More

    ప్రధాని మోదీపై పూల వర్షం.. భద్రతా సిబ్బందికి చెప్పి సామాన్యుడి బహుమతిని స్వీకరించిన మోదీ

    భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కారణంగా వారణాసిలో పండగ వాతావరణం నెలకొంది. ఢిల్లీ నుంచి వార‌ణాసికి చేరుకున్న‌ మోదీకి స్వాగ‌తం ప‌లుకుతూ అక్క‌డి ప్ర‌జ‌లు ఆయ‌న‌పై పూల వ‌ర్షం కురిపించారు. కాశీ గంగా న‌దిలో మోదీ పుణ్య‌స్నానం ఆచ‌రించారు. గంగా న‌దిలో క‌ల‌శంతో పుష్పాలు వ‌దిలారు. ల‌లితా ఘాట్ వ‌ద్ద మోదీ జ‌ల‌త‌ర్ప‌ణం చేశారు. గంగా మాత‌కు పుష్పాలు అర్పించారు. సూర్య భ‌గ‌వానుడికి పూజ‌లు చేశారు. కాషాయ వ‌స్త్రాల్లో.. గంగా జ‌లాన్ని తీసుకుని ఆయ‌న బాబా విశ్వ‌నాథుడి వ‌ద్ద‌కు వెళ్లారు. విశ్వ‌నాథుడికి ఆ జ‌లంతో అభిషేకం చేయ‌నున్నారు. కాశీ చేరుకున్న ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలభైరవుడికి హారతి ఇచ్చారు.

    ఆయన ర్యాలీగా వస్తుండగా ఆయనను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఓ వ్యక్తి.. ప్రధాని మోదీకి తలపాగా, శాలువా బహుకరించేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అది గమనించిన ప్రధాని మోదీ.. భద్రతా సిబ్బందికి సర్దిచెప్పి.. ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచారు. అతని నుంచి తలపాగా, శాలువా స్వీకరించి ధన్యవాదాలు తెలిపారు. వారణాసిలోని నాలుగు రోడ్ల కూడలిలో కారు దిగి ప్రజల మధ్యకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజలకు నమస్కరిస్తూ వారి ఆశీర్వాదం పొందారు.

    1669లో అహల్యాబాయి హోల్కర్ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించగా.. దాదాపు 350 ఏళ్ల త‌ర్వాత‌ ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ విస్తరణ, పునరుద్ధరణ కోసం 2019 మార్చి 8న ఆలయ కారిడార్‌కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్ప‌టికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ కారిడార్‌ను 50 వేల చదరపు మీటర్లలో నిర్మించారు. ప్రధాన ప్రవేశ మార్గం గంగానది వైపు లలితా ఘాట్ నుంచి ఉంటుంది. ఈ కారిడార్‌ను మొత్తం 3 భాగాలుగా విభజించారు. ఈ కారిడార్‌లో 24 భవనాలనూ నిర్మించారు. కాశీ విశ్వనాథుడి ఆలయ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూ నిర్మించిన కారిడార్‌ను ప్రధాని మోదీ దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. రూ. 339 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. దివ్యకాశీ-భవ్య కాశీ కార్యక్రమ వీక్షణకు దేశవ్యాప్తంగా 51వేల చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దేశంలోని ప్రముఖ శివాలయాలు, ఆశ్రమాల్లో ఎల్​ఈడీ తెరలు ఏర్పాటు చేశారు.

    Trending Stories

    Related Stories