ఒక్క యాడ్ కోసం.. అంత సాహసమా..!

కొన్ని కొన్ని సార్లు అందరినీ ఆకర్షించడానికి ప్రకటనల విషయంలో చాలా కష్టాలే పడాల్సి ఉంటుంది. అందుకే యాడ్స్ కోసం ఎన్నో లక్షలు, కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని సార్లు స్టంట్స్ కూడా చేయడం కామనే..! తాజాగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ వస్తోంది. అందులో ఓ మహిళ ఎత్తైన కట్టడం పైన నిలుచుని తమ సంస్థ గురించిన వివరణ ఇచ్చింది. అయితే ఇది నిజమా లేక అబద్ధమా అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఇది నిజమైనదేనని సదరు సంస్థ తెలిపింది.
ప్రపంచంలోనే అత్యంత బిల్డింగ్ కొన అంచున నిలబడి.. 830 మీటర్ల ఎత్తులో బలమైన గాలుల మధ్య నిలబడి చేసిన ప్రమోషన్ ను ఇప్పుడు అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు. ఆ మహిళ ప్రపంచంలోనే ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా కొనంచున నిలబడింది. విమానయాన సంస్థ ఎమిరేట్స్ వాణిజ్య ప్రకటన కోసం ఆమె ఏ మాత్రం జంకకుండా నటించింది. 33 క్షణాలున్న ఆ ప్రకటనలో నటించిన మహిళ పేరు నికోల్ స్మిత్ లూద్విక్. ఆమె స్కై డైవింగ్ శిక్షకురాలు. యోగా గురువు కూడా. ప్రకటనలో భాగంగా బిల్డింగ్ కొనంచున నిలబడి బ్రిటన్ ‘యాంబర్ లిస్టు’లో యూఏఈని చేర్చినందుకు మేం గాల్లో తేలిపోతున్నాం. ఫ్లై ఎమిరేట్స్, ఫ్లై బెటర్ అనే ప్లకార్డులను నికోల్ ప్రదర్శించింది. తన జీవితంలో ఇదే అత్యంత ఉత్కంఠభరితమైన స్టంట్ అని ఆమె తెలిపింది. ఇంత మంచి వాణిజ్య ప్రకటనను షూట్ చేసినందుకు ఎమిరేట్స్ కు ధన్యవాదాలు అని తెలిపింది. కొందరు అసలు ఇది నిజమా? అబద్ధమా? అని అనుమానాలు రావడంతో నిజమేనని క్లారిటీ ఇచ్చింది ఫ్లై ఎమిరేట్స్ సంస్థ. ఆ ప్రకటనకు సంబంధించిన మేకింగ్ వీడియోను ట్వీట్ చేసింది. ఒక్క యాడ్ కోసం ఇంత సాహసం చేసిన ఆమెను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తూ ఉన్నారు.