సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఇతరుల భౌతికకాయాలను తీసుకుని వెళ్తున్న అంబులెన్స్‌లపై పూల వర్షం

0
719

తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్‌ ప్రాంతంలో బుధవారం నాడు ఇండియన్‌ ఆర్మీ హెలికాప్టర్‌ కుప్ప కూలిన ఘటనలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్య, 12 మంది సైనిక అధికారులు మరణించారు. బిపిన్‌ రావతో సహా ప్రమాదంలో మృతి చెందిన 13 మంది భౌతికకాయాలను మద్రాస్‌ రెజిమెంట్‌ కేంద్రం నుండి సూలూరు ఎయిర్‌బేస్‌ తరలించారు. అక్కడి నుండి దేశ రాజధాని ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తరలిస్తారు. బిపిన్‌ రావత్‌ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన బౌద్ధ గురువు దలైలామా.. ఆయన మృతి దురదృష్టకరమన్నారు. దేశ రక్షణ కోసం రావత్‌ అందించిన సేవలు చిరస్మరణీయం అని పేర్కొన్నారు. జనరల్‌ రావత్‌, ఇతర సైనిక అధికారుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇవాళ ఉదయం తమిళనాడులోని వెల్లింగ్టన్‌లోని మద్రాసు రెజిమెంటల్‌ కేంద్రానికి వెళ్లి బిపిన్‌ రావత్‌ భౌతిక కాయానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నివాళులు అర్పించారు. అదే సమయంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌.. బిపిన్‌ రావత్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు.

సీడీఎస్‌ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సిబ్బంది భౌతికకాయాలను నీలగిరి జిల్లాలోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ నుంచి సూలూర్ ఎయిర్‌బేస్‌కు అంబులెన్స్‌లలో తరలించారు. స్థానిక ప్రజలు రహదారుల పక్కగా బారులు తీరారు. బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సిబ్బంది భౌతికకాయాలను తీసుకువెళ్తున్న అంబులెన్స్‌లపై స్థానికులు పూల జల్లు కురిపించారు. అనంతరం వారి మృతదేహాలను సూలూర్‌ ఎయిర్‌బేస్‌ నుంచి ప్రత్యేక సైనిక విమానంలో ఢిల్లీకి తరలించారు.

రావత్‌ మృతి పట్ల అమెరికా సంతాపం ప్రకటించింది. అమెరికా, భారత్‌ మధ్య రక్షణ భాగస్వామ్యంలో రావత్‌ బలమైన ప్రతినిధిగా నిలిచారని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయనది కీలక పాత్ర అని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.