International

తినడానికి ఏమీ లేదు.. ఆఫ్ఘన్ లో దారుణ పరిస్థితులు

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న నెలరోజుల్లోనే అక్కడి ప్రజల జీవితంలో భారీగా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. పనులు లేక ఆదాయాలు రాక చాలా దారుణమైన స్థితికి దిగజారిపోయారు మిడిల్ క్లాస్ కుటుంబాలు, పేద ప్రజలు. ఉపాధి లేక, చేతిలో డబ్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కన్నబిడ్డలకు భోజనం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులను అమ్ముకుంటూ ఉన్నారు. సోఫా, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, బీరువా ఇలా అమ్మకానికి అనువైన వస్తువులను వీధుల్లోకి తీసుకొచ్చి అతి తక్కువ ధరకే అమ్మేస్తూ ఉన్నారు. వచ్చిన డబ్బులతో పిల్లలకు ఆహార పదార్థాలు కొనుక్కుంటున్నారు. ఇలా విక్రయించేవారితో కాబూల్ వీధులు రద్దీగా మారాయి. ఇప్పుడైతే ఉన్నవి అమ్ముకోడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో పరిస్థితి ఏమిటి అన్నది వాళ్లకు కూడా అర్థం అవ్వడం లేదు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరీ దారుణంగా మారుతాయని భయపడుతూ ఉన్నారు ఆఫ్ఘన్ ప్రజలు.

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సమయం పడుతూ ఉండడం కూడా ప్రజలను మరింత దారుణ పరిస్థితులలోకి నెడుతున్నాయి. అధికారం విషయంలో తాలిబాన్లలో కుమ్ములాటలు మొదలయ్యాయని వర్గాలు చెబుతున్నాయి. పాలనా పగ్గాలు చేతికి రాగానే తాలిబాన్ నేతల్లో విభేదాలు ముదురుతున్నాయి. తాలిబాన్లలో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. సోమవారం రెండువర్గాల మధ్య అధ్యక్ష భవనంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో తాలిబన్‌ అగ్రనేత, సహవ్యవస్థాపకుడు అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ మరణించాడని పుకార్లు షికారు చేశాయి. కానీ తాను బతికే ఉన్నానని బరాదర్‌ ఒక ఆడియో రిలీజ్‌ చేశాడు. ఆఫ్ఘన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనగానే బరాదర్‌ నాయకుడిగా ఉంటారని ఎక్కువమంది భావించారు. కానీ అనూహ్యంగా అఖుండ్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయని తెలుస్తోంది. కొత్త ప్రభుత్వంలో కాందహార్‌కు చెందిన పాతతరం తాలిబాన్లతో పాటు అల్‌కాయిదా, పాక్‌ ఐఎస్‌ఐతో సత్సంబంధాలున్న హక్కానీలకు పెద్దపీట దక్కింది. ఇరాన్‌ అండ ఉన్న పశ్చిమ తాలిబాన్‌ గ్రూపునకు అసలు ప్రాధాన్యమే దక్కలేదు. గతంలో తాలిబాన్‌ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాందహార్‌ గ్రూపుదే ప్రభుత్వంలో ఆధిపత్యం ఉండేది. కానీ తాజా ప్రభుత్వంలో హక్కానీలకు ప్రాధాన్యత పెరిగింది. హక్కానీల మీద నెగటివ్ ఇంపాక్ట్ కారణంగా ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని యూఎస్, మిత్రపక్షాలు గుర్తించడం లేదు. అమెరికాలోని ఆఫ్ఘన్ బ్యాంకు నిధులు కూడా విడుదల అవ్వడం లేదు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళుతోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజల పరిస్థితులు పాతాళంలోకి కూరుకుపోతాయని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.

Related Articles

Back to top button