పటికప్పుడు భారత్ అడ్డుకుంటూనే ఉంది. చర్చల ద్వారానే భారత్-చైనా దేశాల మధ్య సమస్యలు పరిష్కారమవుతాయనని ప్రపంచ దేశాలు కూడా భావిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీ భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీ మధ్య షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా భేటీ జరిగింది. ఎల్ఏసీ వెంబడి ఏర్పడిన పరిస్థితులను చర్చించారు. వీటిని చక్కదిద్దడానికి సీనియర్ మిలిటరీ కమాండర్ల సమావేశం ఏర్పాటు చేయాలని ఇరు వర్గాలు భావించాయి. కేంద్రమంత్రి జైశంకర్ ఈ భేటీపై వ్యాఖ్యలు చేశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో గంటపాటు సమావేశమయ్యానని.. ఎల్ఏసీ పశ్చిమ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టు పేర్కొన్నారు. సరిహద్దుల వద్ద ఏకపక్షంగా మార్పులు చేస్తే అంగీకరించబోమని..ఇరుదేశాల సంబంధాలు బలోపేతం కావాలంటే సరిహద్దుల వద్ద శాంతి, సామరస్యం పూర్తిస్థాయిలో పునరుద్ధరణ, కొనసాగింపు అవసరమని చెప్పినట్టు జైశంకర్ తెలిపారు.

    ఇద్దరి మధ్య సంభాషణలు సానుకూలంగా జరిగాయని తెలుస్తోంది. కాని తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత-చైనా సంబంధాలపై వివరణాత్మక అభిప్రాయాల మార్పిడి చోటు చేసుకుంది. లడఖ్ లో చైనా చేపట్టిన చర్యల పట్ల భారత్ విమర్శలు చేస్తోంది. పాంగోంగ్ త్సో ప్రాంతంలోని ఎల్ఏసి వద్ద చోటు చేసుకుంటున్న ఘటనలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. లడఖ్ లోని పరిస్థితులు భారత్-చైనా బంధాలకు అడ్డంకిగా మారుతుందని భారత్ చైనాకు మరోసారి స్పష్టం చేసింది. గత ఏడాది జూన్‌లో తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారతీయ, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. భారత సైన్యంలో ఇరవై మంది సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. చైనా సైనికులు 40 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. తొమ్మిది నెలల ప్రతిష్టంభన తరువాత, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల మిలిటరీలు పాంగోంగ్ సరస్సు వద్ద బలగాలను వెనక్కు పిలిపించడంపై ఒక ఒప్పందానికి వచ్చారు. కానీ ఇటీవల చైనా పెద్ద ఎత్తున సైన్యాన్ని బోర్డర్ కు తరలించగా.. భారత్ కూడా సైనికులను ఎప్పుడూ లేనంతగా బోర్డర్ కు చేరవేసింది.

    Trending Stories

    Related Stories